ఇలాంటివి ఎన్నో చూశాను.. తప్పు చేస్తేనే క్షమాపణ అడుగుతాను: కన్నడ వివాదంపై కమల్ హాసన్-kamal haasan kannada language controversy thug life actor refused to apologize ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఇలాంటివి ఎన్నో చూశాను.. తప్పు చేస్తేనే క్షమాపణ అడుగుతాను: కన్నడ వివాదంపై కమల్ హాసన్

ఇలాంటివి ఎన్నో చూశాను.. తప్పు చేస్తేనే క్షమాపణ అడుగుతాను: కన్నడ వివాదంపై కమల్ హాసన్

Hari Prasad S HT Telugu

కమల్ హాసన్ వెనక్కి తగ్గడం లేదు. కన్నడ భాషా వివాదంపై క్షమాపణ చెప్పడానికి అతడు నిరాకరిస్తున్నాడు. ఇలాంటివి ఎన్నో చూశానని, తాను తప్పు చేస్తేనే క్షమాపణ అడుగుతానని స్పష్టం చేశాడు.

ఇలాంటివి ఎన్నో చూశాను.. తప్పు చేస్తేనే క్షమాపణ అడుగుతాను: కన్నడ వివాదంపై కమల్ హాసన్

తాను నటించిన థగ్ లైఫ్ మూవీని నిషేధిస్తామని బెదిరిస్తున్నా.. కమల్ హాసన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అతడు క్షమాపణ చెప్పడానికి శుక్రవారం (మే 30) వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా కమల్ మాత్రం అందుకు నిరాకరిస్తూనే ఉన్నాడు.

తప్పు చేయలేదు

కన్నడ భాష పుట్టిందే తమిళం నుంచి అని కామెంట్స్ చేసిన కమల్ హాసన్ పై కన్నడ సంఘాలు మండిపడుతూనే ఉన్నాయి. అతని సినిమాలను నిషేధించాలని సాక్షాత్తూ ఆ రాష్ట్ర మంత్రి శివరాజ్ తంగదగియే కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు లేఖ రాయడం గమనార్హం. ఈ నేపథ్యంలో థగ్ లైఫ్ సినిమాను తాము నిషేధిస్తామని ఛాంబర్ వార్నింగ్ ఇచ్చింది.

దీనిపై తాజాగా కమల్ హాసన్ మరోసారి స్పందించాడు. “ఇది ప్రజాస్వామ్యం. నేను చట్టం, న్యాయాన్ని విశ్వసిస్తాను. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళపై నా ప్రేమ నిజం. ఏదో ఎజెండా ఉన్న వాళ్లే దానిని శంకిస్తారు. ఇలాంటి బెదిరింపులు గతంలో ఎన్నో చూశాను. నేను తప్పు చేస్తే క్షమాపణ చెబుతాను. చేయకపోతే చెప్పను” అని కమల్ స్పష్టం చేశాడు.

దీనిపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, కన్నడ సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. జూన్ 5వ తేదీనే థగ్ లైఫ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో వాళ్లు చెప్పినట్లుగా ఆ సినిమాను నిషేధిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నిషేధిస్తే మాత్రం కమల్ పాన్ ఇండియా మూవీకి పెద్ద దెబ్బ పడినట్లే అని చెప్పొచ్చు.

థగ్ లైఫ్ మూవీ గురించి..

మణిరత్నం డైరెక్షన్ లో 37 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ నటించిన మూవీ ఈ థగ్ లైఫ్. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే కన్నడ భాష గురించి కమల్ స్పందించాడు.

అసలు తమిళం నుంచే కన్నడ పుట్టిందని అతడు అనడంతో కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అప్పటి నుంచే కమల్ సినిమాలను నిషేధించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. రోజురోజుకూ వివాదం ముదురుతున్నా.. కమల్ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఇది ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.