Kannur Squad Review: కన్నూర్ స్క్వాడ్ రివ్యూ - మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మమ్ముట్టి మూవీ ఎలా ఉందంటే?
Kannur Squad Review: ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో ఒకటిగా కన్నూర్ స్క్వాడ్ నిలిచింది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో మమ్ముట్టి హీరోగా నటించాడు.
Kannur Squad Review: మమ్ముట్టి హీరోగా నటించిన కన్నూర్ స్క్వాడ్ ఈ ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు రాబీ వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించాడు. ఇటీవల థియేటర్లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందంటే...
కన్నూర్ స్క్వాడ్ కథ…
కేరళ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కన్నూర్ స్క్వాడ్ టీమ్ నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. ఎంతటి క్లిష్టతరమైన కేసునైనా తమ ధైర్యసాహసాలతో సాల్వ్ చేస్తుంటారు. కన్నూర్ స్క్వాడ్ టీమ్‌కు జార్జ్ (మమ్ముట్టి) హెడ్‌గా వ్యవహరిస్తుంటాడు. జయన్(రోనీ), షషీ (షబరీష్), జోస్(అజీస్) సభ్యులుగా పనిచేస్తుంటారు. కాసార్‌గాడ్‌కు చెందిన అబ్ధుల్ వహాబ్ అనే పొలిటిషియన్ దారుణ హత్యకు గురవుతాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈ మర్డర్ కేసు సంచలనంగా మారుతుంది.
ఈ కేసును పది రోజుల్లో సాల్వ్ చేయాలని పోలీసులను హోమ్ మినిస్టర్ ఆదేశిస్తాడు. ఈ కేసును సాల్వ్ చేసే బాధ్యతను కన్నూర్ స్క్వాడ్‌కు అప్పగిస్తాడు ఎస్‌పీ. పది రోజుల్లోనే ఎలాంటి ఆదారాలు లేని ఈ క్రైమ్‌ను కన్నూర్ స్క్వాడ్ ఎలా సాల్వ్ చేసింది? ఈ ప్రయాణంలో జార్జ్‌తో పాటు మిగిలిన టీమ్ మెంబర్స్‌కు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి?
ఈ మర్డర్ చేసింది ఎవరు? ఆ క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు కన్నూర్ స్క్వాడ్ టీమ్ ఎలా ప్రయాణం చేసింది? నిజాయితీకి మారుపేరైన కన్నూర్ స్క్వాడ్ టీమ్‌పై లంచగొండిగా ఎందుకు ముద్రపడింది? యూపీలో ఓ గ్రామంలో అడుగుపెట్టిన కన్నూర్ స్వ్కాడ్ టీమ్ తమ ప్రాణాలను దక్కించుకోవడానికి ఎలాంటి పోరాటం చేశారు అన్నదే ఈ సినిమా కథ.
మమ్ముట్టి ఇమేజ్‌కు భిన్నంగా...
కథాంశాల ఎంపికలో డిఫరెంట్‌గా ఆలోచిస్తుంటారు మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి. ఇమేజ్, స్టార్‌డమ్‌కు అతీతంగా ఎవరూ ఊహించిన కథల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటాడు. మమ్ముట్టి నుంచి వచ్చిన మరో వైవిధ్యమైన ప్రయత్నమే కన్నూర్ స్క్వాడ్ మూవీ.
రియలిస్టిక్ క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దర్శకుడు రాబీ వర్గీస్ రాజ్ ఈ మూవీని తెరకెక్కించాడు. కన్నూర్ స్వ్కాడ్ పేరుతో నిజంగానే కేరళలో ఓ స్పెషల్ పోలీస్ టీమ్ ఉండేది, ఆ టీమ్ సాల్వ్ చేసిన క్రైమ్‌ల నుంచి స్ఫూర్తి పొందుతూ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు.
వృత్తికి, వ్యక్తిగత జీవితానికి...
కన్నూర్ స్క్వాడ్ ఓ సినిమాలా కాకుండా పోలీసులు ఇన్వేస్టిగేషన్‌ను నిజంగానే చూస్తున్న అనుభూతి కలుగుతుంది. క్రైమ్ అంశాలతో పాటు వృత్తికి, వ్యక్తిగత బాధ్యతలకు మధ్య పోలీసులకు ఎదుర్కొనే సంఘర్షణను ఈ సినిమాలో చూపించారు.
మర్డర్ సీన్‌తోనే...
ఓ క్రిమినల్‌ను కన్నూర్ స్క్వాడ్ పట్టుకునే సీన్‌తోనే ఈ సినిమా మొదలవుతుంది. అదే టైమ్‌లో మరో మిస్టరీ కేసు వారికి ఎదురవ్వడం, ఆ తర్వాత టీమ్‌లోని ఓ సభ్యుడు లంచం తీసుకోవడం స్వ్కాడ్ మొత్తం విడిపోయే సన్నివేశాలతో ఈ సినిమా నడుస్తుంది. అబ్దుల్ వహాబ్ మర్డర్‌తోనే అసలు సినిమా మొదలవుతుంది. ఈ మర్డర్ కేసును జార్జ్ టీమ్ చేపట్టిన తర్వాత జరిగే ఇన్వేస్టిగేషన్ ప్రాసెస్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.
పోలీసులను తప్పుదోవ పట్టించడానికి క్రిమినల్ వేసే ఎత్తులను జార్జ్ సాల్వ్ చేసే సీన్స్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి జార్జ్ టీమ్ యూపీలోని ఓ పల్లెటూరికి వెళ్లిన తర్వాత ఊరు మొత్తం వారికి చంపడానికి ప్రయత్నించడం, అక్కడి నుంచి బయటపడటానికి కన్నూర్ స్వ్కాడ్ చేసే పోరాటం గూస్‌బంప్స్‌ను కలిగిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా జార్జ్ టీమ్ అసలైన క్రిమినల్స్‌ను ఎలా పట్టుకున్నారన్నది థ్రిల్లింగ్‌గా డైరెక్టర్ చూపించారు.
ఖాకీని గుర్తుకుతెస్తుంది...
కన్నూర్ స్క్వాడ్ టీమ్ చాలా వరకు కార్తి ఖాకీ సినిమాను గుర్తుకుతెస్తుంది. మమ్ముట్టి టీమ్‌కు యూపీలో ఎదురయ్యే సీన్స్ చూస్తుంటే ఖాకీ సినిమాను మరోసారి చూసినట్లుగా అనిపిస్తుంది.
మమ్ముట్టి హీరోయిజం …
జార్జ్ పాత్రలో మమ్ముట్టి అసమాన నటనను కనబరిచాడు. రెగ్యులర్ హీరోలకు భిన్నంగా అతడి క్యారెక్టర్ సాగుతుంది. మమ్ముట్టి పాత్ర తాలూకు హీరోయిజం, ఎలివేషన్స్ ఆకట్టుకుంటాయి. కన్నూర్ స్వ్కాడ్‌లోని రోనీ, షబరీస్, అజీస్ సహజ నటనను కనబరిచారు. ఎస్‌పీగా కాంతార కిషోర్ మెప్పించాడు.
ప్రయోగాత్మక క్రైమ్ థ్రిల్లర్...
కన్నూర్ స్క్వాడ్ టీమ్ ప్రయోగాత్మక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. హీరోహీరోయిన్ అనే మూసఫార్ములాకు పూర్తి భిన్నంగా కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.