Karthika Deepam 2: దీపపై చిరాకుతో అరిచిన కార్తీక్ -శౌర్య ప్రాణాలకు రిస్క్- దశరథ్ ట్విస్ట్‌కు వణికిన జ్యోత్స్న
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జనవరి 17 ఎపిసోడ్‌లో శౌర్య ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బులను ఎలా అడ్జెస్ట్ చేయాలో తెలియక కార్తీక్ సతమతమవుతాడు. స్నేహితుడు రవిని అప్పు అడుగుతాడు. మీ తాతకు సారీ చెబితే ఈ కష్టాలు ఉండవు కదా అని రవి సలహాలు ఇవ్వడంతో కార్తీక్ అతడిపై కోప్పడుతాడు.
Karthika Deepam 2 Serial: శివన్నారాయణ అసలైన ఇంటి వారసురాలు దీప అనే నిజం బయటపెట్టాలని అనుకున్న దాసును చంపబోతుంది జ్యోత్స్న. కొన ఊపిరితో ఉన్న దాసును దశరథ్ కాపాడుతాడు. దశరథ్ ఇంట్లో కనిపించకపోవడంతో తనను ఫాలో అయ్యి, దాసును చంపాలనుకున్నది తండ్రి చూసేశాడేమోనని జ్యోత్స్న కంగారు పడుతుంది. బయట నుంచి వచ్చిన దశరథ్ జ్యోత్స్న వైపు కోపంగా చూడటంతో ఆమె అనుమానం మరింత బలపడుతుంది.

కొత్తగానే కనిపిస్తా....
జ్యోత్స బయటకు వెళ్లి ఇప్పుడే ఇంటికి వచ్చిందని సుమిత్ర అంటుంది. ఎక్కిడికి వెళ్లావని జ్యోత్స్నను అడుగుతాడు దశరథ్. కానీ జ్యోత్స్న సమాధానం చెప్పదు. దశరథ్ చాలా డల్‌గా కనిపిస్తాడు. అతడి మాటలు, తీరు కూడా కొత్తగా కనిపించడంతో శివన్నారాయణ, సుమిత్ర కంగారు పడతారు. కొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు...కొత్త విషయాలు చూస్తున్నప్పుడు కొత్తగానే కనిపిస్తానని అర్థం కాకుండా మాట్లాడుతాడు.
దశరథ్ చేతికి రక్తం అంటుకొని కనిపిస్తుంది. ఆ రక్తం మరకలు ఏంటని సుమిత్ర టెన్షన్ పడుతుంది. దారిలో ఒకరికి యాక్సిడెంట్ జరిగితే కాపాడానని దశరథ్ అబద్ధం ఆడుతాడు. నువ్వు చెప్పే మాటల్ని, నిన్ను చూసి ఏదో ఘోరం జరిగిందని భయపడిపోయానని పారిజాతం అంటుంది. ఏదో దారిన పోయేవాళ్లేనే కదా నువ్వు కాపాడింది అని చెబుతుంది. దారినపోయేవాళ్లు కాదు...నీ సొంత కొడుకునే జ్యోత్స్న చంపాలని చూసిందని మనసులో దశరథ్ అనుకుంటాడు.
పాపాన్ని కడుక్కోలేం...
ముందు ఆ రక్తాన్ని కడుక్కోమని కొడుకును ఆదేశిస్తాడు శివన్నారాయణ. అంటిన రక్తాన్ని కడుక్కోగలం కానీ చేసిన పాపాన్ని కడుక్కోలేమని దశరథ్ అనడంతో జ్యోత్స టెన్షన్ మరింత పెరుగుతుంది. చేసిన పాపం ఎవరిని ఊరికే వదిలిపెట్టదని జ్యోత్స్న వైపు చూస్తూ చెబుతాడు. దాసును చంపడానికి తాను ప్రయత్నించడం తండ్రి చూశాడా? తండ్రి కాపాడింది దాసునేనా అని జ్యోత్స్న భయపడిపోతుంది.
శౌర్య మెడలో లాకెట్...
కార్తీక్ లాకెట్ శౌర్య మెడలో కనిపిస్తుంది. లాకెట్ ముట్టుకోవద్దని చెబితే అర్థం కాదా...ఎన్నిసార్లు చెప్పాలి అని కూతురిపై దీప ఫైర్ అవుతుంది. నేనే శౌర్యకు లాకెట్ ఇచ్చానని కార్తీక్ అంటాడు. ఇది మీ ప్రాణదాత అని అన్నారు, ఎవరికి ఇవ్వనని చెప్పి ఇప్పుడు ఎలా ఇచ్చారని దీప అడుగుతుంది. ఇది నా ప్రాణదాత నాకు ఇచ్చింది. నేను నా ప్రాణానికి ప్రాణమైన శౌర్యకు ఇచ్చానని కార్తీక్ బదులిస్తాడు.
యాభై లక్షలు...
శౌర్య ఆపరేషన్ కోసం యాభై లక్షలు ఎలా సర్ధుబాటు చేయాలి, ఆపరేషన్ కోసం వారం రోజుల పాటు శౌర్యను హాస్పిటల్‌లో ఎలా ఉంచాలో తెలియక తెగ ఆలోచిస్తుంటాడు. ఏం ఆలోచిస్తున్నారని కార్తీక్‌ను అడుగుతుంది దీప. శౌర్య ఆపరేషన్ గురించిన నిజం దాచేస్తాడు.
స్నేహితుడికి మాటిచ్చా....
తన స్నేహితుడు, అతడి భార్య ఊరు వెళుతున్నారని, వారి పాప మాత్రం ఇక్కడే ఉండిపోయిందని, ఆ చిన్నారికి తోడుగా శౌర్యను వారం రోజులు పంపించమని అడుగుతున్నాడని దీపతో అంటాడు కార్తీక్. నువ్వు కాదనవనే నమ్మకంతో నేను మాటిచ్చానని దీపతో అంటాడు కార్తీక్. రేపు ఉదయమే శౌర్యను అక్కడికి పంపిద్దామని కార్తీక్ అంటాడు. దీప అందుకు ఒప్పుకోదు. శౌర్య అక్కడికి వెళితే ఆమె ఆరోగ్యం బాగవుతుందని దీపను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. శౌర్య కూడా తండ్రి చెప్పింది అంత నిజమేనని అంటుంది.
కార్తీక్ బాధ...
తనకు వారం రోజులు దూరంగా ఉండగలవా అని కూతురిని దీప అడుగుతుంది. ఉంటానని శౌర్య అంటుంది. కార్తీక్‌పై నమ్మకంతో దీప ఒప్పుకుంటుంది. దీపను ఒప్పించడానికి అబద్ధం ఆడాల్సిరావడంతో కార్తీక్ బాధపడతాడు. డాక్టర్ ఫోన్ చేసి...అనుకున్న దానికంటే ముందుగానే శౌర్యను హాస్పిటల్‌లో చేర్చాలని అంటాడు. డబ్బు రెడీ చేసుకోమని డాక్టర్ ఫోన్ చేసి కార్తీక్‌కు చెబుతాడు.
రెస్టారెంట్ ఆఫర్...
డాక్టర్‌తో కార్తీక్ మాట్లాడటం దీప వింటుంది. ఐదు లక్షలు రెడీ చేసుకుంటానని కార్తీక్ అనడం దీప చెవిలో పడుతుంది. ఐదు లక్షలు దేనికోసం అని కార్తీక్‌ను అడుగుతుంది. రెస్టారెంట్ పెట్టడానికి ఆ ఆఫర్ వచ్చిందని కార్తీక్ తడబడుతూ సమాధానం ఇస్తాడు. రెస్టారెంట్ గురించి నాతో ఎందుకు చెప్పలేదని నిలదీస్తుంది. ఇప్పుడు చెబుతున్నాగా అని కార్తీక్ అంటాడు.
శౌర్యను ఫ్రెండ్ ఇంటికి తీసుకెళతానన్నారుగా అని దీప అనగా...ఎప్పుడు తీసుకెళతానన్నానో చెబుతానని అన్నాను కదా...ఎందుకు గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తావని దీపతో కోపంగా అంటాడు. బయటకు వెళుతున్నానని కార్తీక్ అంటాడు. ఎక్కడికి అని దీప అడగ్గానే...తిరిగొచ్చాక చెబుతానని కార్తీక్ విసుక్కుంటాడు. కార్తీక్ విసుక్కోవడం చూసి ఏదో నిజం దాచిపెడుతున్నాడని దీప అనుకుంటుంది.
సలహాలు కాదు...డబ్బులు కావాలి...
డబ్బుల కోసం తన స్నేహితుడు రవిని కలుస్తాడు కార్తీక్. ఐదు లక్షలు అప్పు అడుగుతాడు. నీ కోపాన్ని పక్కనపెట్టి మీ తాతకు సారీ చెబితే ఈ కష్టాలు ఉండవు కదా అని కార్తీక్‌తో అంటాడు రవి. నిన్ను డబ్బులు అడిగాను సలహాలు కాదని కార్తీక్ కోపంగా ఆన్సర్ ఇస్తాడు. ఈ కోపం వల్లే అన్ని పోగోట్టుకొని ఇలా సైకిల్‌పై తిరుగుతున్నావని రవి అంటాడు. ఇప్పటికైనా డబ్బు విలువ ఏమిటో నీకు అర్థమైందా అని చెబుతాడు.
నువ్వు నన్ను చూసి ఫ్రెండ్‌షిప్ చేశావని అనుకున్నానని, కానీ నా స్థాయిని చూసి స్నేహితుడికి అయ్యావని ఈ రోజే తెలిసిందని రవితో చెప్పి కార్తీక్ అక్కడి నుంచి బయలుదేరబోతాడు.
రాజీపడటం రాదు...
కార్తీక్‌ను రవి ఆపతాడు. నేను తాగేసి మా తాతతో గొడవపడలేదని అంటాడు. రాజీపడటం, సర్ధుకుపోవడం తనకు రాదని చెబుతాడు. తిడుతున్నది మనలనే అని తెలిసినా...మనల్ని కాదులే మని మనసు చంపుకొని బతకడం తనకు రాదని రవికి క్లాస్ ఇస్తాడు కార్తీక్.
ఈగోతో బతికితే...
నీ మరదల్ని పెళ్లి చూసుకుంటే ఈ కష్టాలు ఉండేవి కావని కార్తీక్‌తో అంటాడు రవి. నిన్నటి కంటే ఈ రోజును...ఈ రోజు కంటే రేపటిని బాగా మలుచుకోవాలనే ఆశావాదిని తాను అని కార్తీక్ ఆన్సర్ ఇస్తాడు. అడిగితే సాయం చేసేవాడు బంధువు, అడగకుండా సాయం చేసేవాడు స్నేహితుడు ఈ రెండింటిలో నువ్వు లేవని నాకు అర్థమైందని రవితో చెబుతాడు కార్తీక్. ఇలా ఈగోతో బతికితే నష్టపోయేది నువ్వేనని, నా మాట వినేలా ఉంటేనే నన్ను మళ్లీ కలవమని కార్తీక్‌తో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రవి.
కాశీ షాక్...
రవితో కార్తీక్ మాట్లాడటం కాశీ వింటాడు. డబ్బులు ఎందుకు అని కార్తీక్‌ను అడుగుతాడు కాశీ.నేను నీకు గుర్తురాలేదా అని నిలదీస్తాడు. కాశీ బలవంతం చేయడంతో శౌర్య ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతాడు కార్తీక్. శౌర్యకు ఇంత పెద్ద ప్రాబ్లెమ్ ఉందని దీపకు తెలుసా అని కాశీ అంటాడు.ఈ విషయం తెలిస్తే దీప పేషెంట్ అయిపోతుందని కార్తీక్ అంటాడు.
ఇంత బాధను గుండెల్లో దాచుకొని ఎలా తట్టుకోగలుగుతున్నావని కార్తీక్‌తో అడుగుతాడు కాశీ. శౌర్యను ఎలా కాపాడాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక, డబ్బులు లేక నేను పెట్టుకున్న నియమాల్ని కూడా చెరిపేసుకున్నానని కార్తీక్ బదులిస్తాడు. నన్ను ఎందుకు డబ్బులు అడగలేదని కార్తీక్‌తో అంటాడు కాశీ. ఎదుటివాళ్ల ఆర్థిక పరిస్థితి, అవసరం ఏమిటో తెలిసి కూడా ఏం తెలియనట్లు నటిస్తూ ఏ ముఖం పెట్టుకొని అడుగుతాం అని కార్తీక్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.