Karimnagars Most Wanted Review: కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ వెబ్‌సిరీస్ రివ్యూ - గ్యాంగ్‌స్టర్ సిరీస్ ఎలా ఉందంటే?
Karimnagars Most Wanted Review: తెలుగు వెబ్‌సిరీస్ కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ ఇటీవల ఆహా ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్‌లో అమన్, సాయి, అనిరుధ్, గోపాల్ ప్రధాన పాత్రలు పోషించారు.
Karimnagars Most Wanted Review: అమన్, సాయి, అనిరుధ్, గోపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్‌సిరీస్ కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్‌కు బలగం ఫేమ్ రమేష్ ఎలిగేటి కథను అందించాడు.. బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించాడు. ఈ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
నలుగురు స్నేహితుల కథ...
గని (సాయి సూరేపల్లి), బిట్టు (అనిరుధ్), టింకు (అమన్ సూరేపల్లి), సత్తి (గోపాల్ మాదారం ) నలుగురు ప్రాణ స్నేహితులు. బ్యాంకు లోన్ తీసుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని అనుకుంటారు. కానీ లోను రాకపోవడంతో రికవరీ ఏజెంట్స్‌గా పనిచేస్తుంటారు. ఆ పని అంతగా నచ్చదు. ఓ ల్యాండ్ కొని దాని ద్వారా వచ్చే డబ్బుతో జీవితంలో స్థిరపడాలని నలుగురు కలలు కంటారు. తల్లిదండ్రులు తమ కోసం కూడబెట్టిన డబ్బు మొత్తం ఆ భూమికి పెట్టుబడిగా పెట్టాలనుకుంటారు.
లాండ్ రిజిస్ట్రేషన్ ముందు రోజు ప్రభుత్వం నోట్లను రద్దు చేస్తుంది. ఓ బ్యాంకు మేనేజర్ ద్వారా తమ దగ్గర ఉన్న రద్దైన నోట్లను కొత్త కరెన్సీలోకి మార్పిడి చేయాలని గని, బిట్టు, టింకు, సత్తి ప్లాన్ వేస్తారు. అనుకోకుండా ఐదు కోట్ల స్కామ్‌లో చిక్కుకొని జైలు పాలవుతారు. జైలులో వారి జీవితం ఎలా మారింది? గట్టు శీను అనే కరుడుగుట్టిన ఖైదీ వారిని ఎందుకు టార్గెట్ చేశాడు?
జైలు నుంచి బయటకు వచ్చిన ఆ నలుగురు కరీంనగర్‌లో క్రైమ్ సిండికేట్‌కు లీడర్స్‌గా ఎలా ఎదిగారు? వారిని స్కామ్‌లో ఇరికించింది ఎవరు? లోకల్ ఎమ్మెల్యే పురుషోత్తంతో వైరం ఆ నలుగురు స్నేహితుల జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది? నేరాలు చేస్తూ అడ్డదారుల్లో ఎదగాలని అనుకున్న వారి జీవితాలు చివరకు ఎలా ముగిశాయన్నది కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ సిరీస్ కథ.
రాజకీయ ఎత్తుగడలతో...
క్రైమ్ థ్రిల్లర్ కథతో కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ వెబ్‌సిరీస్ తెరకెక్కింది. రాజకీయ ఎత్తుగడల కారణంగా నలుగురు సామాన్య యువకుల జీవితాలు ఎలా తలక్రిందులు అయ్యాయి? నిజాయితీతో జీవితంలో ఎదగాలని అనుకున్న వాళ్లు ఎందుకు క్రైమ్ దారుల్లో నడవాల్సివచ్చిందన్నది రియలిస్టిక్‌గా సిరీస్‌లో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ బాలాజీ. ఈ సిరీస్‌కు కరీంనగర్ నేటివిటీ, తెలంగాణ యాస, భాషలు ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. డైలాగ్స్ చాలా సహజంగా రాసుకున్నారు. క్లైమాక్స్ రొటీన్‌కు భిన్నంగా ఉంది.
గ్యాంగ్‌స్టర్ సినిమాల్ని...
కథ విషయంలో కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ తెలుగులో వచ్చిన ఎన్నో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ సినిమాల్ని గుర్తుకుతెస్తుంది. నలుగురు స్నేహితులు గ్యాంగ్‌స్టర్స్‌గా మారడానికి కారణమైన పరిస్థితుల్లో సంఘర్షణ, ఎమోషన్స్ మరింత డెప్త్ గా రాసుకుంటే బాగుండేది. కొన్ని ఎలివేషన్, మాసీ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. జైలులో వచ్చే యాక్షన్ ఎపిసోడ్, సిండికేట్ లీడర్ తో గని డీల్ కుదర్చుకునే సన్నివేశాల్లో హీరోయిజం వర్కవుట్ అయ్యింది.
నాలుగు పాత్రలతో...
సాయి, అమన్, అనిరుధ్, గోపాల్ నలుగురి పాత్రల ప్రధానంగానే ఈ సిరీస్ సాగుతుంది. నేటితరం యువత ఆలోచనలను ప్రతిబింబించేలా వారి పాత్రలు సాగుతాయి. వారి గెటప్, బాడీలాంగ్వేజ్ బాగున్నాయి. కొత్త వాళ్లే అయినా సహజంగా నటించారు. ఎమ్మెల్యే పాత్రలో పురుషోత్తం, సత్తి తండ్రిగా బలగం సుధాకర్‌రెడ్డి తమ పాత్రలకు న్యాయం చేశారు.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్…
పూర్తి స్థాయి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చాలా వచ్చాయి. కానీ సిరీస్‌లు మాత్రం ఎక్కువగా రాలేదు.ఆ లోటును కొంత వరకు కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ భర్తీ చేస్తుంది.