Thriller Movie: మూడు వారాల కింద మాయమై.. మళ్లీ ఓటీటీలోకి వచ్చిన థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
Thriller Movie: ఓ థ్రిల్లర్ మూవీ మూడు వారాల కిందట మాయమై.. మళ్లీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. కన్నడలో సూపర్ హిట్ అయిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ బ్లింక్ సినిమా ప్రైమ్ వీడియోలోకి వచ్చినట్లు ఆ ఓటీటీ వెల్లడించింది.
Thriller Movie: కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయిన సైన్స్ ఫిక్షన్ మూవీ బ్లింక్ మూడు వారాల కిందట ఓటీటీలో నుంచి సడెన్ గా మాయమైపోయింది. అసలు ఏమైందన్నది ఎవరికీ తెలియలేదు. అయితే ఇప్పుడా సినిమా మళ్లీ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్షమైంది. సాంకేతిక కారణాల వల్ల తమ సినిమా ఆగిపోయిందని, ఇప్పుడు తిరిగి వచ్చిందని మూవీ ప్రొడ్యూసర్ రవిచంద్ర చెప్పాడు.
మళ్లీ ఓటీటీలోకి వచ్చిన బ్లింక్
తెలుగులో దసరా మూవీలో నటించిన దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన కన్నడ మూవీ బ్లింక్. ఈ సినిమా గత నెలలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. వచ్చీ రాగానే రికార్డు వ్యూస్ తో దూసుకెళ్లింది. అయితే పది రోజుల తర్వాత ఈ మూవీ సడెన్ గా మాయమైపోయింది. ఎందుకు స్ట్రీమింగ్ ఆగిపోయిందో అర్థం కాలేదు. కానీ మంగళవారం (జూన్ 18) నుంచి ఈ మూవీ తిరిగి ప్రైమ్ వీడియోలోకి వచ్చింది.
ఈ విషయాన్ని బ్లింక్ మూవీ ప్రొడ్యూసర్ రవిచంద్ర ఏజే ఎక్స్ ద్వారా వెల్లడించాడు. "సాంకేతిక కారణాల వల్ల మా బ్లింక్ మూవీ గత మూడు వారాలుగా అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అసౌకర్యానికి చింతిస్తున్నాం. సినిమా చూసి ఎంజాయ్ చేయండి" అంటూ ప్రైమ్ వీడియోలో ఆ మూవీ లింక్ ను కూడా రవిచంద్ర షేర్ చేశాడు.
నిజానికి సినిమాలో కొన్ని మ్యూజిక్ సంబంధిత మార్పులు చేయాలని మేకర్స్ అనడంతో ప్రైమ్ వీడియో ఈ మూవీ స్ట్రీమింగ్ ఆపేసినట్లు తెలిసింది. ఇప్పుడా మార్పులు చేసిన తర్వాత తిరిగి సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చారు. మూవీలో అక్కడక్కడా వాడిన మ్యూజిక్ తో కాపీరైట్ సమస్యలు వస్తాయని భావించే ఇలా చేసినట్లు సమాచారం.
ఏంటీ బ్లింక్ మూవీ?
బ్లింక్ మూవీకి శ్రీనిధి బెంగళూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టికి జోడీగా మందాత హీరోయిన్‌గా నటించింది. చైత్ర జే ఆచార్ కీలక పాత్ర పోషించింది. మార్చి 8న ఈ కన్నడ మూవీ థియేటర్లలో రిలీజైంది. తొలుత యాభై లోపు థియేటర్లు మాత్రమే ఈ సినిమాకు దొరికాయి. మౌత్‌టాక్ బాగుండటంతో థియేటర్లు పెరిగాయి. కథ, కథనాలతో పాటు దీక్షిత్ శెట్టి యాక్టింగ్, డైరెక్టర్ శ్రీనిధి టేకింగ్‌పై ప్రశంసలు కురిశాయి.
అపూర్వ (దీక్షిత్ శెట్టి) పీజీలో ఫెయిలవుతాడు. ఆ విషయం తల్లి దగ్గర దాచిపెట్టి పార్ట్‌టైమ్ జాబ్‌లు చేస్తూ పబ్బం గడుపుతుంటాడు. స్వప్నను (మందాత) ప్రాణంగా ప్రేమించిన అపూర్వ మంచి జాబ్ సంపాదించి జీవితంలో సెటిల్ కావాలని అనుకుంటాడు. తండ్రి గురించి వెల్లడైన ఓ రహస్యం కారణంగా సాఫీగా సాగిపోతున్న అపూర్వ జీవితం మొత్తం తలక్రిందులు అవుతుంది.
కంటిరెప్పలను మూయకుండా నియత్రించే శక్తి అపూర్వకు ఎక్కడి నుంచి వచ్చింది? అదే అతడి లైఫ్‌ను ఎలా కష్టాల్లోకి నెట్టింది? కంటి రెప్పలను మూసిన మరుక్షణం టైమ్ ట్రావెల్‌లో అతడు ముందుకు.. వెనక్కి ఎలా వెళ్లాడు అన్నదే బ్లింక్ మూవీ కథ. 1996, 2001, 2021, 2035 కాలాన్ని చూపిస్తూ మొత్తం నాలుగు టైమ్ పీరియడ్స్ నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో ఈ మూవీ సాగుతుంది.