Kangana Ranaut: అవును ఆమె నన్ను కొట్టింది..: ఎయిర్‌పోర్ట్ చెంపదెబ్బ ఘటనపై స్పందించిన కంగనా
Kangana Ranaut: ఎయిర్‌పోర్టులో చెంపదెబ్బ ఘటనపై నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందించింది. ఓ సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెపై చేయి చేసుకున్న విషయం తెలిసిందే.

Kangana Ranaut: తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్ తనకు జరిగిన చేదు అనుభవంపై స్పందించింది. సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది చేయి చేసుకోవడం నిజమే అని ఆమె చెప్పడం గమనార్హం. అయితే తాను సురక్షితంగానే ఉన్నట్లు ఆమె తెలిపింది.
చెంపదెబ్బపై కంగనా రియాక్షన్ ఇదీ
ఎంపీగా గెలిచిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ నుంచి గురువారం (జూన్ 6) ఆమె ఢిల్లీ వెళ్లింది. ఈ క్రమంలో చంఢీగడ్ ఎయిర్ పోర్టులో కంగనాకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడ పని చేస్తున్న ఓ సీఐఎస్ఎఫ్ మహిళ ఆమెపై చేయి చేసుకుంది. రైతుల ఉద్యమానికి తాను మద్దతిస్తున్నట్లు చెబుతూ ఆమె ఈ పని చేయడం గమనార్హం. ఈ ఘటనపై కంగనా స్పందించింది.
సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆమె తనను కొట్టిన మాట నిజమే అని, అయితే తాను సేఫ్ గానే ఉన్నట్లు చెప్పింది. "నమస్తే ఫ్రెండ్స్. మీడియా, శ్రేయోభిలాషుల నుంచి నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ముందుగా చెప్పాలంటే నేను సురక్షితంగానే ఉన్నాను. ఇవాళ చంఢీగడ్ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెక్ దగ్గర ఓ ఘటన జరిగింది.
నా సెక్యూరిటీ చెక్ పూర్తయిన తర్వాత నేను ఓ సీఐఎస్ఎఫ్ సిబ్బంది ముందు నుంచి వెళ్లడానికి సిద్ధమవుతున్నాను. ఈ సమయంలో ఆమె నన్ను ముఖంపై కొట్టింది. తిట్టడం మొదలుపెట్టింది. ఇలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తే.. తాను రైతుల ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు చెప్పింది" అని కంగనా వెల్లడించింది.
పంజాబ్‌లో ఉగ్రవాదులంటూ..
ఇదే వీడియోలో కంగనా పంజాబ్ లో ఉగ్రవాదులు పెరిగిపోతున్నారని అనడం గమనార్హం. "నేను పూర్తి సురక్షితంగా ఉన్నాను. కానీ పంజాబ్ లో ఇలా రోజురోజుకూ పెరిగిపోతున్న టెర్రరిస్టుల సమస్యను ఎలా పరిష్కరించాలన్నది ఆలోచించాలి" అని వీడియో చివర్లో కంగనా అన్నది. ఎంపీ అయిన కంగనాపై ఓ సీఐఎస్ఎఫ్ సిబ్బంది చేయి చేసుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి.
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా గతంలో కంగనా కామెంట్స్ చేసింది. పైగా ఆమె ప్రస్తుతం బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికైంది. దీంతో పంజాబ్ కే చెందిన సదరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెను చెంపదెబ్బ కొట్టడం సంచలనం రేపింది. ఈ మధ్యే ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కంగనా హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్యను ఓడించిన విషయం తెలిసిందే.
ఆమె చాన్నాళ్లుగా బీజేపీకి మద్దతుగా కామెంట్స్, పోస్టులు చేస్తూ వస్తోంది. ఈ ఏడాదే పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించింది. 2005లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ మూవీ ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కంగనా.. తర్వాత క్వీన్, తను వెడ్స్ మను, ఫ్యాషన్ లాంటి సినిమాల ద్వారా పేరు సంపాదించింది. ఆమె నటించిన ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. ఇక ఇప్పుడు ఎంపీగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతోంది.
టాపిక్