Kalki 2898 AD Trailer Time: కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ రిలీజ్‍కు టైమ్ ఫిక్స్
Kalki 2898 AD Trailer Time: కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ మరికొన్ని గంటల్లో రానుంది. ట్రైలర్ రిలీజ్ టైమ్‍ను మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ ట్రైలర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Kalki 2898 AD Trailer Time: సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ నేడే (జూన్ 10) వచ్చేస్తోంది. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. నాగ్అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి. జూన్ 27వ తేదీన కల్కి మూవీ గ్రాండ్‍గా విడుదల కానుంది. ఈ తరుణంలో ట్రైలర్‌ను నేడు తీసుకొస్తోంది మూవీ టీమ్. ఏ సమయానికి ట్రైలర్ రిలీజ్ చేయనున్నది తాజాగా వెల్లడించింది.
ట్రైలర్ రిలీజ్ టైమ్ ఇదే
కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ నేడు (జూన్ 10) సాయంత్రం 7 గంటలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు అధికారికంగా వెల్లడించింది. డేట్‍ను ఇటీవల ప్రకటించగా.. ఇప్పుడు కొన్ని గంటల ముందే టైమ్‍ను ఫిక్స్ చేసింది. “అతడు విజేతగానే ఉంటాడు. కల్కి 2898 ఏడీ ట్రైలర్ నేటి సాయంత్రం 7 గంటలకు వచ్చేస్తోంది” అని వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది.
తనవైపుగా వస్తున్న గుంపును ప్రభాస్ ఒంటి చేత్తో ఆపేస్తున్నట్టు ఓ పోస్టర్ తీసుకొచ్చింది వైజయంతీ మూవీస్. ఈ పోస్టర్‌తోనే ట్రైలర్ రిలీజ్ టైమ్‍ను ప్రకటించింది. ఆదివారమే దీపికా పదుకొణ్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.
నేటి సాయంత్రం 7 గంటలకే కల్కి 2898 ఏడీ ట్రైలర్ వస్తుండటంతో సినీ అభిమానుల్లో ఎగ్జైట్‍మెంట్ పెరిగిపోతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతీ పోస్టర్, గ్లింప్స్ మెప్పించాయి. సినిమాపై అంచనాలను పెంచుతూ వచ్చాయి. ఇటీవలే వచ్చిన బుజ్జిభైరవ గ్లింప్స్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ కోసం తయారు చేసిన ఫ్యుచరిస్టిక్ కారు ‘బుజ్జి’ కూడా హైలైట్‍గా నిలిచింది. దీంతో కల్కి 2898 ఏడీ ట్రైలర్ ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో నేడు ట్రైలర్ స్క్రీనింగ్ కూడా చేయనుంది మూవీ టీమ్.
ట్రైలర్ రన్ టైమ్ ఇదే!
కల్కి 2898 ఏడీ ట్రైలర్ 2 నిమిషాల 30 సెకన్ల రన్‍టైమ్‍తో ఉంటుందని తెలుస్తోంది. ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంటుందని, కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి ఫుల్ క్రేజ్ ఉండగా.. ట్రైలర్ తర్వాత విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది.
కల్కి 2898 ఏడీ చిత్రంలో భైరవగా ప్రభాస్ నటించగా.. అశ్వత్థామ పాత్రను బాలీవుడ్ దిగ్గజం అమిత్ బచ్చన్ పోషించారు. తమిళ లెజెండ్ కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. భారత పురాణాల స్పూర్తితో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా కల్కిని తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. భారీ వీఎఫ్‍ఎక్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మరో లోకంలోకి వెళ్లినట్టు ఫీలవుతారని తాను అనుకుంటున్నట్టు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
కల్కి 2899 ఏడీ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. భారత ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీరైన మూవీగా భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.