Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మేకర్స్‌కు లీగల్ నోటీసులు.. ప్రభాస్, అమితాబ్ బచ్చన్‍కు కూడా..
Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీ మేకర్స్‌కు లీగల్ నోటీసులు పంపారు ఆచార్య ప్రమోద్ కృష్ణనమ్. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఈ చిత్రం ఉందని ఆయన అన్నారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా భారీ బ్లాక్‍బస్టర్ దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఈ ఎపిక్ మైథో సైన్స్ ఫిక్షన్ మూవీ రూ.1,000 కోట్ల మార్క్ దాటేసింది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం ఇంకా వసూళ్లలో జోరు చూపిస్తోంది. భారత పురాణాల స్ఫూర్తితో ఈ మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. అయితే, తాజాగా ఈ మూవీ టీమ్‍కు లీగల్ నోటీసులు వెళ్లాయి. ఆ వివరాలు ఇవే..
‘మనోభావాలను దెబ్బతీసేలా..’
కల్కి 2898 ఏడీ సినిమా దర్శక, నిర్మాతలతో పాటు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్‍కు లీగల్ నోటీసులు పంపారు కాంగ్రెస్ మాజీ నేత, కల్కిధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణమ్. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ చిత్రం ఉందంటూ ఆరోపించారు.
కల్కి పుట్టుక ఎలా ఉండనుందో పురాణాల్లో ఉన్న విధంగా కల్కి 2898 ఏడీ చిత్రంలో చూపించలేదని, తప్పుగా చిత్రీకరించారని ప్రమోద్ కృష్ణమ్ అభ్యంతరం చెప్పారు. కృతిమ గర్భంలో కల్కి జన్మిస్తారని ఈ మూవీలో చూపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్కి చిత్రం హిందూ పురాణాలకు విరుద్ధంగా ఉందని నోటీసులో పేర్కొన్నారు ఆచార్య ప్రమోద్ కృష్ణమ్. “విశ్వాసం, భావోద్వేగాలు, ఆధ్యాత్మికతో కూడినది భారతదేశం. సనాతన ధర్మం విలువలను మార్చకూడదు. సనాతన గ్రంథాలను మార్చకూడదు. కల్కి భగవానుడు మనకు కేంద్రంగా ఉన్నారు. విష్ణుమూర్తి చివరి అవతారంగా భావిస్తాం. పురాణాల్లో కల్కి అవతారం గురించి చాలా రాసి ఉంది. దాని ఆధారంగానే ప్రధాని మోదీ కల్కి ఆలయానికి శంకుస్థాపన చేశారు” అని కృష్ణమ్ తెలిపారు.
పురాణాలకు విరుద్ధంగా ఉంది
కల్కి 2898 ఏడీ సినిమా హిందు పురాణాలకు విరుద్ధంగా ఉందని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ చెప్పారు. “మన పురాణాల్లో ఉన్న విషయాలకు విరుద్ధంగా ఈ చిత్రం ఉంది. ఈ చిత్రం మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉంది. అందుకే మేం ఆభ్యంతరాలు వ్యక్తం చేశాం. స్పందన కోసం వేచిచూస్తున్నాం” అని ఆయన అన్నారు.
హిందూ మతం, పురాణాలతో ఇష్టమొచ్చినట్టు ఆడుకోవడం ఇటీవల కొందరు సినిమా మేకర్లకు అలవాటుగా మారిందని కృష్ణమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అలా కానివ్వబోమని అన్నారు. వాక్ స్వాతంత్య్రం అంటే తమ విశ్వాసాలతో ఆడుకోవాలని అర్థం కాదని ప్రమోద్ కృష్ణమ్ చెప్పారు.
కల్కి భగవానుడి కాన్సెప్ట్‌నే ఈ చిత్రం మార్చేసిందని, ఇది పురాణాలను అగౌరవపచడమేనని నోటీసుల్లో కృష్ణమ్ పేర్కొన్నారు. ఇలాంటి వాటి వల్ల పురాణాలపై ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుందని తెలిపారు. కల్కి మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణ్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్‍తో నిర్మించారు అశ్వినీదత్. కల్కి చిత్రానికి సీక్వెల్ కూడా రానుంది. ఈ మూవీ భారీ సక్సెస్ కావడంతో సీక్వెల్‍పై అంచనాలు మరింత భారీగా పెరిగాయి.
టాపిక్