Kalki 2898 AD Ticket Sales Record: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ వెళ్తున్న ఈ మూవీ.. తాజాగా టికెట్ల అమ్మకంలోనూ సరికొత్త చరిత్ర సృష్టించింది. షారుక్ ఖాన్ నటించిన జవాన్ రికార్డు బ్రేక్ చేస్తూ.. ఇప్పటి వరకూ బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా నిలవడం విశేషం.
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. మూడు వారాలు అవుతున్నా ఇప్పటికీ వసూళ్ల జోరు తగ్గలేదు. రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న ఏడో ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు BookMyShowలో అత్యధిక టికెట్లు అమ్ముడైన ఇండియన్ సినిమాగా నిలిచింది.
ఇంత వరకూ ఈ రికార్డు షారుక్ ఖాన్ నటించిన జవాన్ పేరిట ఉండేది. ఆ సినిమా కోసం ఈ టికెట్ బుకింగ్ సైట్, యాప్‌లో 12.01 మిలియన్ల టికెట్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు కల్కి 2898 ఏడీ మూవీకి మాత్రం తొలి 20 రోజుల్లోనే 12.15 మిలియన్ (కోటి 21 లక్షలు) టికెట్లు అమ్ముడయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ ఈ సినిమాకు పెద్దగా పోటీ లేకపోవడంతో టికెట్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అంతేకాదు ఒక గంటలో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన రికార్డును కూడా కల్కి 2898 ఏడీ సొంతం చేసుకుంది. గతంలో జవాన్ మూవీకి ఒక గంటలో 86 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. తాజాగా ఈ ప్రభాస్ మూవీ 95.71 వేల టికెట్లతో ఆ రికార్డును మెరుగు పరిచింది.
ఇక కల్కి 21 రోజుల్లో ఇండియాలోనే రూ.596.1 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ లో రూ.262 కోట్లు వచ్చాయి. ఒక్క హిందీలోనే డొమెస్టిక్ బాక్సాఫీస్ దగ్గర రూ.263.9 కోట్లు రాగా.. తెలుగులో రూ.270.5 కోట్లు వసూలు చేసింది. 21వ రోజు కూడా హిందీ మార్కెట్ లో రూ.3.9 కోట్లు, తెలుగులో రూ.2.1 కోట్లు రావడం విశేషం.
ప్రభాస్‌తోపాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ లాంటి వాళ్లు నటించిన కల్కి 2898 ఏడీ మూవీ రూ.1000 కోట్ల కలెక్షన్ల మార్కును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని సినిమాలో నటించిన టాప్ స్టార్లందరూ వీడియోలు రూపొందిస్తూ అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్నారు.
ఇక కల్కి 2898 ఏడీ మూవీ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుండటంతో ఓటీటీ రిలీజ్ చాలా ఆలస్యం కానుందని ఈ మధ్యే మేకర్స్ చెప్పారు. రిలీజ్ తేదీ నుంచి పది వారాల తర్వాతే సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఆ లెక్కన సెప్టెంబర్ లోనే ఈ సినిమా వస్తుంది. హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ లో, మిగతా అన్ని వెర్షన్లూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానున్నాయి.
టాపిక్