Kanguva Effect: కంగువ డిజాస్టర్ ఎఫెక్ట్.. వాళ్లను బ్యాన్ చేయాలంటూ తమిళనాడు ప్రొడ్యూసర్ల డిమాండ్
Kanguva Effect: కంగువ మూవీ డిజాస్టర్ ఎఫెక్ట్ తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పై గట్టిగానే పడింది. ఈ మూవీకి తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు రావడంతో థియేటర్ల నుంచి యూట్యూబ్ ఛానెల్స్ నుంచి నిషేధించాలంటూ వాళ్లు డిమాండ్ చేయడం గమనార్హం.
Kanguva Effect: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజైనా తొలి రోజు తొలి షో నుంచే దారుణమైన రివ్యూలు వచ్చిన విషయం తెలుసు కదా. దీని ప్రభావంతో మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దీనికి కారణం తొలి షో ముగియగానే యూట్యూబ్ ఛానెల్స్ కు అభిమానులు ఇచ్చే రివ్యూలే అంటున్న తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్లపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తోంది.
వాళ్లను నిషేధించాల్సిందే..
ఏ కొత్త సినిమా రిలీజైనా ఈ మధ్య యూట్యూబ్ ఛానెల్స్ వాళ్లు థియేటర్ల దగ్గర నిలబడి తొలి షో చూసి బయటకు వచ్చే ప్రేక్షకుల రివ్యూలు తీసుకుంటున్నారు. అయితే ఈ రివ్యూలు ఆయా సినిమాలపై చాలా ప్రభావం చూపుతున్నాయి. తాజాగా కంగువ మూవీకి కూడా తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు రావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది.
దీంతో తమిళనాడు ప్రొడ్యూసర్స్ బుధవారం (నవంబర్ 20) ఓ నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. సినిమా రివ్యూల పేర్లతో ద్వేషాన్ని నింపడాన్ని తీవ్రంగా ఖండించారు. కంగువతోపాటు ఇండియన్ 2, వేట్టయన్ లాంటి సినిమాలు యూట్యూబ్ ఫస్ట్ డే ఫస్ట్ షో పబ్లిక్ రివ్యూల వల్ల చాలా నష్టపోయాయని కౌన్సిల్ చెప్పింది.
రివ్యూలు ఓకే కానీ..
సూర్య నటించిన కంగువ మూవీ నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కాగా.. దారుణమైన నెగటివ్ రివ్యూలు వచ్చాయి. మూవీపై భారీ ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులకు తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ లేఖ రాసింది. సినిమాలో పాజిటివ్, నెగటివ్ అంశాలు చెప్పడం వరకూ ఓకే కానీ పనిగట్టుకొని నెగటివ్ రివ్యూలు ఇవ్వడం సరికాదని కౌన్సిల్ అభిప్రాయపడింది.
"సినిమాను రివ్యూ చేసే హక్కు క్రిటిక్స్ కు ఉంది. కానీ వ్యక్తిగతమైన దురద్దేశాలతో ఓ సినిమాపై ద్వేషాన్ని నింపేలా రివ్యూలు మాత్రం రాయొద్దని అందరు జర్నలిస్టులను కోరుతున్నాం. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అందరూ ఏకమై ఇలాంటి వాటికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది" అని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చెప్పింది. యూట్యూబ్ ఛానెల్స్ తొలి షో పూర్తవగానే రివ్యూ తీసుకోకుండా నిషేధం విధించాలని థియేటర్ల ఓనర్లను కోరింది.
కేరళలో ఇప్పటికే నిషేధం
కేరళలో ఇప్పటికే ఈ యూట్యూబ్ రివ్యూలపై నిషేధం విధించారు. గతేడాది అరోమలింతే ఆద్యతే ప్రణయం మూవీ డైరెక్టర్ ముబీన్ రౌఫ్ ఈ యూట్యూబ్ రివ్యూయర్లపై నిషేధం విధించాలంటూ కోర్టుకెక్కాడు. వాటి ద్వారా సినిమా వ్యాపారం దెబ్బ తింటోందని వాదించాడు.
దీంతో కోర్టు అతని వాదనతో ఏకీభవించి ఈ రివ్యూయర్లపై నిషేధం విధించింది. ఇలా ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్, వ్లోగర్స్ ను నియంత్రించేలా స్పష్టమైన విధివిధానాలు కూడా రూపొందంచాలంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖను కూడా కోర్టు ఆదేశించింది.