Kamal Haasan Indian 2: హాస్పిట‌ల్ నుంచి క‌మ‌ల్ హాస‌న్ డిశ్చార్జ్ - ఇండియ‌న్ 2 షూటింగ్ షురూ-kamal haasan resume shooting for indian 2 in chennai
Telugu News  /  Entertainment  /  Kamal Haasan Resume Shooting For Indian 2 In Chennai
క‌మ‌ల్‌హాస‌న్‌, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌
క‌మ‌ల్‌హాస‌న్‌, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌

Kamal Haasan Indian 2: హాస్పిట‌ల్ నుంచి క‌మ‌ల్ హాస‌న్ డిశ్చార్జ్ - ఇండియ‌న్ 2 షూటింగ్ షురూ

26 November 2022, 11:51 ISTNelki Naresh Kumar
26 November 2022, 11:51 IST

Kamal Haasan Indian 2: అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇటీవ‌లే హాస్పిట‌ల్‌లో చేరిన‌ క‌మ‌ల్‌హాస‌న్ శుక్ర‌వారం డిశ్చార్జ్ అయ్యారు. శ‌నివారం నుంచి ఇండియ‌న్ 2 సినిమా షూటింగ్ మొద‌లుపెట్టారు.

Kamal Haasan Indian 2: జ్వ‌రం, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ఇటీవ‌లే హాస్పిట‌ల్‌లో చేరారు లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్‌. హ‌ఠాత్తుగా ఆయ‌న అనారోగ్యం బారిన ప‌డ‌టంతో అభిమానుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. మూడు రోజుల పాటు హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకున్న క‌మ‌ల్‌హాస‌న్ శుక్ర‌వారం డిశ్చార్జ్ అయ్యారు. వైద్యులు ఆయ‌న‌కు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని సూచించిన‌ట్లు తెలిసింది. కొద్ది రోజుల పాటు క‌మ‌ల్‌హాస‌న్ షూటింగ్‌ల‌కు దూరంగా ఉండ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

ఆ పుకార్ల‌ను కొట్టిప‌డేస్తూ శుక్ర‌వారం సాయంత్రం జ‌రిగిన విజ‌య్ సేతుప‌తి డీఎస్‌పీ ఆడియో లాంఛ్‌కు క‌మ‌ల్‌హాస‌న్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. అంతే కాదు శ‌నివారం నుంచి ఇండియ‌న్ -2 షూటింగ్ మొద‌లుపెట్టాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జ‌రుగుతోన్న‌ట్లు తెలిసింది. క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు బాలీవుడ్ న‌టుడు గుల్ష‌న్ గ్రోవ‌ర్‌పై కీల‌క స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు శంక‌ర్ చిత్రీక‌రిస్తోన్న‌ట్లు స‌మాచారం.

సెట్స్‌లో గుల్ష‌న్ గ్రోవ‌ర్‌తో క‌మ‌ల్ హాస‌న్ ముచ్చ‌టిస్తోన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అనారోగ్యం నుంచి కోలుకున్న త‌ర్వాత రోజు షూటింగ్ మొద‌లుపెట్టిన క‌మ‌ల్ హాస‌న్ అంకిత‌భావానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇండియ‌న్ 2 సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ర‌కుల్‌ప్రీత్‌సింగ్, సిద్దార్థ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ క‌ల‌యిక‌లో 1996లో విడుద‌లైన ఇండియ‌న్ సినిమాకు సీక్వెల్‌గా ఇండియ‌న్ -2 తెర‌కెక్కుతోంది. 2019లో ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. కానీ షూటింగ్ సెట్స్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో ముగ్గురు యూనిట్ సిబ్బంది మ‌ర‌ణించ‌డం, నిర్మాణ సంస్థ‌తో శంక‌ర్‌కు ఏర్ప‌డిన విభేదాల కార‌ణంగా ఏడాది పాటు షూటింగ్ నిలిచిపోయింది. స‌మ‌స్య‌లు తొల‌గిపోవ‌డంతో ఇటీవ‌లే ఇండియ‌న్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభ‌మైంది.