Kolkata Rape, Murder: కోల్‍కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై స్పందించిన కరీనా, ఆలియా.. ఇంకా వేచిచూస్తున్నామంటూ..
Kolkata Rape, Murder: కోల్‍కతాలో ఓ యువ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది సినీ సెలెబ్రిటీలు కూడా ఈ విషయంపై స్పందిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్, ఆలియా ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కోల్‍కతాలో ఓ ట్రైనీ యువ వైద్యురాలు.. అమానుషంగా అత్యాచారం, హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ పాశవిక చర్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఈ ఘటనపై సినీ సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటీమణులు కరీనా కపూర్, ఆలియా భట్ నేడు (ఆగస్టు 15) ఈ ఘటనపై స్పందించారు.
నిర్భయ ఘటనను గుర్తు చేసుకుంటూ..
2012లో జరిగిన నిర్భయ ఘటనను కరీనా కపూర్ గుర్తు చేసుకున్నారు. అది జరిగి 12 ఏళ్లు అయినా ఇంకా మార్పు కోసమే వేచిచూస్తున్నామంటూ ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు పోస్ట్ చేశారు. కోల్‍కతా ఘటనతో తన హృదయం ముక్కలైందన్నట్టుగా ఎమోజీని పోస్ట్ చేశారు.
నిర్భయ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత కూడా అదే నిరసనలు చేయాల్సి వస్తోందని కరీనా రాసుకొచ్చారు. “12ఏళ్ల తర్వాతా.. అదే స్టోరీ.. అదే నిరసన. కానీ మనం ఇంకా మార్పు కోసం వేచిచూస్తున్నాం” అని కరీనా కపూర్ పోస్ట్ చేశారు. బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పొందుపరిచారు. కోల్‍కతా ఘటన బాధితురాలికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాష్‍ట్యాగ్‍లను కూడా కరీనా రాశారు.
ఆందోళన వ్యక్తం చేసిన ఆలియా
కోల్‍కతా వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై మరికొందరు బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హీరోయిన్ ఆలియా భట్. “మరో దారుణమైన అత్యాచారం. మహిళలు ఎక్కడా సురక్షితంగా ఉండలేరనేందుకు మరొక్క రోజున ఇది నిరూపించింది. నిర్భయ విషాదం జరిగి దశాబ్దం దాటిందని గుర్తు చేసిన మరో భయంకరమైన దుశ్చర్య ఇది. అయినా ఇంకా ఏం మారలేదు” అని ఆలియా పోస్ట్ చేశారు. అత్యాచారాలపై ఎన్‍సీఆర్బీ రిపోర్టును కూడా ఆలియా షేర్ చేశారు. వీటిని చూశాక మహిళమందరం ఎలా ఫీలవ్వాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటివి మెదడులో తిరుగుతున్నప్పుడు ఎలా మనం పనులకు వెళ్లగలం, రోజువారి జీవితాలను సాగించలగమంటూ ఆలియా భట్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఉరితీయాలి: పరిణీతి
ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితుడిని ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు బాలీవుడ్ నటి పరిణితి చోప్రా. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వార్తను షేర్ చేస్తూ తన ఆవేదనను రాసుకొచ్చారు. “చదివేందుకే ఇంత కష్టంగా అనిపిస్తుంటే.. ఆమెకు ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి. అసహ్యకరం, భయానకం. అతడిని ఉరితీయాలి” అని పరిణీతి చోప్రా పోస్ట్ చేశారు.
మనల్ని రక్షిస్తున్న వారిని మనం రక్షించుకోవాలంటూ బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న భయాలు, అభద్రతా భావాలపై ఓ పద్యాన్ని వినిపించారు. తాము పురుషులమైతే ఎంత భద్రతగా ఉంటామో ఓ మహిళ చెబుతున్నట్టు ఆ పద్యం ఉంది. మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
ఆగస్టు 9వ తేదీన కోల్‍కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ఓ పీజీ ట్రైనీ డాక్టర్ మృతదేహం కనిపించింది. ఆమె అత్యాచారం, హత్యకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదైంది. ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.