Kalki 2898 AD First Week Box Office: వారం రోజుల్లోనే సలార్, బాహుబలి లైఫ్ టైమ్ కలెక్షన్లను మించిన కల్కి 2898 ఏడీ
Kalki 2898 AD First Week Box Office: కల్కి 2898 ఏడీ మూవీ తొలి వారంలోనే సలార్, బాహుబలి సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేయడం విశేషం. ఈ ప్రభాస్ మూవీ వసూళ్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Kalki 2898 AD First Week Box Office: కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ల పరంపర కొనసాగుతూనే ఉంది. జూన్ 27న రిలీజైన ఈ సినిమా తొలి వారంలోనే రూ.700 కోట్లకుపైగా వసూలు చేసింది. ఏడు రోజుల్లోనే ఈ మూవీ ఏకంగా రూ.725 కోట్లు రాబట్టడం విశేషం. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్
ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ తొలి రోజు నుంచే బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.191.5 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. తర్వాత కూడా జోరు తగ్గించలేదు. ఐదో రోజు నుంచి వీక్ డేస్ ప్రారంభమవడంతో కాస్త కలెక్షన్లు తగ్గినా.. రికార్డులు మాత్రం క్రియేట్ అవుతూనే ఉన్నాయి.
ఏడు రోజుల్లో ఈ సినిమా రూ.725 కోట్లు వసూలు చేసింది. సలార్, బాహుబలిలాంటి సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్ల కంటే కూడా ఇవి ఎక్కువ కావడం విశేషం. వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన ఈ సినిమా బడ్జెట్ రూ.600 కోట్లు కాగా.. ఆరు రోజుల్లోనే ఆ మార్క్ దాటేసింది. "డ్రీమ్ రన్ కొనసాగుతోంది. కల్కి 2898 ఏడీ మ్యాజిక్ ను థియేటర్లలో ఇప్పుడే చూడండి" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ తెలిపింది.
ఏడు రోజుల్లో ఈ సినిమా రూ.725 కోట్లు వసూలు చేసినట్లు కూడా మరో ప్రెస్ నోట్ ను వాళ్లు రిలీజ్ చేశారు. ఈ లెక్కన చూసుకుంటే ప్రభాస్ మూవీ రూ.1000 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రభాస్‌పై నాగ్ అశ్విన్
కల్కి 2898 ఏడీ మూవీ వసూళ్ల పర్వం చూసిన తర్వాత ప్రభాస్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎక్స్ అకౌంట్లో అతడు ఒంటరిగా కూర్చున్న ఫొటోను షేర్ చేస్తూ.. "ఏదో అలా మామూలుగా కూర్చున్న వ్యక్తి ఈ యుగంలో అతిపెద్ద బాక్సాఫీస్ స్టార్ అనడంలో సందేహం లేదు. మేం ఏం చేశామో అది చేయగలిగే నమ్మకం కలిగించింది ఇతడే. నేను ఏం చేయాలనుకున్నానో ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. ఎన్నో తెలివైన సలహాలు కూడా ఇచ్చాడు. ప్రతి ఒక్కరి డార్లింగ్, మా భైరవ.. ఇప్పుడు ప్రపంచానికి K____" అని రాసుకొచ్చాడు.
కల్కి 2898 ఏడీ మూవీ తొలి పార్ట్ తోనే కలెక్షన్ల వర్షం కురిపించగా.. రెండో పార్ట్ కూడా రానుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని, వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రొడ్యూసర్ అశ్వినీదత్ చెప్పడం విశేషం. తొలి భాగాన్ని ఎంతో రసవత్తరంగా ముగించిన నాగ్ అశ్విన్.. రెండో భాగంపై ఆసక్తి రేపుతున్నాడు. నిజానికి ఈ రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తనకు మరో మూడేళ్లు పడుతుందని అతడు గతంలో చెప్పాడు. మరి కల్కి 2898 ఏడీ 2పై అతడు ఏం చెబుతాడో చూడాలి.