గౌతమ్ మోసగాడు అనే నిజాన్ని అందరి ముందు బయటపెడుతుంది దీప. అతడిని కొడుతుంది. దీపపై రివర్స్ ఎటాక్ మొదలుపెడతాడు గౌతమ్. ఓ వంట మనిషి నాపై లేని పోని నిందలు వేసి కొడుతుంటే సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారని శివన్నారాయణ ఫ్యామిలీ మెంబర్స్‌పై గౌతమ్ ఫైర్ అవుతాడు. మీ అమ్మాయి మనసులో మరొకరు ఉన్నారని తెలిసి కూడా పెళ్లికి ఒప్పుకోవడం నా తప్పు అని అంటాడు.
దీపకు మీకు ఏం సంబంధం లేదని అన్నారు. కానీ ఈవిడ మీ మనవడి భార్య కాదా అని దీపను చూపిస్తూ శివన్నారాయణను అడుగుతాడు కార్తీక్.
శ్రీధర్‌ను చూపిస్తూ ఆయన మీ ఇంటి అల్లుడు. అతడిని ఎందుకు దూరం పెట్టారో నాకు తెలుసు. అయినా నేను మిమ్మల్ని అడిగానా అని గౌతమ్ అంటాడు. ఇన్ని తప్పులు మీ వైపు ఉన్నా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ నేను ఏ తప్పు చేయకుండానే నాపై నిందలు వేశారు. వంట మనిషి కొడుతుంటే చూస్తూ ఊరుకున్నారని గౌతమ్ రచ్చ చేస్తాడు. ఏం జరిగిందో నేను అడిగి తెలుసుకుంటానని గౌతమ్‌కు సర్ధిచెప్పాలని చూస్తాడు దశరథ్. జరిగిన అవమానం చాలు ఎవరిని ఏం అడగాల్సిన అవసరం లేదని ఎంగేజ్‌మెంట్ రింగ్ తీసి విసిరికొడతాడు గౌతమ్.
ఎంగేజ్‌మెంట్ మాత్రమే కాదు ఈ పెళ్లి కూడా జరగదని కోపంగా అంటాడు. మర్యాదగల కుటుంబం అన్నారు. ఇదేనా మీ మర్యాద అని గౌతమ్ తల్లి అంటుంది. ఇది మర్యాదగల కుటుంబమే మీ అబ్బాయే మర్యాద మనిషి కాదని దీప బదులిస్తుంది. దీప మాటలతో కోపంగా తన తల్లిదండ్రులను తీసుకొని గౌతమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
గౌతమ్ ఫ్యామిలీ వెళ్లిపోగానే గోవిందా గోవిందా అని శ్రీధర్ వెటకారంగా అంటాడు. నిశ్చితార్థం పోయింది. కార్తీక్ క్యాటరింగ్ సూపర్‌గా ఉంటుంది. అందరం భోజనం చేసి వెళ్లిపోదామని బంధువులతో అంటాడు శ్రీధర్. నీ భార్యను అడ్డుపెట్టుకొని నా మనవరాలి ఎంగేజ్‌మెంట్‌ను చెడగొడతావా అని కార్తీక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు శివన్నారాయణ. ఓ దుర్మార్గుడి చేతిలో మీ మనవరాలి జీవితం నాశనం కానందుకు సంతోషపడండి అని దీప బదులిస్తుంది. నోర్మూయ్ నీతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉందని అంటాడు. క్యాటరింగ్‌కు వచ్చిన దానికి బయట ఎక్కడో ఉండక లోపలికి ఎందుకొచ్చి చచ్చావని దీపపై చిందులు తొక్కుతాడు.
ఆ అబ్బాయి మంచివాడు కాదని దీప అంటుంది. నువ్వు మంచిదానివా అని దీపను నిలదీస్తాడు శివన్నారాయణ. నిన్ను ఇంటి అల్లుడిని చేస్తానని సుమిత్రకు, భర్తను చేస్తానని జ్యోత్స్నకు మాట ఇచ్చింది దీప. ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేదు. నిన్ను పెళ్లిచేసుకున్నదని దీపను తప్పు పడుతూ కార్తీక్‌తో అంటాడు శివన్నారాయణ. మాట మీద నిలబడని మనుషులు, విలువలేని బతుకులు అని అవమానిస్తాడు. మీరొచ్చి మా తప్పులు వేలేత్తి చూపించాలా అని తక్కువ చేసి మాట్లాడుతాడు.
ఈ తరంలో ఇంట్లో జరుగుతున్న మొదటి, చివరి శుభకార్యం ఇదేనని మనసు చంపుకొని పంతాలు వదలుకొని నీ ఇంటి గుమ్మం తొక్కాను. నిన్ను కొడుకుతో పాటు శుభకార్యానికి ఆహ్వానించాను. అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమైందని కాంచనతో అంటాడు శివన్నారాయణ. క్యాటరింగ్ కూడా మీకే ఇస్తానని అంటే సరే అన్నాను. ఆ రెండు తప్పుల ఫలితంగా ఇప్పుడు జ్యోత్స్న పెళ్లి ఆగిపోయిందని శివన్నారాయణ అంటాడు.
గౌతమ్ మంచివాడు కాదని, పెళ్లి చెడిపోయినందుకు సంతోషించమని దీప అంటుంది. దేనికే సంతోషించేది అని దీపను కొట్టడానికి చెయ్యేత్తుతుంది పారిజాతం. గౌతమ్ ఎలాంటివాడో తమకు తెలుసునని, జ్యోత్స్సతో పాటు కలిసి చదువుకున్నాడని, వాడు ఎలాంటివాడో నా మనవరాలికి తెలియదా అని పారిజాతం అంటుంది. తెలియకే జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని దీప అంటుంది.
నాకు అంతా తెలుసు. నువ్వు అనుకున్నదే జరిగింది. నాపెళ్లి ఆగిపోయిందని జ్యోత్స్న రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది. నేను ఏం పాప చేశాను. నీ కోడలు నా మీద ఎందుకు ఇంత పగ పట్టిందని కాంచనతో ఎమోషనల్‌గా అంటుంది జ్యోత్స్న. దీప ఇదంతా కావాలనే చేసిందని నిందలు వేస్తుంది.
తాను పుట్టడమే కార్తీక్‌కు భార్యగా పుట్టానని, అది నేను కోరుకోలేదని జ్యోత్స్న అంటుంది. నా ఇష్టాఇష్టాలతో పనిలేకుండా భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేయకుండా నీకు కార్తీక్‌కు పెళ్లి అని అందరూ నాలో ఆశలు పెంచారు. బావే నా భర్త, బావతోనే నా జీవితం అని అనుకున్నాను. బావతో నా పెళ్లి అన్నారు. ముహూర్తాలు పెట్టారు. కానీ పెళ్లి జరగలేదు. కారణం ఎవరు...దీప అని జ్యోత్స్న కోపంగా అంటుంది.
నా మెడలో పడాల్సిన తాళి దీప మెడలో పడింది. నా భర్త కావాల్సిన కార్తీక్ దీప భర్త అయ్యాడు కోపంగా అంటుంది. ఆ బాధ నుంచి బయటపడి అమ్మానాన్నల కోసం వాళ్లకు నచ్చిన మరొ అబ్బాయిని పెళ్లి చేసుకొని అందరికి దూరంగా వెళ్లిపోదామని అనుకున్నాను. కానీ దీప ఈ పెళ్లి కూడా జరగనివ్వలేదని జ్యోత్స్న అంటుంది.
సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా నిందలు వేసింది, గౌతమ్‌ను కొట్టి పెళ్లి ఆపించింది. దీప కారణంగా నా మనసు ఎన్ని సార్లు ముక్కలు చేసుకోవాలని అని నిలదీస్తుంది. నాకు అసలు జీవితంలో పెళ్లి జరగనివ్వగా, నన్ను మనశ్శాంతిగా బతకనివ్వవా, ఏదో ఒక నిందలు వేస్తూ బాధపెడుతూ చంపుతూనే ఉంటావా అని దీపను నిలదీస్తుంది జ్యోత్స్న. నీ మంచి కోసమే చేశానని దీప బదులిస్తుంది. ఇదా నువ్వు చేసిన మంచి అని ఎంగేజ్‌మెంట్ కోసం తెచ్చిన పూలు, పండ్లు అని విసిరికొడుతుంది. దీపను ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని అంటుంది.
అమ్మ దరిద్రదేవతా ఇక్కడి నుంచి వెళ్లిపో అని దీపను బయటకు నెట్టేస్తుంది పారిజాతం. కార్తీక్ అడ్డుకోబోతే నీ పెళ్లాం నీ మరదలి జీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నావురా దరిద్రుడా అని కార్తీక్‌ను అవమానిస్తుంది పారిజాతం. దీపను బయటకు గెంటేస్తుంది. కాశీతో పాటు అందరిని వెళ్లిపొమ్మని అంటుంది. దీప ఫ్యామిలీ వెళ్లిపోగానే జ్యోత్స్న కన్నీళ్లతో కుప్పకూలిపోతుంది.
తన కూతురు నిశ్చితార్థాన్ని చెడగొట్టిన దీపపై కోపంతో రగిలిపోతుంది సుమిత్ర.
దీప ఇంటికొస్తుంది సుమిత్ర. నా కూతురు ప్రాణాలు తీసే వరకు వదిలిపెట్టావా దీపపై ఫైర్ అవుతుంది. జ్యోత్స్న వట్టి వెర్రిబాగులదని, ఎన్ని గొడవలు జరిగినా అత్త, బావ అంటూ మీ గురించే ఆలోచిస్తుంటుంది. మిమ్మల్ని మా కుటుంబంలో ఎలా కలపాలా అని చూస్తుందని సుమిత్ర తన కూతుని వెనకేసుకొస్తుంది సుమిత్ర. గౌతమ్‌పై నువ్వు వేసిన నిందలు నిరూపించమని దీపతో ఛాలెంజ్ చేస్తుంది. సాక్ష్యం లేని నింద నీటి మీద రాతలాంటిది అని సుమిత్ర అంటుంది.
నవ్వులతో నిండిపోవాల్సిన నా కూతురి కళ్లు కన్నీళ్లతో నిండిపోయానని, అందుకు కారణం ఈ మనసులేని మనిషి అని దీపను చూపిస్తూ కోపంగా అంటుంది సుమిత్ర. నా కూతురు నీకు ఏం అన్యాయం చేసింది? ఏం పాపం చేసింది? జ్యోత్స్నపై ఎందుకు ఇంత పగను పెంచుకున్నావని దీపను నిలదీస్తుంది సుమిత్ర. గౌతమ్ మంచివాడు కాకపోతే సాక్ష్యం చూపించమని గొడవ చేస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం