Best Kannada Movies on OTT: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన కన్నడ మూవీస్ ఇవే!
Best Kannada Movies on OTT: కేజీఎఫ్ తర్వాత కన్నడ సినిమాలకు ఓటీటీలోనూ క్రేజ్ బాగా ఏర్పడింది. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్న బెస్ట్ కన్నడ మూవీస్ ఏవంటే?
Best Kannada Movies on OTT: కన్నడ సినిమా రాతను, దశదిశను కేజీఎఫ్ పూర్తిగా మార్చేసింది. కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ కల్చర్ ఎక్కువైపోయింది. కన్నడ సినిమాలు దేశవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సొంతం చేసుకుంటున్నాయి. థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా కన్నడ సినిమాలు అన్ని భాషల ఆడియెన్స్‌ను ఆకట్టుకొంటున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ కన్నడ మూవీస్ ఏవంటే?
కాంతార
కన్నడ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది కాంతార మూవీ. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 450 కోట్ల వసూళ్లను రాబట్టి చరిత్రను తిరగరాసింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భూతకోళ అనే సంప్రదాయ కళ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ ఈ మూవీని చూడొచ్చు. ఇంగ్లీష్ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
777 చార్లి
రక్షిత్ శెట్టి హీరోగా నటించిన 777 చార్లి మూవీని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చూడొచ్చు. ధర్మ అనే యువకుడి జీవితంలోకి చార్లి అనే కుక్క ఎలా వచ్చింది? చార్లి కోసం దేశ సరిహద్దులను దాటడానికి ధర్మ ఎందుకు సిద్ధపడ్డాడనే కాన్సెప్ట్‌తో ఎమోషనల్ అడ్వెంచరస్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు కిరణ్‌రాజ్ 777 చార్లి మూవీని తెరకెక్కించాడు. బెస్ట్ కన్నడ మూవీగా 777 చార్లి నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నది.
గరుడ గమన వృషభ వాహన
రాజ్ బీ శెట్టి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన గరుడ గమన వృషభ వాహన కన్నడ ఇండస్ట్రీలో బెస్ట్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. గ్యాంగ్‌స్టర్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో రిషబ్‌శెట్టి మరో హీరోగా నటించాడు. ఇద్దరు స్నేహితులు గ్యాంగ్‌స్టర్స్‌గా ఎలా మారారు? వారిద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడటానికి కారణం ఏమిటి? చివరకు వారి జీవితం ఎలా విషాదంగా ముగిసిందనే పాయింట్‌తో గరుడ గమన వృషభవాహన మూవీ రూపొందింది. ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది.
కావలుధారి...
కన్నడంలో చిన్న సినిమాల్లో పెద్ద విజయంగా నిలిచిన కావలుధారి మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఓ పురావస్తు శాఖ అధికారి మర్డర్ కేసును ట్రాఫిక్ పోలీసు ఎలా ఛేదించాడనే పాయింట్‌తో దర్శకుడు హేమంత్ ఎమ్ రావు కావలుధారి మూవీని తెరకెక్కించాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రిషి, అనంత్ నాగ్ కీలక పాత్రలు పోషించారు.
కేజీఎఫ్, కేజీఎఫ్ 2
కన్నడ సినీ ఇండస్ట్రీతో పాటు దేశమొత్తాన్ని కేజీఎఫ్‌తో పాటు కేజీఎఫ్ 2 ఓ ఊపు ఊపేశాయి. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ రెండు సినిమాలు ఇండియన్ సినిమా చరిత్రలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ మూవీస్‌లో చోటు దక్కించుకున్నది. యశ్ హీరోయిజం, అతడిపై తెరకెక్కించిన యాక్షన్ సీన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యాయి.
సప్త సాగర దాచే ఎల్లో...
రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సప్త సాగర దాచే ఎల్లో సైడ్ ఏ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ప్యూర్ లవ్ స్టోరీగా దర్శకుడు హేమంత్ రావు ఈ మూవీని రూపొందించాడు. ప్రియురాలికి సాయపడాలని చేయని నేరాన్ని తనపై వేసుకున్న ఓ యువకుడు ఎలా జైలు పాలయ్యాడనే పాయింట్‌తో ఈ మూవీ రూపొందింది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. సప్త సాగర దాచే ఎల్లో సైడ్ బీ కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారానే ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది.
వీటితో పాటు యూటర్న్ (నెట్‌ఫ్లిక్స్), దియా (అమెజాన్ ప్రైమ్ వీడియో), విక్రాంత్ రోణ (జీ5), కాటేరా (జీ5), లూసియా (అమెజాన్ ప్రైమ్), రంగితరంగ (సన్ నెక్స్ట్)లో అందుబాటులో ఉన్నాయి.