Pawan Kalyan: పవన్ కల్యాణ్‍తో భేటీ కానున్న టాలీవుడ్ నిర్మాతలు.. ఏ విషయాలపై చర్చించనున్నారంటే!
Pawan Kalyan - Tollywood Producers: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‍ను టాలీవుడ్ పెద్దలు కలవనున్నారు. సీనియర్ నిర్మాత అశ్వినీదత్‍తో పాటు మరికొందరు పవన్‍తో భేటీ కానున్నారు.
Pawan Kalyan - Tollywood Producers: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి ఆయనతో భేటీ కానున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు. రేపు (జూన్ 24) ఈ సమావేశం జరగనుంది.
ఎవరెవరు?
విజయవాడలోని పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయంలో ఆయనను టాలీవుడ్ పెద్దలు రేపు కలవనున్నారు. సీనియర్ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్, నిర్మాతలు చినబాబు (హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్), విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ) నవీన్ యెర్నేనీ (మైత్రీ మూవీ మేకర్స్), నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‍మెంట్స్), డీవీవీ దానయ్య (డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్) ఈ భేటీలో పాల్గొననున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ ఓనర్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్‍రాజు కూడా హాజరుకానున్నారు. మరికొందరు కూడా పాల్గొననున్నారు.
ఈ విషయాలపై చర్చ!
ఆంధ్రప్రదేశ్‍లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల ముందుగా పవన్ కల్యాణ్‍కు టాలీవుడ్ పెద్దలు అభినందనలు తెలియజేయనున్నారు. టికెట్ ధరల పెంపు, థియేటర్ల సమస్యపై ప్రధానంగా చర్చ సాగే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో టాలీవుడ్ ఎదుర్కొన్న సమస్యలపై కూడా ప్రస్తావన వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‍లో షూటింగ్‍ల విషయంపై కూడా సమాలోచనలు సాగే ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ కూడా జనసేన మంత్రి కందుల దుర్గేశ్ వద్దే ఉంది.
ఎన్నికల ముందు కూడా కూటమికి టాలీవుడ్ నుంచి మద్దతు లభించింది. దిగ్గజ నిర్మాత అశ్వినీదత్ బహిరంగంగానే తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. కూటమి గెలుస్తుందని బలంగా చెప్పారు. టాలీవుడ్ నుంచి కొందరు పవన్ కల్యాణ్ కోసం ప్రచారం కూడా చేశారు. కూటమి ప్రభుత్వ ఏర్పడడం, జనసేన ప్రభంజనం, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావటం పట్ల టాలీవుడ్‍లో అధిక శాతం మంది చాలా సంతోషంగా ఉన్నారని ఇన్‍సైడ్ టాక్.
పవన్ చేతిలో మూడు సినిమాలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఏపీ ఎన్నికల మూడు నెలల ముందే ఆయన రాజకీయాల్లో బిజీ అయ్యారు. పవన్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓజీ షూటింగ్ దశలో ఉంది. ఇంకా చాలా పెండింగ్‍లో ఉంది. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఓజీ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినా.. వాయిదా వేయకతప్పలేదు.
పపన్ కల్యాణ్ హీరోగా పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు కూడా రావాల్సి ఉంది. ఇప్పటికే చాలా కాలం ఆలస్యమైన ఈ చిత్రాన్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇటీవలే టీజర్ కూడా వచ్చింది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత ఏఎం రత్నం కూడా చెప్పారు. ఈ మూవీకి ముందు క్రిష్ దర్శకుడిగా ఉండగా.. ఆయన తప్పుకున్నారు. ఏం జ్యోతికృష్ణ ఆ బాధ్యతలను తీసుకున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇంకా పెండింగ్‍లో ఉంది. హరిశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా పవన్ కల్యాణ్ చేయాల్సి ఉంది.
డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్, అటవీ లాంటి కీలకమైన శాఖలు చేపట్టడంతో పవన్ కల్యాణ్ మళ్లీ షూటింగ్‍లకు వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ చిత్రాల తర్వాత ఆయన సినిమాలు చేస్తారా లేదా అనే ఉత్కంఠ కూడా ఉంది.