Kalki 2898 AD Box office: కలెక్షన్లలో మరో మైల్‍స్టోన్ దాటిన కల్కి సినిమా.. రూ.1000 కోట్ల మార్క్‌కు అతి చేరువలో..
Kalki 2898 AD 11 days Box office collections: కల్కి 2898 ఏడీ సినిమా కలెక్షన్ల జోష్ కొనసాగుతోంది. రెండో వారం కూడా ఈ చిత్రం దుమ్మురేపుతోంది. ఈ క్రమంలో మరో మైల్‍స్టోన్ దాటింది. రూ.1000 కోట్లకు అత్యంత చేరువలోకి వచ్చింది.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా కలెక్షన్ల సునామీ కంటిన్యూ అవుతోంది. రెండో వారంలోనూ ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రానికి వసూళ్లు జోరుగా వస్తున్నాయి. పురాణాల ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ విజువల్ ఫీస్ట్ చిత్రం రికార్డులను బద్దలుకొడుతూ ముందుకు సాగుతోంది. రెండో వీకెండ్‍లోనూ అంచనాలకు మంచి వసూళ్లను సాధించింది. దీంతో కల్కి 2898 ఏడీ సినిమా మరో మైల్‍స్టోన్ దాటింది.
రూ.900 మైలురాయి క్రాస్
కల్కి 2898 ఏడీ సినిమా 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రానికి ఇప్పటి వరకు సుమారు రూ.950 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. సెకండ్ వీకెండ్ అయిన శని, ఆదివారాల్లో వసూళ్లు భారీగా పుంజుకున్నాయి.
రూ.1,000కోట్లకు దగ్గర్లో..
కల్కి 2898 ఏడీ సినిమా రూ.1,000 కోట్ల మ్యాజిక్ మైల్‍స్టోన్‍కు మార్కుకు అత్యంత చేరువలో ఉంది. సుమారు ఇంకో రూ.50కోట్లను వసూలు చేస్తే ఈ చిత్రం ఆ గ్రాండ్ మైలురాయి దాటుతుంది. మరో రోజులోనే ఇది సాధ్యమయ్యేలా ఉంది. ప్రభాస్‍కు ఇది రెండో వెయ్యి కోట్ల చిత్రం కానుంది.
యానిమల్‍ను బీట్ చేసి..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా గతేడాది డిసెంబర్లో రిలీజై సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం సుమారు రూ.917 గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ మూవీ లైఫ్ కలెక్షన్లను కల్కి 11 రోజుల్లోనే దాటేసింది. మరో వారంలోనే కల్కి 2898 ఏడీ సినిమా పఠాన్, జవాన్, కేజీఎఫ్ 2ను దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది.
బుక్‍మైషోలోనూ..
టికెట్ బుకింగ్ ప్లాట్‍ఫామ్ బుక్‍మైషోలో కూడా కల్కి 2898 ఏడీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమాకు ఇప్పటి వరకు 10 మిలియన్ (కోటి) టికెట్ల బుకింగ్ మార్క్ దాటిందని ఆ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. ఒక్క బుక్‍మైషోలోనే కోటికి పైగా టికెట్ల బుకింగ్‍తో ఈ చిత్రం దుమ్మురేపింది. ఈ ఏడాది ఈ మార్క్ దాటిన తొలి చిత్రంగా నిలిచింది.
సాధారణ ధరలు
కల్కి 2898 ఏడీ సినిమా టికెట్ల ధరలు తెలుగు రాష్ట్రాల్లో సాధారణానికి వచ్చేశాయి. అదనపు ధరను మేకర్స్ తొలగించారు. దీంతో మామూలు రేటుకే అందుబాటులో ఉన్నాయి. దీంతో సెకండ్ వీకెండ్‍లో థియేటర్లలో ఆక్యుపెన్సీ బాగా కనిపించింది. కలెక్షన్ల జోష్ మళ్లీ పుంజుకుంది.
కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణ్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు చేశారు. శోభన, సస్వత ఛటర్జీ, దిశా పటానీ, పశుపతి, అన్నా బెన్ కీలక పాత్రల్లో నటించగా.. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, ఎస్ఎస్ రాజమౌళి, రామ్‍గోపాల్ వర్మ, మాళవిక నాయర్ క్యామియో రోల్స్ చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రశంసలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ పతాకం నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.