Kantara Telugu Box Office Collection: తెలుగులో కాంతారా రికార్డ్ కలెక్షన్స్ - తొలిరోజే బ్రేక్ ఈవెన్
Kantara Telugu Box Office Collection: కాంతారా తెలుగు వెర్షన్ తొలిరోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్‌ను రాబట్టింది. శుక్రవారం రోజు ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఎంతంటే...
Kantara Telugu Box Office Collection: రిషబ్‌శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన కాంతారా చిత్రం తెలుగులో మొదటిరోజు భారీగా వసూళ్లను సొంతం చేసుకున్నది. ఫస్ట్ డే కలెక్షన్స్‌తోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కన్నడంలో సెప్టెంబర్ 30న ఈ సినిమా రిలీజైంది. పదిహేను రోజుల్లోనే దాదాపు వంద కోట్లవరకు వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ సినిమా తెలుగు వెర్షన్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కన్నడంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో తెలుగులో తొలిరోజే దాదాపు ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను ఈసినిమా రాబట్టినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. డబ్బింగ్ సినిమాకు ఐదు కోట్ల వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు కోట్ల వరకు జరిగినట్లు తెలిసింది. తొలిరోజు కలెక్షన్స్‌తోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లు చెబుతున్నారు.
తెలుగులో నిర్మాతలకు ఈ సినిమా భారీగా లాభాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమ భూమిని కాపాడుకోవడానికి ఫారెస్ట్ అధికారులతో పాటు రాజవంశీయులతో శివ అనే యువకుడు సాగించిన పోరాటాన్ని ఆవిష్కరిస్తూ రిషబ్‌శెట్టి ఈ సినిమాను తెరకెక్కించాడు. అతడి పోరాటానికి దేవుడు ఎలా అండగా నిలిచాడన్నది ఎమోషనల్‌గా చూపించిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
రిషబ్‌శెట్టి నటనతో పాటు విజువల్స్‌కు ప్రశంసలు లభిస్తోన్నాయి. కాంతారా సినిమాను తెలుగులో గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై అల్లు అరవింద్ విడుదలచేశారు. సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్‌కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.