కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ కలెక్షన్లు రోజు 7: కాంతారా చాప్టర్ 1 విడుదలై వారం అయిన కూడా బాక్సాఫీస్ వద్ద బలంగా దూసుకుపోతోంది. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో దర్శకత్వం వహించి, నటించిన ఈ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం భారతదేశంలో మొదటి వారంలో రూ. 300 కోట్ల కలెక్షన్లను దాటేసింది.
సక్నిల్క్ డేటా ప్రకారం, కాంతారా చాప్టర్ 1 బుధవారం అంటే ఏడో రోజున భారతదేశంలో రూ. 25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో కన్నడ నుంచి 9 కోట్లు, తెలుగు నుంచి 3.5 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ. 8.5 కోట్లు, తమిళంలో 2.15 కోట్లు, మలయాళంలో 1.85 కోట్లు కలెక్షన్స్ ఉన్నాయి.
అయితే, ఆరో రోజుతో పోలిస్తే ఏడో రోజున కాంతార 2 కలెక్షన్స్ 27.01 శాతం వరకు తగ్గినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది. అయితే, ఏడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగించింది కాంతార చాప్టర్ 1 సినిమా. ఏడు రోజుల్లో ఈ సినిమాకు ఇండియాలో రూ. 316 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
అంటే, నెట్ కలెక్షన్స్‌లో 300 కోట్ల క్లబ్‌లోకి కాంతార 2 చేరింది. ఇలా చేరిన రెండో కన్నడ సినిమాగా కాంతార 2 రికార్డ్ కొట్టింది. ఈ 316 కోట్ల కలెక్షన్స్‌లో కన్నడ ద్వారా 98.85 కోట్లు, తెలుగులో 60.9 కోట్లు, హిందీ బెల్టులో అత్యధికంగా 102 కోట్లు, తమిళంలో 29.4 కోట్లు, మలయాళంలో 24.85 కోట్లుగా కలెక్షన్స్ ఉన్నాయి.
అంటే, ఈ లెక్కన ఈ ఏడు రోజుల కలెక్షన్స్‌లో సొంత భాష కన్నడ కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. కాగా, వరల్డ్ వైడ్‌గా ఆరు రోజుల్లోనే కాంతార 2 సినిమా రూ. 410 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో కాంతార ప్రీక్వెల్ మూవీ మొదటి సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను దాటేసింది.
ఇకపోతే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 8వ రోజున ఇండియాలో కాంతార 2 సినిమాకు రూ. 1.05 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని సక్నిల్క్ అంచనా వేసింది. దీంతో 8 రోజుల్లో కాంతార చాప్టర్ 1 మూవీకి రూ. 317.05 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యే అవకాశం కనిపిస్తోంది.
కాగా, హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్, చలువేగౌడ కాంతారా చాప్టర్ 1 చిత్రాన్ని నిర్మించారు. హీరోగా, డైరెక్టర్‌గా రిషబ్ శెట్టి చేయగా హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ ఆకట్టుకుంది. జయరామ్, గుల్షన్ దేవయ్య ఇతర ముఖ్య పాత్రల్లో కనువిందు చేశారు.
సంబంధిత కథనం