Kalki 2898 AD Day 1 Collections Prediction: ఆర్ఆర్ఆర్‌ను కల్కి మూవీ దాటేస్తుందా? తొలి రోజు ఎంత కలెక్షన్లు రావొచ్చు?
Kalki 2898 AD Day 1 Box office prediction: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ సమీపించింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తొలి రోజు ఎంత కలెక్షన్లు సాధిస్తుందనే విషయంపై చాలా ఆసక్తి నెలకొని ఉంది.

కల్కి 2898 ఏడీ సినిమా ఇంకొక్క రోజులో రిలీజ్ కానుంది. సినీ ప్రపంచమంతా ఎంతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం రేపు (జూన్ 27) థియేటర్లలో విడుదల కానుంది. ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్స్ ఈ మూవీలో ఉండడం పక్కా అని ట్రైలర్లతోనే అర్థమైంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా అవుతున్నాయి. కల్కి 2898 ఏడీ సినిమా తొలి రోజు ఎంత కలెక్షన్లను రాబడుతుందనేది ఇంట్రెస్టింగ్ విషయంగా ఉంది.
రూ.200 కోట్లు పక్కా?
కల్కి 2898 ఏడీ సినిమాకు భారత్‍తో పాటు ఓవర్సీస్‍లోనూ భారీస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. నార్త్ అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో ఓపెనింగ్ రికార్డులు బద్దలుకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియాలోనూ బుకింగ్ ర్యాంపేజ్ సాగుతోంది. దీంతో కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ డే రూ.200 కోట్ల మార్క్ దాటేస్తుందని లెక్కలు కడుతున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ను దాటగలదా?
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా తొలి ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తొలి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమా రికార్డు ప్రస్తుతం ఈ మూవీ పేరిటే ఉంది. ప్రభాస్ నటించిన బాహుబలి 2 (రూ.214.5 కోట్లు), సలార్ (రూ.165.3 కోట్లు) రెండు, మూడు ప్లేస్‍ల్లో ఉన్నాయి. అయితే, కల్కి 2898 ఏడీ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్లలో ఆర్ఆర్ఆర్‌ను దాటి రికార్డు బద్దలు కొడుతుందా అనే ఆసక్తి నెలకొంది.
మొదటి రోజు కలెక్షన్ల విషయంలో సలార్‌ను కల్కి 2898 ఏడీ దాటడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ చిత్రానికి ఫస్ట్ డే రూ.205 కోట్ల వరకు గ్రాస్ రావొచ్చని అంచనాలు ఉన్నాయి. దీంతో ఫస్ట్ డే కలెక్షన్లలో ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 తర్వాత కల్కి ఉంటుందని లెక్కలు కడుతున్నారు అనలిస్టులు. అయితే, ఒకవేళ కల్కికి మొదటి ఆటే ఫుల్ పాజిటివ్ టాక్ వస్తే.. తర్వాత షోల జోరు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ‘ఆర్ఆర్ఆర్’ను కల్కి 2898 ఏడీ దాటే అవకాశాలు ఉంటాయి. మరి ఆర్ఆర్ఆర్ మూవీని అధిగమించి బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రికార్డును కల్కి దక్కించుకోగలదేమో చూడాలి.
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషించారు. రాజేంద్ర ప్రసాత్, సస్వస్త ఛటర్జీ, శోభన కీలకపాత్రలు చేశారు. కొందరు స్టార్ నటీనటుల క్యామియోలు కూడా ఉంటాయని టాక్. భారత పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని నిర్మించారు అశ్వినీదత్. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.