కాంతార ఛాప్టర్ 1న మూవీ మరో పది రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై ఎన్ని భారీ అంచనాలు ఉన్నాయో తాజాగా రిలీజైన ట్రైలర్ కు వచ్చిన వ్యూస్ చూస్తే స్పష్టమవుతోంది. కేవలం తొలి 24 గంటల్లోనే మూవీకి పది కోట్లకుపైగా వ్యూస్ రావడం విశేషం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ హోంబలే ఫిల్మ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, లీడ్ రోల్లో నటించిన మూవీ కాంతార ఛాప్టర్ 1. ఈ సినిమా అక్టోబర్ 2న దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. సోమవారం (సెప్టెంబర్ 22) ట్రైలర్ రిలీజ్ కాగా.. 24 గంటల్లో ఏకంగా 107 మిలియన్లు అంటే 10.7 కోట్ల వ్యూస్ వచ్చినట్లు హోంబలే ఫిల్మ్స్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.
అన్ని భాషల్లో కలిపి ఈ వ్యూస్ రాగా.. మొత్తంగా 3.4 మిలియన్ లైక్స్ రావడం విశేషం. అయితే ఈ ట్రైలర్ కు తెలుగు, కన్నడ కంటే హిందీలోనే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. నిజానికి కాంతార మూవీ కూడా హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు సాధించింది. దీంతో ఇప్పుడీ ప్రీక్వెల్ పైనా భారీ అంచనాలు ఉన్నాయి.
అటు కాంతార ఛాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రిషబ్ శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సెట్స్ లో తాను నాలుగైదుసార్లు చావు నుంచి బయటపడినట్లు చెప్పాడు. “తీరిక లేని పని కారణంగా మూడు నెలల పాటు సరిగా నిద్ర కూడా పోలేదు. ప్రతి ఒక్కరూ డైరెక్షన్ టీమ్, ప్రొడ్యూసర్లు అందరూ ఇది తమ సొంత సినిమాలాగా పని చేశారు.
సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరూ దీనిని తమ సొంతంలాగా భావించడం వల్లే ఇవాళ ఇక్కడ ఉన్నాం. సెట్స్ లో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. నిజానికి నాలుగైదుసార్లు నేను కూడా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను. కానీ మేము నమ్మిన శక్తి మమ్మల్ని కాపాడి ఆశీర్వదించింది” అని రిషబ్ శెట్టి అన్నాడు.
కాంతార 2022లో రిలీజ్ కాగా.. దానికి ప్రీక్వెల్ గా ఇప్పుడు కాంతార ఛాప్టర్ 1 వస్తోంది. అప్పట్లో కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. దీంతో ఈ కాంతార ఛాప్టర్ 1 మూవీని మరింత భారీ బడ్జెట్ తో, చాలా గొప్పగా తీసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
సంబంధిత కథనం