Kalki 2898 AD Story: ఆ మూడు ప్రపంచాల కథే కల్కి 2898 ఏడీ.. స్టోరీ మొత్తం చెప్పేసిన నాగ్ అశ్విన్
Kalki 2898 AD Story: కల్కి 2898 ఏడీ స్టోరీ మొత్తం చెప్పేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ మూవీ మూడు వేర్వేరు ప్రపంచాల చుట్టూ తిరుగుతుందంటా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను తాజాగా రిలీజ్ చేసిన ఓ వీడియోలో వెల్లడించాడు.
Kalki 2898 AD Story: కల్కి 2898 ఏడీ స్టోరీ ఏంటి? అసలు ట్రైలర్ చూపించిన ఆ వ్యక్తులందరూ ఎవరు? వాళ్ల మధ్య జరిగే యుద్ధానికి కారణం ఏంటి? అసలు ఈ కొత్త కల్కి ప్రపంచంతో నాగ్ అశ్విన్ ప్రేక్షకులకు చెప్పాలనుకున్నది ఏంటి? ఈ ప్రశ్నలకు తాజాగా అతడే సమాధానం ఇచ్చాడు. ఒకరకంగా తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో నాగ్ అశ్విన్ తన మూవీ కథ మొత్తం నాలుగు నిమిషాల్లో చెప్పేశాడు.
కల్కి 2898 ఏడీ కథ ఇదే..
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ మరో వారం రోజుల్లో అంటే జూన్ 27న రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రపంచాన్ని కల్కి ఫీవర్ చుట్టుముట్టేసింది. ఈ సినిమా ప్రమోషన్లు ఓ రేంజ్ లో సాగుతున్నాయి. తాజాగా బుధవారం (జూన్ 19) ముంబైలో ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇక ఫ్యూచర్ ఈజ్ నౌ పేరుతో మేకర్స్ కొన్ని వీడియోలను రిలీజ్ చేస్తున్నారు.
తొలి ఎపిసోడ్లో అసలు ఈ కల్కి 2898 ఏడీ కాన్సెప్ట్ ఏంటో వివరించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్.. రెండో వీడియోలో అసలు స్టోరీ రివీల్ చేశాడు. ఇది మూడు వేర్వేరు ప్రపంచాల మధ్య తిరిగే కథ అని అతడు చెప్పాడు. ప్రపంచంలో తొలి నగరం కాశీనే తాము కలియుగం అంతమయ్యే సమయంలో చివరి నగరంగానూ ఊహించుకొని రాసుకున్న కథే ఈ సినిమా అని తెలిపాడు.
కాశీ, కాంప్లెక్స్, శంబాలా..
కల్కి 2898 ఏడీ మూవీ మొత్తం కాశీ, కాంప్లెక్స్, శంబాలా ప్రపంచాల చుట్టూ తిరగనుంది. ప్రపంచంలో చిట్టచివరి నగరం కాశీ మూడు వేల ఏళ్ల తర్వాత ఎలా ఉండనుంది? అప్పటి మనుషులు, వారి వేషధారణ, వాళ్లు వాడే వాహనాలు, ఆయుధాలు.. ఇలా అన్నింటినీ ఊహించి మూవీ కోసం తయారు చేసినట్లు నాగ్ అశ్విన్ చెప్పాడు. మూడు వేల ఏళ్ల తర్వాత కాశీలో తీవ్ర కరువు కాటకాలు ఉంటాయని, గంగ పూర్తిగా ఎండిపోతుందని, ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ఎదుర్కోబోయే దారుణమైన పరిస్థితులను కాశీ ప్రపంచంలో చూపించనున్నారు.
ఇక ఆ కాశీ పైన ఉండే కాంప్లెన్స్ అనే మరో ప్రపంచంలో అన్నీ ఉంటాయి. డబ్బు, పచ్చదనం, నవ్వులు.. ఇలా కాశీలో లేనివన్నీ అక్కడ కనిపిస్తాయి. వాళ్ల ప్రపంచం, వాళ్లు తినే ఆహారం, ఆయుధాలు ఇలా అవన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఇక సినిమాలో కనిపించే మూడో ప్రపంచం శంబాలా. కల్కి అవతారం ఇక్కడే జన్మిస్తుందని మన పురాణాల్లో చెప్పినట్లుగా ఈ నగరాన్ని క్రియేట్ చేసినట్లు నాగ్ అశ్విన్ చెప్పాడు.
ఈ ప్రపంచం పూర్తిగా భిన్నమైనది. వీళ్లు దేవుడిని బహిష్కరించేస్తారని, అసలు అక్కడ దేవుడనే పదమే ఉండదని కూడా అతడు తెలిపాడు. ఈ మూడు ప్రపంచాల మధ్య ఉండే వైరుధ్యాలు, కల్కి జననం, ఈ ప్రపంచాల్లోని మనుషుల మధ్య జరిగే యుద్ధాలు.. ఇలా కల్కి 2898 ఏడీ స్టోరీ సాగిపోనుంది. కథ ఏంటో డైరెక్టర్ చెప్పేశాడు. దానిని స్క్రీన్ పై ఎలా చూపించాడన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది. నాగ్ అశ్విన్ సృష్టించిన ఆ మూడు ప్రపంచాలు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటాయన్నది మరో వారం రోజుల్లో తేలిపోనుంది.