కార్తీక దీపం 2 సీరియల్ స్టార్ మా ఛానెల్‍లో రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం.. జ్యోత్స్న నిశ్చితార్థాన్ని అడ్డుకున్న దీప నిందలు ఎదుర్కొంటూ ఉంది. జ్యోత్స్న జీవితాన్ని కాపాడదామని అనుకున్న దీపకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గౌతమ్ చేసిన తప్పులను సాక్ష్యాలతో పాటు నిరూపించేందుకు దీప తంటాలు పడుతోంది. మరోవైపు జ్యోత్స్న కుట్రలు చేస్తూనే ఉంది. శివన్నారాయణ, సుమిత్ర దీపపై కోపం పెంచేసుకున్నారు. ఈ క్రమంలో కార్తీక దీపం 2 సీరియల్ నేటి (ఏప్రిల్ 2, 2025) ఎపిసోడ్‍లో కొత్త క్యారెక్టర్ వచ్చింది. ఈ పాత్ర రాగానే దీపకు షాక్ ఎదురైంది.
కార్తీక దీపం 2 సీరియల్‍లో సత్తిపండు అనే కొత్త పాత్ర వచ్చింది. ఇంటి రామాయణం సీరియల్‍తో పాపులర్ అయిన నటుడు కల్యాణ్ చక్రవర్తి.. కార్తీక దీపంలో సత్తిపండు ఈ పాత్ర పోషిస్తున్నారు. గౌతమ్ చేతిలో మోసపోయిన రమ్య ఉండే ఏరియాలో రౌడీగా సత్తిపండు ఉంటాడు. ఈ సీరియల్‍లో నెగెటివ్ పాత్రగా ఉండనుంది.
గౌతమ్ చేసిన మోసం గురించి చెప్పాలని రమ్యను శివన్నారాయణ ఇంటికి తీసుకొస్తుంది దీప. ‘నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి’ అంటూ తడబడుతూ ఉంటుంది రమ్య. గౌతమ్ పేరు చెప్పేందుకు భయపడుతూ ఉంటుంది. దీప ధైర్యం చెప్పడంతో నిజం చెప్పేందుకు రెడీ అవుతుంది. ఇంతలో నేటి ఎపిసోడ్‍లో సత్తిపండు ఎంట్రీ ఇచ్చాడు. రమ్య తన భార్య అని అబద్ధం ఆడతాడు. ఆమె కడుపులోని బిడ్డకు తానే తండ్రిని అంటాడు. గౌతమ్ మోసం చేశాడని నిజం చెప్పకుండా రమ్య చేతిని నలిపేస్తూ.. బెదిరించేలా చూస్తాడు.
సత్తిపండు రావటంతో భయపడిన రమ్య.. తనను మోసం చేసింది గౌతమ్ అని చెప్పదు. దీప డబ్బులు ఇచ్చి రమ్యతో అబద్ధం చెప్పించాలని చూస్తోందని సత్తిపండు రివర్స్ అటాక్ చేస్తాడు. తన తల్లిదండ్రులు ఏమైనా చేస్తాడేమోనని సత్తిపండుతో రమ్య మౌనంగా వెళ్లిపోతుంది. దీంతో రమ్యను తీసుకొచ్చినా గౌతమ్ మోసాన్ని దీప బయటపెట్టలేదు. సత్తిపండు రాకతో దీప ప్రయత్నానికి ట్విస్ట్ ఎదురవుతుంది.
గౌతమ్ గురించి రమ్య నిజం చెప్పకుండా చేయాలని సత్తిపండును జ్యోత్స్ననే పురమాయించి ఉంటుంది. రమ్యను తీసుకొని వెళ్లిపోయాక సత్తిపండుకు డబ్బు కూడా పంపిస్తుంది జ్యోత్స్న. రమ్య మళ్లీ నోరు తెరవకుండా చూడాలని చెబుతుంది. మరి, కార్తీక దీపంలో సత్తిపండు క్యారెక్టర్ ఎక్కువ రోజులు ఉంటుందా.. కొనాళ్లే కనిపిస్తుందా అనేది చూడాలి.
గౌతమ్ మోసాన్ని బయటపెట్టాలని ప్రయత్నించిన దీపకు మళ్లీ అవమానం ఎదురవుతుంది. శివన్నారాయణ, సుమిత్ర దీపను నానా మాటలు అంటారు. గౌతమ్ మోసగాడని, మంచి చేసేందుకు జ్యోత్స్న ఎంగేజ్‍మెంట్ ఆపానని దీప ఎలా నిరూపిస్తుందో చూడాలి.
సంబంధిత కథనం