Kajol Deepfake Video: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్‍ఫేక్ వీడియో వ్యవహారం ఇటీవల సంచలనంగా మారింది. వేరే మహిళ వీడియోకు రష్మిక ముఖాన్ని డీప్‍ఫేక్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో టెక్నాలజీ దుర్వినియోగం పట్ల ఆందోళన రేగింది. చాలా మంది సినీ సెలెబ్రిటీలు, నెటిజన్లు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్‍కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‍గా అవుతోంది. వివరాలివే..
కాజోల్ డ్రెస్ మార్చుకుంటున్నట్టుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె కెమెరా ముందు డ్రెస్ ఛేంజ్ చేసుకున్నట్టుగా అందులో ఉంది. అయితే, అది ఫేక్ వీడియో అని తేలింది. డీప్‍ఫేక్ టెక్నాలజీ ద్వారా ఒరిజినల్ వీడియోలోని మహిళ శరీరానికి కాజోల్ ముఖాన్ని మార్ఫింగ్ చేసినట్టు తేలింది. మొత్తంగా కాజోల్ డ్రెస్ మార్చుకుంటున్నట్టుగా వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని స్పష్టమైంది.
ఇటీవలి కాలంలో కొందరు సినీ సెలెబ్రిటీలు ఈ డీప్‍ఫేక్ టెక్నాలజీకి బాధితులుగా మారుతున్నారు. రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో కలకలం రేపింది. ఓ మహిళ వీడియోకు రష్మిక ఫేస్‍ను మార్ఫ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై చాలా మంది సినీ సెలెబ్రెటీలు స్పందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ దుర్వినియోగం పట్ల భయమేస్తోందని అన్నారు.
ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‍కు చెందిన ఓ డీప్‍ఫేక్ ఫొటో వైరల్ అయింది. టైగర్ 3 సినిమాలో టవల్ ఫైట్‍కు సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు చక్కర్లు కొట్టాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్.. క్రికెటర్ గిల్ భుజంపై చేయి వేసినట్టుగా ఉన్న ఓ డీప్ ఫేక్ ఫొటో వైరల్ అయింది.
డీప్‍ఫేక్ వీడియోలు, ఫొటోలు, ఆడియోలపై చాలా ఆందోళన వ్యక్తమవుతోంది. అభ్యంతరకర, తప్పుదోవ పట్టించే కంటెంట్, తప్పుడు సమాచారం డీప్ ఫేక్ వల్ల వ్యాప్తి చెందుతోంది. అన్ని వర్గాల నుంచి దీనిపై ఆందోళన వస్తోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఫిర్యాదు వచ్చిన 36 గంటల్లోగా తమ ప్లాట్‍ఫామ్‍ల్లోని డీప్‍ఫేక్ కంటెంట్‍ను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది.
సంబంధిత కథనం