Emergency Release Date: బాలీవుడ్ నటి, ఎంపీ అయిన కంగనా రనౌత్ నటిస్తున్న మూవీ ఎమర్జెన్సీ. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్ గా వస్తున్న ఈ మూవీ ఎంతో ఆసక్తి రేపుతోంది. చాలా రోజులుగా వేచి చూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ మంగళవారం (జూన్ 25) అనౌన్స్ చేశారు. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
బాలీవుడ్ లో ఎన్నో ఏళ్లుగా నటిస్తూ ఈ మధ్యే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అయిన కంగనా రనౌత్ తన నెక్ట్స్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీగా కనిపించబోతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 6న థియేటర్లలోకి రాబోతోంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఇందిరా పాత్రకు అచ్చు గుద్దినట్లు సరిపోయిన కంగనాతో ఓ కొత్త పోస్టర్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
"స్వతంత్ర భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయానికి 50 ఏళ్ల నిండుతున్న సందర్భంలో కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీ సెప్టెంబర్ 6, 2024న రాబోతోందని అనౌన్స్ చేస్తున్నాం. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన ఎపిసోడ్ ను ఈ సినిమా ద్వారా తీసుకురాబోతున్నాం. ఎమర్జెన్సీ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 6న థియేటర్లలోకి రానుంది" అనే క్యాప్షన్ తో కంగనా ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి తెలిపింది.
కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చింది. లోక్ సభ ఎన్నికలు కూడా దీనికి ఓ కారణమయ్యాయి.
ఈ ఎమర్జెన్సీ మూవీని అన్నీ తానై నడిపింది కంగనా. ఇందులో లీడ్ రోల్ పోషించడంతోపాటు కథ, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలన్నీ తానే మోసింది. మణికర్ణిక ఫిల్మ్ ప్రొడక్షన్ ఈ పొలిటికల్ డ్రామాను ప్రొడ్యూస్ చేుసింది. నిజానికి గతేడాది నవంబర్ 24నే రిలీజ్ కావాల్సిన మూవీ.. ఈ ఏడాది సెప్టెంబర్ 6న రాబోతోంది.
ఇండియా రాజకీయ చరిత్రలో ఎమర్జెన్సీని ఓ చీకటి అధ్యాయంగా చెబుతారు. 1975 నుంచి 1977 మధ్య ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సాధారణ పౌరులు, మీడియా, ప్రతిపక్ష నేతల విషయంలో ఎన్నో దారుణాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడా చీకటి అధ్యాయాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కంగనా రనౌత్.
ఈ సినిమాలో కంగనాతోపాటు అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయస్ తల్పడే, సతీష్ కౌశిక్ నటించారు. భారతదేశ చరిత్రలోని ఈ అత్యద్భుతమైన ఎపిసోడ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు గతంలో కంగనా తెలిపింది. ఈ మధ్యకాలంలో వరుసగా డిజాస్టర్ సినిమాల్లో నటించిన కంగనా.. మరి ఈ ఎమర్జెన్సీ మూవీతో అయినా మళ్లీ గాడిలో పడుతుందేమో చూడాలి.