Hitha Chandrashekar: పిల్లలను కనడం కన్న కుక్క పిల్లను పెంచుకోవడం బెటర్.. మాతృత్వంపై నటి కామెంట్స్
Hitha Chandrashekar About Motherhood: కన్నడ నటి హిత చంద్రశేఖర్‌కు పెళ్లి అయి నాలుగేళ్లు అవుతోంది. అయితే, తాజాగా పిల్లలను కనడంపై వారిని పెంచడంపై షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది ఈ కన్నడ ముద్దుగుమ్మ హిత చంద్రశేఖర్. దీంతో ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి.
Hitha Chandrashekar About Motherhood: కాలం మారుతోంది. ప్రజల ఆలోచనలు మారుతున్నాయి. ఆధునికత రేసులో కుటుంబం అనే పదానికి నిర్వచనం కూడా మారుతోంది. పెళ్లి వద్దు, చివరి వరకు కలిసి ఉందాం, పిల్లలు కావాలి కానీ పెళ్లిళ్లు వద్దు వంటి మాటలు వింటున్నాం. ముఖ్యంగా సెలబ్రిటీల ఆలోచనవిధానాలు మరింత ఆశ్చర్యంగా ఉంటున్నాయి. అయితే ఇది ఎవరి వ్యక్తిగతం వారిదైనప్పటికీ కొందరు చెప్పే సమాధానాలు మాత్రం షాకింగ్‌గా ఉంటున్నాయి.
మనవడిని ఎప్పుడిస్తావ్
కన్నడ పాపులర్ నటుడు సిహి కహీ చంద్రు కుమార్తె హితా చంద్రశేఖర్ తనకు పిల్లలు వద్దని చెబుతుంది. డిసెంబర్ 2019లో బాల నటుడిగా పేరు తెచ్చుకున్న కిరణ్ శ్రీనివాస్‌ను పెళ్లాడింది హితా చంద్రశేఖర్. పెళ్లయి నాలుగున్నరేళ్లు కావొస్తున్నా ఈ దంపతులకు పిల్లలను కనాలని లేదట. అయితే, బంధుమిత్రుల నుంచి మనవడిని ఎప్పుడు ఇస్తావ్ అనే ప్రశ్నలు మాత్రం తలెత్తుతూనే ఉన్నాయట. ఈ పిల్లల గురించి ఓ షోలో హిత చంద్రశేఖర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో
"మొదట నాకు పిల్లలను కనాలని లేదు. కిరణ్, నేను స్నేహితులుగా ఉన్నప్పుడే ఈ విషయం గురించి చర్చించుకున్నాం. అతను కూడా సానుకూలంగా స్పందించాడు. నాకు సొంత బిడ్డ ఎందుకు కావాలి? నాకు అలా కావాలని ఏం అనిపించడం లేదు. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులను చూస్తున్నామో తెలుసు. అలాంటి పరిస్థితిలో ఇంకో బిడ్డను ఈ లోకంలోకి తీసుకురావాలా? అన్నది నా ఆలోచన. కిరణ్‌కి కూడా అలాగే అనిపించింది" అని హిత తెలిపింది.
కుక్క పిల్లను
"మాతృత్వ మధురాన్ని పొందాలంటే సొంతంగా పిల్లలను కని తల్లిదండ్రులుగా మారాల్సిన అవసరం ఏం లేదు. ఓ కుక్కపిల్లని కూడా మన సొంత బిడ్డలాగా పెంచుకోవచ్చు. చాలా మంది అంటుంటారు. మనం పెద్దయ్యాకా, వృద్ధాపం వచ్చినప్పుడు మనల్ని ఎవరు చూసుకుంటారు. మన చివరి రోజుల్లో మనల్లి చూసుకునేది ఎవరు అని ప్రశ్నిస్తారు. నాకు దాని గురించి ఏమాత్రం బాధలేదు" అని హిత చంద్రశేఖర్ చెప్పింది.
పిల్లలతో లాభమేంటీ
"నేను ఈ నిర్ణయానికి రావడానికి కారణం ఏమిటంటే, ఈరోజు ఎంత మంది తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు? దీని గురించి మనం తెలుసుకోవాలి. ఈ సమాజంలో ఏమి జరుగుతుందో మీరు మమ్మల్ని అడుగుతున్నారు. ప్రస్తుతం సమాజంలో కొడుకు లేదా కుమార్తె అమెరికాలో లేదా ఇంకా ఎక్కడో దూరంగా ఉంటున్నారు. తల్లితండ్రులు మరోచోట ఉంటున్నారు. కేవలం ఆ ఇద్దరు దంపతులు మాత్రమే ఉంటున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నా ఏం లాభం అనే ప్రశ్న తలెత్తుతుంది" అని హిత చెప్పుకొచ్చారు.
వాళ్ల సపోర్ట్ ఉంది
"ఇప్పుడు మాకు మాకోసమే సమయం ఉండటం లేదు. అలాంటప్పుడు పిల్లలను కనడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటీ. తల్లిదండ్రులిద్దరిలో ఎవరో ఒకరు పోతే.. సింగిల్‌గా వారి జీవితం ఎలా ఉంటుంది. వాళ్లని ఎవరు చూసుకుంటారు. ఇక్కడ ఎవరు పిల్లలను కనొద్దని నేను చెప్పట్లేదు. ఇది నా నిర్ణయం. అది చెబుతున్నాను. ఈ విషయం గురించి నేను మా తల్లిదండ్రులకు కూడా చెప్పాను. వారు కూడా ఒప్పుకున్నారు. ఇక నేను ఇంకొకరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు" అని హిత చంద్రశేఖర్ అన్నారు.
ఆంక్షలు పెట్టలేదు
"మా తల్లిదండ్రులు నా ఆలోచనలు, నిర్ణయాలను అర్థం చేసుకుంటారు. కిరణ్ వాళ్ల నాన్న అంటే, మా మామగారు కూడా మా నిర్ణయంపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. వృద్ధాప్యంలో కూడా మేమిద్దరం స్నేహితుల్లాగే కలిసిమెలిసి ఉండాలని, టైమ్ స్పెండ్ చేయాలని అనుకుంటున్నాం" అని హిత చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.