Kantara OTT Release Date: కాంతారా ఓటీటీలోకి వచ్చేస్తోంది.. అధికారికంగా అనౌన్స్ చేసిన ప్రైమ్ వీడియో
Kantara OTT Release Date: కాంతారా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఎంతోకాలంగా అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.
Kantara OTT Release Date: హమ్మయ్య.. మొత్తానికి కాంతారా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూసిన ఓటీటీ ఫ్యాన్స్‌కు ప్రైమ్ వీడియో బుధవారం (నవంబర్ 23) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా నవంబర్ 24న ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలిపింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా ప్రైమ్ వీడియోలోకి రానుంది.
ట్రెండింగ్ వార్తలు
ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో వెల్లడించింది. అయితే హిందీ రిలీజ్ గురించి మాత్రం ప్రైమ్ వీడియో వెల్లడించలేదు. దీనిపైనే కామెంట్స్ సెక్షన్‌లో అభిమానులు స్పందిస్తూ.. హిందీలో మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మొత్తానికి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోందంటూ మరికొందరు కామెంట్ చేశారు.
కాంతారా మూవీ ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.400 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇక కర్ణాటకలో అయితే కేజీఎఫ్ 2 రికార్డును కూడా బ్రేక్ చేసింది. కన్నడ నాట ఆల్‌టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది.
నవంబర్ 18న రిలీజ్ చేయాలని ముందు భావించారు. అయితే సినిమా థియేటర్లలో ఇంకా మంచి వసూళ్లు సాధిస్తుండటంతో వాయిదా వేశారు. నవంబర్ 24న కచ్చితంగా రానుందని అంచనా వేయగా.. ఇప్పుడు ప్రైమ్ వీడియోనే అధికారికంగా ప్రకటించడంతో నిరీక్షణకు తెరపడినట్లయింది.
కాంతారా గురించి..
కాంతారా అంటే అడవి అని అర్థం. లోకల్ కంటెంట్ తో ఈ సినిమా ప్రేక్షకుల మందుకు వచ్చింది. దక్షిణ కన్నడలోని భూత కోలా, కంబళ, కోళ్ల పందాలను చిత్రంలో చక్కగా చూపించారు. ప్రేక్షకుడికి కొత్త అనుభూతి కలుగుతుంది. కథలో ట్విస్టులు కూడా బాగుంటాయి. ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా ప్రేక్షకులను కట్టిపడేస్తాడు దర్శకుడు. ఫ్యూడలిజం, పర్యావరణ పరిరక్షణ, అటవీ భూమి ఆక్రమణల గురించి చెబుతూనే.. జానపద సాహిత్యం, భూత కోల, దైవారాధన, నాగారాధన, కంబళ వంటి స్థానిక సంస్కృతులను చూపిస్తాడు దర్శకుడు.
అటవీ సంపద స్మగ్లింగ్, గ్రామీణ నేపథ్యం, తీర ప్రాంతంలో తరతరాలుగా పాటిస్తున్న భూత కోలాను చాలా చక్కగా చూపించారు. ఈ సినిమాలోని కన్నడ భాష కూడా.. స్థానిక దక్షిణ కన్నడ యాసలో ఉంటుంది. కానీ స్థానిక సంస్కృతిని ప్రదర్శించాలనే ఉత్సాహంతో కొన్ని పద్ధతులను గ్లామరైజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. కమర్షియల్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు.
కథ చూసేందుకు తెలిసినదే కదా.. అనిపిస్తుంది. కానీ ఎంతో భావోద్వేగంతో ముడిపడి ఉంటుంది. పల్లెటూరు, అడవిలో నివసించే.. ప్రజల ప్రేమ, అమయకత్వం, నమ్మితే ఏదైనా చేసే మనస్తత్వం.. గుండెను తాకుతాయి. రిషబ్ శెట్టి.. నటన, దర్శకత్వ ప్రతిభ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
శివ పాత్రలో రిషబ్ శెట్టి ఇరగదీశాడు. ఎక్కడా రిషబ్ శెట్టి అని కనిపించదు. కేవలం పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఇమేజ్ అంటూ.. క్యారెక్టర్ ను ఎక్కువ చేయలేదు. ఎంత కావాలో అంతే రిషబ్ చేశాడు. సినిమాలోని ప్రతీ క్యారెక్టర్ అంతే. అడవిలో ఉండే స్వచ్ఛత, నిజాయితీ అర్థమైపోతుంది. ఇక లీలాగా సప్తమీ గౌడ కూడా తన నటనతో ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులకు పరిచమున్న కిషోర్ కుమార్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆకట్టుకున్నాడు. భూస్వామిగా అచ్యుత్ కుమార్ బాగా నటించాడు. ఇతర నటీనటులకూ వంక పెట్టడానికి లేదు.
ఇక కాంతార మూవీకి మ్యూజిక్, లొకేషన్లు ప్రధాన బలం. సినిమా మెుత్తం కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం కొన్ని సందర్భాల్లో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్ పనితనం కనిపిస్తుంది. కంబళ సన్నివేశాల చిత్రీకరణ అద్భుతంగా తీశారు. చివరి 20 నిమిషాలు సినిమా మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొత్త అనుభూతిని కలిగిస్తుంది.