Kanye West Teeth Set: డబ్బులు బాగా ఎక్కువయ్యాయ్.. రూ.7 కోట్లతో టైటానియం పళ్ల సెట్.. ర్యాపర్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్-kanye west titanium teeth set worth 7 crores fans trolling him badly ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kanye West Teeth Set: డబ్బులు బాగా ఎక్కువయ్యాయ్.. రూ.7 కోట్లతో టైటానియం పళ్ల సెట్.. ర్యాపర్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

Kanye West Teeth Set: డబ్బులు బాగా ఎక్కువయ్యాయ్.. రూ.7 కోట్లతో టైటానియం పళ్ల సెట్.. ర్యాపర్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

Hari Prasad S HT Telugu
Published Jan 19, 2024 09:50 AM IST

Kanye West Teeth Set: ప్రముఖ ర్యాపర్ కాన్యే వెస్ట్‌ను అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అతడు ఏకంగా రూ.7 కోట్లతో కొత్త టైటానియం పళ్ల సెట్ వేయించుకోవడమే దీనికి కారణం.

ర్యాపర్ కాన్యే వెస్ట్.. అతడు కొత్త వేయించుకున్న టైటానియం పళ్ల సెట్
ర్యాపర్ కాన్యే వెస్ట్.. అతడు కొత్త వేయించుకున్న టైటానియం పళ్ల సెట్

Kanye West Teeth Set: డబ్బులు ఎక్కువైతే ఇలాగే ఉంటుంది అంటూ ర్యాపర్ కాన్యే వెస్ట్ ను ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. తమ టాలెంట్ తో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకొని అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించే ఆర్టిస్టులు.. ఇలా కోట్ల డబ్బును విలాసాలకు ఖర్చు చేయడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ర్యాపర్ కాన్యే వెస్ట్ తన పై పళ్ల సెట్ మొత్తాన్ని తీయించుకుని వాటి స్థానంలో కొత్తగా టైటానియం సెట్ వేయించుకున్నాడు. వీటి విలువ ఏకంగా 8.5 లక్షల డాలర్లు (సుమారు రూ.7 కోట్లు) కావడం గమనార్హం. ఈ విషయాన్ని అతడే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించాడు. ఈ ఫొటోను షేర్ చేస్తూ జేమ్స్ బాండ్ విలన్ జాస్ నుంచి ప్రేరణ పొంది ఈ పళ్ల సెట్ వేయించుకున్నానని అతడు చెప్పాడు.

కాన్యే వెస్ట్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్

కాన్యే వెస్ట్ ఈ మధ్యే తన పళ్ల సెట్ ను మార్పించుకున్నాడు. ది స్పై హు లవ్డ్ మి, మూన్‌రేకర్ మూవీస్ లో జేమ్స్ విలన్ అయిన జాస్ ఫొటోను కూడా షేర్ చేస్తూ ఇన్‌స్టాలో కాన్యే ఈ విషయాన్ని వెల్లడించాడు. అతని పళ్లను చూసి ఇన్‌స్పైర్ అయినట్లు అతడు చెప్పకనే చెప్పాడు. అయితే ఈ టైటానియం పళ్ల సెట్ కోసం అతడు ఏకంగా రూ.7 కోట్లు ఖర్చు పెట్టడం అభిమానులకు షాక్‌కు గురి చేసింది.

నిజానికి అతడు ఇలా తన పళ్ల సెట్ మార్పించుకోవడం ఇదే తొలిసారి కాదు. 2010లోనూ ఈ ర్యాపర్ తన కింది పళ్ల సెట్ మొత్తాన్నీ మార్చాడు. ది ఎలెన్ డీజెనెర్స్ షోకు వచ్చిన కాన్యేను అదేమైనా గ్రిల్ కాదు కదా అని అడిగింది. దానికి అతడు స్పందిస్తూ.. లేదు ఇవి నా పళ్లే.. కింది సెట్ మొత్తాన్నీ మార్చుకున్నాను అని చెప్పాడు.

కాన్యేకు పిచ్చి పట్టిందా?

అతడి ఇన్‌స్టా పోస్టు చూసి అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అతని పిచ్చి కాకపోతే 8.5 లక్షల డాలర్లు పెట్టి పళ్ల సెట్ మార్పించుకోవడం ఏంటి అని ఓ అభిమాని ప్రశ్నించాడు. డబ్బులు ఎక్కువైతే ఇలాగే ఉంటుందని మరో అభిమాని కామెంట్ చేశారు. బహుశా కిమ్ కర్దాషియాన్ ను చూసి ఇలా చేయించుకున్నాడేమో అని ఇంకొకరు అన్నారు. డబ్బులు బాగా ఎక్కువైపోయి తనను తాను ఓ సాధారణ వ్యక్తిలా అతడు భావించడం లేదు.. అతడో ఆర్టిస్ట్ అని గుర్తుంచుకోవాలి అని మరొకరు కాస్త ఘాటుగా కామెంట్ చేశారు.

ఎవరీ కాన్యే వెస్ట్?

కాన్యే వెస్ట్ అమెరికాకు చెందిన ర్యాపర్, సింగర్, సాంగ్ రైటర్. ప్రపంచంలో అత్యధిక రికార్డులు అమ్ముడుపోయిన ఆర్టిస్టుల్లో అతడూ ఒకడు. ఇప్పటి వరకూ అతని ఆల్బమ్ లకు చెందిన 16 కోట్ల రికార్డులు అమ్ముడయ్యాయి. 24 గ్రామీ అవార్డులు కూడా గెలుచుకున్నాడు. అత్యధిక గ్రామీ అవార్డులు గెలుచుకున్న హిప్ హాప్ ఆర్టిస్ట్ గా కాన్యే వెస్ట్ నిలిచాడు. 1996లో తన మ్యూజికల్ కెరీర్ ను అతడు ప్రారంభించాడు.

Whats_app_banner