Leelavathi: 600కుపైగా సినిమాల్లో నటించిన దిగ్గజ నటి కన్నుమూత.. సంతాపం వ్యక్తం చేసిన సీఎం
Leelavathi Death: కన్నడ సినీ దిగ్గజ నటి లీలావతి కన్నుమూశారు. తెలుగులోనూ ఆమె సినిమాలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్‌తోనూ నటించారు. మొత్తంగా 600పైగా చిత్రాలు చేశారు లీలావతి.
Leelavathi Death: కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దిగ్గజ సీనియర్ నటి లీలావతి కన్నుమూశారు. బెంగళూరులోని నేలమంగరలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె నేడు (డిసెంబర్ 8) పరమపదించారు. 85 ఏళ్ల వయసులో లీలావతి దివికేగారు. 50 ఏళ్ల సినీ కెరీర్లో 600కు పైగా చిత్రాల్లో (కన్నడలోనే 400కుపైగా) ఆమె నటించారు.
వయో సంబంధిత అనారోగ్యం కారణంగా లీలావతి కొంతకాలం క్రితం ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే కన్నుమూశారు. లీలావతి తన కెరీర్లో అత్యధికంగా కన్నడ సినిమాలు చేశారు. తెలుగు, తమిళంలోనూ కొన్ని చిత్రాలు చేశారు. తెలుగులో ఐదు చిత్రాల్లో లీలావతి నటించారు.
1936లో లీలావతి జన్మించారు. 1958లో కన్నడ సినిమాల్లో తెరంగేట్రం చేశారు. మాంగల్య యోగ మూవీతో ఆమె సుదీర్ఘ సినీ కెరీర్ మొదలైంది. 50 సంవత్సరాలు అద్భుత సినీ ప్రయాణంలో 600కు పైగా చిత్రాల్లో ఆమె నటించారు. కన్నడలో అత్యంత పాపులర్ నటి అయ్యారు. కన్నడ స్టార్ రాజ్‍కుమార్‌తో చాలా సినిమాల్లో ఆమె హీరోయిన్‍గా నటించారు.
కన్నడ గత తరం హీరోలు ఉదయకుమార్, విష్ణువర్ధన్, శంకర్ నాగ్ సహా చాలా మందితో లీలావతి నటించారు. కన్నడలోనే 400 చిత్రాలకు పైగా చేశారు. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్‌తోనూ కలిసి నటించారు లీలావతి. శోభన్ బాబు ‘కార్తీకదీపం’, చిరంజీవి ‘ఇది కథకాదు’ సినిమాల్లోనూ లీలావతి కనిపించారు. తమిళంలో జెమీనీ గణేషన్, కమల్ హాసన్, రజినీకాంత్‍నూ స్క్రీన్ పంచుకున్నారు లీలావతి. మొత్తంగా అన్ని భాషల్లో కలిపి వివిధ పాత్రల్లో 600కుపైగా మూవీస్ చేశారు. 2009లో వచ్చిన యారదు సినిమాలో ఆమె చివరగా నటించారు.
కన్నడలో నాలుగు చిత్రాలను కూడా లీలావతి నిర్మించారు. ఆమె సేవాకార్యక్రమాలను కూడా ఆమె చాలా చేశారు. 1999లో డాక్టర్ రాజ్‍కుమార్ జీవితసాఫల్య పురస్కారం, 2008లో తుముకూర్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‍ను లీలావతి అందుకున్నారు.
లీలావతి మరణవార్త తెలుసుకున్న కన్నడ సినీ నటులు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శివరాజ్ కుమార్ సహా చాలా మంది ప్రముఖులు ఆమె నివాసానికి వెళ్లి నివాళులు అర్పించనున్నారు. లీలావతికి సోషల్ మీడియా వేదికగా చాలా మంది నివాళులు అర్పిస్తున్నారు. తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం
లీలావతి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ఆమె మరణ వార్త తనను కలచివేసిందని ట్వీట్ చేశారు. “కన్నడ సీనియర్ నటి లీలావతి మరణవార్త బాధిస్తోంది. ఆమె అనారోగ్యం విషయం నాకు గత వారమే తెలిసింది. ఇంటికి వెళ్లి.. ఆమె కుమారుడు వినోద్ రాజ్‍ను ఆడిగి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నా. తన అద్భుతమైన నటనతో దశాబ్దాల పాటు ఆమె ప్రేక్షకులను అలరించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి” అని సిద్దరామయ్య ట్వీట్ చేశారు.