Kalki 2898 Ad Review: కల్కి 2898 ఏడీ రివ్యూ - సూపర్ హీరోగా ప్రభాస్ మెప్పించాడా? కమల్ విలనిజం ఎలా ఉందంటే?
Kalki 2898 Ad Review: కల్కి మేనియాతో ప్రజెంట్ ఇండియా మొత్తం షేక్ అవుతోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రలు పోషించారు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Kalki 2898 Ad Review: ఈ ఏడాది తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో కల్కి 2898 ఏడీ (Kalki 2898 Ad) ఒకటి. అసలు సిసలైన పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటించాడు. కమల్‌హాసన్ (Kamal Haasan), అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకోణ్ (Deepika Padukone) కీలక పాత్రలు పోషించారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ గురువారం (జూన్ 27న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాత అశ్వనీదత్ దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్‌తో కల్కి 2898 ఏడీ మూవీని తెరకెక్కించాడు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉంది? ప్రభాస్ సినిమాతో హిట్ కొట్టాడా? లేదా? అంటే…
కురుక్షేత్రం జరిగిన ఆరు వేళ్ల ఏళ్ల తర్వాత...
కురుక్షేత్రం యుద్ధం జరిగిన ఆరు వేల ఏళ్ల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. అధర్మం పెరిగిపోయి మానవులు ప్రకృతిని మొత్తం నాశనం చేస్తుండటంతో సుప్రీమ్ యాశ్కిన్ (కమల్‌హాసన్) కాంప్లెక్స్ పేరుతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ప్రకృతి వనరులను కాంప్లెక్స్‌కు మాత్రమే పరిమితం చేశాడు. కాశీ నగరంపైన ఉన్న కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి భూమిపై మిగిలిన మానవులందరూ ప్రయత్నాలు చేస్తుంటారు. వారిలో భైరవ (ప్రభాస్) ఒకరు. కాంప్లెక్స్‌లోకి వెళ్లలన్నది అతడి కల.
సుప్రీమ్ యాశ్కిన్ అన్యాయాలపై రెబెల్స్ తిరుగుబాటు చేస్తుంటారు. శంబాలా పేరుతో సీక్రెట్ వరల్డ్‌ను ఏర్పాటుచేసుకొని సుప్రీమ్ యాశ్కిన్ గ్యాంగ్‌కు దొరక్కుండా పోరాడుతుంటారు. దేవుడు మళ్లీ కల్కి అవతారంలో మహిళ గర్భం ద్వారా భూమిపై అవతరించబోతున్నాడని శంబాలా ప్రజలు నమ్ముతుంటారు. ఆ దేవుడికి జన్మనిచ్చే మహిళ కోసం ఎదురుచూస్తుంటారు. కాంప్లెక్స్ వరల్డ్ నుంచి గర్భంతో ఉన్న సుమతి (దీపికా పదుకోణ్) తప్పించుకుంటుంది. సుమతిని తమకు అప్పగిస్తే కాంప్లెక్స్‌లోకి ప్రవేశం కల్పిస్తామని కమాండర్ మానస్ (శశ్వతా ఛటర్జీ) భైరవతో ఒప్పదం కుదుర్చుకుంటాడు. కానీ భైరవతో పాటు కమాండర్ మానస్ మనుషుల భారి నుంచి సుమతిని అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) కాపాడుతాడు.
సుమతిని శంబాలకు సురక్షితంగా చేర్చుతాడు. అశ్వత్థామ ఎవరు? సుమతిని మానస్‌కు అప్పగించి కాంప్లెక్స్‌లోకి వెళ్లలనుకున్న భైరవ చివరకు అతడి బారి నుంచి ఆమెను ఎందుకు కాపాడాడు? వేల ఏళ్లుగా అశ్వత్థామ బతికి ఉండటానికి కారణం ఏమిటి? శంబాలపై మానస్ చేసిన దాడిని మరియమ్మ (శోభన), వీరతో ఆమె మనుషులు ఎలా ఎదుర్కొన్నారు? భైరవకు మహాభారతంతో ఉన్న సంబంధం ఏంటి? సుప్రీమ్ యాశ్కిన్‌తో పోరాటంలో కైరా, కెప్టెన్, రోక్సీతో పాటు మరికొంతమంది ఏమయ్యారు అన్నదే కల్కి 2898 ఏడీ(Kalki 2898 Ad Review) మూవీ కథ.
మార్వెల్ సినిమాలకు ధీటుగా...
మార్వెల్ సిరీస్ సూపర్ హీరో సినిమాలు వరల్డ్ వైడ్‌గా సినీ అభిమానులను మెప్పించాయి. అలాంటి సూపర్ హీరో మూవీమన పురాణాల నేపథ్యంలో తెరకెక్కితే ఎలా ఉంటుంది అనడానికి పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ కల్కి 2898 ఏడీ మూవీ(Kalki 2898 Ad Review). మహాభారతంలోని కొన్ని పాత్రలు, వారికి ఉన్న అతీత శక్తులకు ఓ ఫిక్షనల్ వరల్డ్‌ను జోడించి దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి మూవీని తెరకెక్కించాడు.
కొత్త వరల్డ్...
ఈ కథను మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తగ్గని విధంగా లార్గెన్‌దేన్ లైఫ్ విజువల్స్, గ్రాఫిక్స్‌తో చెప్పాలని నాగ్ అశ్విన్ ప్రయత్నించారు. ప్రతి సీన్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. కాంప్లెక్స్, శంబాల వరల్డ్‌లోకి తీసుకెళతాయి. సినిమాలో ఉపయోగించే గన్స్, వెహికిల్స్ తో పాటు క్యారెక్టర్ లుక్స్ వరకు ప్రతిదీ డిఫరెంట్‌గా క్రియేట్ చేశాడు నాగ్ అశ్విన్.
పురాణాల స్ఫూర్తితో…
మహాభారతంతో ముడిపెడుతూ ఇంట్రెస్టింగ్ ఐడియాతో నాగ్ అశ్విన్ కల్కి(Kalki 2898 Ad Review) కథను రాసుకున్నారు. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కూడా పురాణాల స్ఫూర్తితోనే సాగుతుంటాయి. మోడ్రనైజేషన్‌తో పాటు పురాణాల్ని రెండింటిని మిక్స్ చేసి అర్థవంతంగా చెప్పడం అంటే కత్తిమీద సాము లాంటిదే. కానీ ఈ ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అశ్వత్థామకు కృష్ణుడు విధించిన శాపం, మహాభారతంలో మరో కీలక పాత్రతో హీరోకు ఉన్న సంబంధాన్ని కన్వీన్సింగ్‌గా రాసుకున్నాడు. కీలక పాత్రల తాలూకు నేపథ్యాలను డీటైలింగ్‌గా రాసుకోవడం బాగుంది.
సింగిల్ పార్ట్‌లో...
ఈ గ్రాఫిక్స్, విజువల్స్ మాయలో కల్కి కథే పలుచబడిన ఫీలింగ్ కలుగుతుంది. తాను చెప్పాలనుకున్న కథను ఒక్క పార్ట్‌లో కంప్లీట్ చేయడం సాధ్యం కాదని ముందే నాగ్ అశ్విన్ ఫిక్సయ్యాడు. అందుకే కల్కి 2898 ఏడీ పార్ట్ 1(Kalki 2898 Ad Review) సినిమాను కేవలం పాత్రల పరిచయానికే ఉపయోగించుకున్నాడు.
కంప్లెక్స్, శంబాలా వరల్డ్‌ల పరిచయం, భైరవ, అశ్వత్థామతో పాటు మిగిలిన క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వారి నేపథ్యమేమిటి అన్నదే ఈ సినిమాలో చూపించాడు. కంప్లీట్ ఫ్లాట్ స్క్రీన్‌ప్లేతో సినిమాను నడిపించాడు. ప్రభాస్ పాత్రకు సంబంధించి క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంది.
ప్రతి ఐదు నిమిషాలకు ఓ క్యారెక్టర్…
పాత్రలు ఎక్కువ కావడంతో ఎవరికి పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదు. ప్రభాస్ పాత్ర సినిమా మొదలైన ఇరవైనిమిషాల తర్వాతే ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత యాక్షన్ ఎపిసోడ్స్‌లో మాత్రమే కనిపిస్తుంది. మూడు గంటల సినిమాలో గంట మాత్రమే ప్రభాస్ కనిపిస్తాడు. ప్రతి ఐదు నిమిషాలకు ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తూనే ఉంటుంది. అందులో కొన్నిమినహా చాలా వరకు కథకు సంబంధం లేని క్యారెక్టర్స్ కావడం గమనార్హం. రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఇలా చాలా క్యారెక్టర్స్ సినిమాపై బజ్ రావడానికి క్రియేట్ చేసినవే.
ప్రభాస్ కామెడీ టైమింగ్...
భైరవగా తన కామెడీ టైమింగ్‌తో ప్రభాస్ మెప్పించాడు. సూపర్ హీరోగా అతడి క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రభాస్‌పై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయి. ప్రభాస్ క్యారెక్టర్‌కు ధీటుగా అశ్వత్థామ పాత్రను రాసుకున్నాడు దర్శకుడు. అమితాబ్‌బచ్చన్ డైలాగ్ డెలివరీ, అతడి స్క్రీన్‌ప్రజెన్స్ వావ్ అనిపిస్తాయి.
యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టాడు. ఎమోషనల్ రోల్‌లో దీపికా పదుకోణ్ కనిపించింది. తన బిడ్డ కోసం ఆరాటపడే తల్లిగా నాచురల్ యాక్టింగ్‌ను కనబరిచింది. కమల్‌హాసన్ సినిమాలో కేవలం పది నిమిషాల లోపే కనిపిస్తారు. సెకండ్ పార్ట్‌లోనే ఆయన క్యారెక్టర్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుందని డైరెక్టర్ హింట్ ఇచ్చాడు.
విజిల్స్ ఖాయం
విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి కనిపించే సీన్స్ థియేటర్లలో ఆడియెన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. మృణాల్ ఠాకూర్ ఆరంభంలోనే కనిపిస్తుంది. బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శశ్వతా ఛటర్జీ, శోభన చాలా మంది సీనియర్లు తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్, విజువల్స్ కొత్త అనుభూతిని పంచుతాయి. కాంప్లెక్స్, శంబాలా వరల్డ్స్ తాలూకు గ్రాఫిక్స్ బాగున్నాయి.
విజువల్ వండర్...
కల్కి 2898 ఏడీ విజువల్ వండర్ మూవీ. హాలీవుడ్ సినిమాలకు మరిపించే సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను పంచుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది.
రేటింగ్: 3/5