కర్ణాటకలో తన థగ్ లైఫ్ సినిమాను రిలీజ్ చేయకుండా అడ్డుకోవడంపై కర్ణాటక హైకోర్టుకు వెళ్లిన కమల్ హాసన్ కు అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది. కన్నడ భాషపై అతడు చేసిన కామెంట్స్ ను కోర్టు కూడా తప్పుబట్టింది. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు అతనికి మొట్టికాయలు వేయడంతోపాటు క్షమాపణ చెప్పడానికి ఇబ్బందేంటని ప్రశ్నించింది.
కమల్ హాసన్ వేసిన పిటిషన్ పై మంగళవారం (జూన్ 3) కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్బంగా కోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో కమల్ తగిన చర్యలు తీసుకోవడానికి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సమయం ఇచ్చింది. “విచక్షణ అనేది ముఖ్యమైనది. ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి మేము అంగీకరించం. తప్పులు జరుగుతాయి. కానీ ఆ తప్పులు జరిగినప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలి” అని కోర్టు వ్యాఖ్యానించింది.
కమల్ హాసన్ తరఫున రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పిటిషన్ ఫైల్ చేసింది. ఈ విషయాన్ని కోర్టు తేలిగ్గా తీసుకోలేదు. “కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని అతడు అన్నాడు. మీరు కమల్ హాసన్ కావచ్చు ఎవరైనా కావచ్చు.. ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దు. ఈ దేశం కేవలం భాషల పరంగానే వేరుగా ఉంది. ప్రముఖులు ఎవరూ ఇలాంటి కామెంట్స్ చేయకూడదు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల సామరస్యం దెబ్బతింది. కర్ణాటక ప్రజలు కేవలం క్షమాపణే అడిగారు. కానీ మీరు ఇప్పుడు వచ్చి రక్షణ కోరుతున్నారు” అని కోర్టు కామెంట్ చేసింది.
రాజ్ కమల్ ఫిల్మ్స్ తరఫున వాదించిన ధ్యాన్ చిన్నప్ప.. కమల్ ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశాడో గమనించాలని అన్నారు. “ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని మీరు గమనించాలి. ఆ సమయంలో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ కూడా అక్కడ ఉన్నారు. అతని ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకొని కన్నడ భాషకు వ్యతిరేకంగా మాట్లాడాడన్న వాదనను పక్కన పెట్టాలి” అని ఆయన వాదించారు. దీనిపై కమల్ ఇచ్చిన లిఖితపూర్వక వివరణను కోర్టుకు సమర్పించారు.
కానీ అందులో క్షమాపణ లేదుగా అని కోర్టు వ్యాఖ్యానించింది. “ఇందులో క్షమాపణ లేదు. ఈ సినిమాను మణిరత్నం తీశాడంటూ దాని ప్రాముఖ్యతను చెబుతున్నారు. కానీ ఆ వ్యాఖ్యల ప్రాముఖ్యతను మాత్రం గుర్తించడం లేదు. మీరు చేసుకున్నదానికే ఇప్పుడు మీరు పోలీసుల రక్షణ అడుగుతున్నారు. భాష అనేది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. మీరు సాధారణ వ్యక్తి కాదు. ఓ ప్రముఖులు” అని కోర్టు కామెంట్ చేసింది.
సంబంధిత కథనం
టాపిక్