Kamal Haasan Rajinikanth: రజనీకాంత్‌తో కలిసి మళ్లీ సినిమా చేయకూడదని కమల్ హాసన్ ఎందుకు అనుకున్నాడు.. అతడేమన్నాడంటే?
Kamal Haasan Rajinikanth: తమిళ సూపర్ స్టార్లు కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి మళ్లీ సినిమా చేస్తారా? ఛాన్సే లేదంటున్నాడు కమల్. దీనికి కారణమేంటో కూడా అతడు వివరించాడు.
Kamal Haasan Rajinikanth: కమల్ హాసన్, రజనీకాంత్.. సౌత్ లోనే కాదు ఇండియన్ సినిమా మొత్తం గర్వపడే నటులు వీళ్లు. కొన్ని దశాబ్దాలుగా వీళ్లు తమిళ సినిమా ఇండస్ట్రీలో నటిస్తున్నారు. తెలుగుతోపాటు ఎన్నో ఇతర భాషల్లోనూ పాపులారిటీని సంపాదించారు. అయితే వీళ్లిద్దరూ కలిసి మళ్లీ సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నారట. తాజా ఇంటర్వ్యూలో కమల్ ఈ విషయం చెప్పాడు.
కమల్, రజనీ కలిసి సినిమా చేయరట..
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్. దివంగత తమిళ దర్శకుడు బాలచందరే ఈ ఇద్దరికీ సినిమా గురువు. ఒకప్పుడు అతని సినిమాల్లో కలిసి పని చేశారు. అయితే ఇద్దరూ స్టార్ హీరోలుగా ఎదిగిన తర్వాత మాత్రం మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కలిసి కనిపించలేదు. తెర వెనుక ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నా.. ఇద్దరూ కలిసి సినిమా ఎందుకు చేయలేదో తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ వివరించాడు.
భవిష్యత్తులో ఇద్దరూ కలిసి సినిమా చేస్తారా లేక ఒకరి సినిమాలో మరొకరు అతిథి పాత్రలో అయినా కనిపిస్తారా అన్న ప్రశ్నకు అతడు స్పందించాడు. "ఇదేమీ కొత్త కాంబినేషన్ కాదు. ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. ఆ తర్వాత కలిసి సినిమాలు చేయకూడదని ఇద్దరం నిర్ణయించుకున్నాం. మేము ఇద్దరు పోటీదారులలాగా కాదు. మా ఇద్దరి గురువూ ఒక్కరే. ప్రతి దగ్గరా ఉన్నట్లే మా మధ్య కూడా పోటీ ఉంది. కానీ శతృత్వం లేదు. మా ఇద్దరివి వేర్వేరు దారులు" అని కమల్ అనడం గమనార్హం.
"మేమిద్దరం ఎప్పుడూ ఒకరి గురించి మరొకరం నెగటివ్ కామెంట్స్ చేసుకోము. మా 20ల వయసులోనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడేదో ముసలివాళ్లం, మరింత తెలివైన వాళ్లం అయ్యామని అనుకోవడం లేదు" అని కూడా కమల్ అన్నాడు.
హీరోలకు అంత ఇవ్వొద్దు
ఇక ఇదే ఇంటర్వ్యూలో స్టార్ హీరోల భారీ రెమ్యునరేషన్లపైనా అతడు స్పందించాడు. వాళ్లను భరించలేని స్థితిలో ఉంటే కొత్త నటుల కోసం వెతకండి అని కమల్ హాసన్ అనడం విశేషం. "ఈ నటులకు మరీ అంత మొత్తం ఇవ్వొద్దు. వాళ్లు అవసరం లేదనుకుంటే కొత్త నటులను వెతుక్కోండి. మీకు సూపర్ స్టార్ కావాలనుకుంటే ఇవ్వాల్సిందే. వద్దు లేదా వాళ్లను భరించలేం అనుకుంటే ఇక వద్దు. అంతే సింపుల్" అని కమల్ అన్నాడు.
కమల్ హాసన్ ఈ మధ్యే కల్కి 2898 ఏడీ మూవీలో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ తొలి భాగంలో అతని పాత్ర నిడివి చాలా తక్కువే అయినా.. సెకండ్ పార్ట్ లో మాత్రం తన పాత్రే ఎక్కువని ఈ మధ్యే అతడు చెప్పాడు. ప్రస్తుతం అతడు తన మరో పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2 రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ మూవీ జులై 12న రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషన్లు కొనసాగుతున్నాయి.