Kamal Haasan: నన్ను అలా పిలవొద్దు: అభిమానులకు లేఖ రాసిన తమిళ స్టార్ హీరో కమల్ హాసన్
Kamal Haasan: కమల్ హాసన్ తన అభిమానులకు ఇప్పుడో స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. సోమవారం (నవంబర్ 11) అభిమానులకు రాసిన లేఖను అతడు తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. తనను లోక నాయకుడు అని పలవొద్దని అతడు కోరడం విశేషం.
Kamal Haasan: తమిళ స్టార్ హీరో, లోక నాయకుడిగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే కమల్ హాసన్ కు ఈ మధ్యే 70 ఏళ్లు నిండాయి. ఇప్పటికీ భిన్నమైన పాత్రలు పోషిస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్న ఈ విలక్షణ నటుడు.. సోమవారం (నవంబర్ 11) అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాయడం విశేషం. అందులో తనకు ఎలాంటి బిరుదులు తగిలించొద్దని కోరడం విశేషం.
కమల్ హాసన్ ట్వీట్ వైరల్
కమల్ హాసన్ సోమవారం చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా తన అభిమానులకు అతడు కృతజ్ఞతలు చెప్పాడు. "వనక్కం.. నన్ను చాలా కాలంగా ఉలగనాయగన్ తోపాటు వివిధ పేర్లతో పిలుస్తుండటాన్ని నేను ఎంతో గొప్పగా భావిస్తున్నాను.
దీనికి మీకు రుణపడి ఉంటాను. ఇలాంటి బిరుదులను ఫ్యాన్స్, సహచరులు ఇవ్వడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. మీరు నాపై చూపిన ప్రేమ నన్నెప్పుడూ కదిలించి వేస్తుంది" అని కమల్ అన్నాడు.
నేనెప్పుడూ విద్యార్థినే
ఈ సందర్భంగా తనను తాను ఓ నిత్య విద్యార్థిగా కమల్ చెప్పుకున్నాడు. "సినిమా అనేది ఓ వ్యక్తి కంటే ఎంతో గొప్పది. ఈ కళలో నేనో విద్యార్థినే. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ, కాలానికి అనుగుణంగా మారుతూ ముందడుగు వేయాలని అనుకుంటాను.
అన్ని సృజనాత్మక రంగాల్లాగే సినిమా కూడా అందరికీ చెందుతుంది. ఎంతో మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకుల సహకారంతో నడిచే కళ" అని కమల్ చెప్పాడు.
నాకీ బిరుదులు వద్దు
"ఓ నటుడిని కళ కంటే ఎక్కువగా చూడకూడదన్నది నా వినయపూర్వక విన్నపం. నేను ఎప్పుడూ వినయంగానే ఉండాలని అనుకుంటాను. నన్ను నేను ఎప్పుడూ మెరుగుపరచుకోవాలనే భావిస్తాను. అందువల్ల నేను అలాంటి అన్ని బిరుదులను ఎంతో మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నాను" అని కమల్ స్పష్టం చేశాడు.
అభిమానులకు కమల్ విన్నపం
"అందుకే ఇప్పటి నుంచి నన్ను కేవలం కమల్ హాసన్ లేదా కమల్ లేదా కేహెచ్ అని మాత్రమే పిలవాలని నా అభిమానులు, మీడియా, సినిమా ఇండస్ట్రీ సభ్యులు, పార్టీ క్యాడర్, సాటి భారతీయులను కోరుతున్నాను. ఎన్నో ఏళ్లుగా మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు మరోసారి థ్యాంక్స్. ఈ నిర్ణయం ఎంతో వినయపూర్వకంగా తీసుకున్నదని, అందరిలో నన్నూ ఒకడిగా భావించాలన్న ఉద్దేశంతో తీసుకున్నదే" అని కమల్ అన్నాడు.
ఈ మధ్యే కల్కి 2898 ఏడీ మూవీ ఓ చిన్న పాత్రలో కనిపించిన కమల్ హాసన్.. ఇప్పుడు మణిరత్నం డైరెక్షన్ లో థగ్ లైఫ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 5న రిలీజ్ చేయనున్నట్లు ఈ మధ్యే మేకర్స్ వెల్లడించారు.