Kajol on Pathaan: ‘పఠాన్’ కలెక్షన్‍లపై కాజోల్ వివాదాస్పద కామెంట్-kajol comments on pathaan collections sparks controversy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kajol On Pathaan: ‘పఠాన్’ కలెక్షన్‍లపై కాజోల్ వివాదాస్పద కామెంట్

Kajol on Pathaan: ‘పఠాన్’ కలెక్షన్‍లపై కాజోల్ వివాదాస్పద కామెంట్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 16, 2023 04:22 PM IST

Kajol on Pathaan: షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ కలెక్షన్‍లపై సీనియర్ నటి కాజోల్ చేసిన కామెంట్ వివాదాస్పదమవుతోంది. నెటిజన్లు ఈ విషయంపై రకరకాలుగా స్పందిస్తున్నారు.

కాజోల్
కాజోల్

Kajol on Pathaan: కొన్నేళ్లుగా వరుస ఫ్లాఫ్‍లతో సతమతమైన బాలీవుడ్ బాద్‍షా, స్టార్ హీరో షారూఖ్ ఖాన్‍కు ఈ ఏడాది ‘పఠాన్’ సినిమా మంచి విజయాన్ని ఇచ్చింది. షారూఖ్ ఖాన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‍గా నిలిచింది. పఠాన్ సినిమా మొత్తంగా రూ.1050కోట్ల కలెక్షన్లు సాధించిందని ఆ చిత్ర బృందం వెల్లడించింది. అయితే, ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇవి ఫేక్ లెక్కలని కొందరు వాదించారు. షారూఖ్ ఫ్యాన్స్ మాత్రం కచ్చితంగా కలెక్ట్ చేసిందని ఎదురుదాడి చేశారు. పఠాన్ కలెక్షన్‍లపై సోషల్ మీడియాలో చాలా రోజులు చర్చ సాగింది. కాగా, బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్.. తాజాగా పఠాన్ కలెక్షన్‍లపై ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది. దీంతో ఆ కామెంట్లు వివాదంగా మారుతున్నాయి.

తాను ప్రధాన పాత్ర పోషించిన ‘ది ట్రయల్’ వెబ్‍సిరీస్ ప్రమోషన్‍లలో ప్రస్తుతం బిజీగా ఉంది కాజోల్. ఈ సిరీస్ జూలై 14న డిసీ+ హాట్‍స్టార్ ఓటీటీలోకి వచ్చింది. దీన్ని ప్రమోట్ చేసేందుకు యూనిట్‍తో కలిసి వరుసగా ఇంటర్వ్యూలో ఇస్తోంది కాజోల్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు పఠాన్ కలెక్షన్‍ల అంశాన్ని లాగింది కాజోల్. “షారూఖ్ ఖాన్‍ను ఇప్పటికిప్పుడు ఏ ప్రశ్న అడగాలనుకుంటున్నారు” అనే ప్రశ్న కాజోల్‍కు ఎదురైంది. దీనికి కాజోల్ స్పందించింది. “నిజంగా పఠాన్ సినిమా ఎంత కలెక్షన్లు సాధించింది” అని షారూఖ్‍ను ప్రశ్నిస్తానని కాజోల్ చెప్పింది. ఈ వ్యాఖ్యపై రచ్చ మొదలైంది.

పఠాన్ కలెక్షన్‍లను ఫేక్ అని కాజోల్ పరోక్షంగా అనిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినీ యూనిట్ వెల్లడించిన లెక్కలను ఆమె నమ్మడం లేదంటూ అంటున్నారు. ఈ కామెంట్‍తో కాజోల్‍పై షారూఖ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పఠాన్ కలెక్షన్‍ లెక్కలు ఫేక్ అంటూ మరోసారి ట్రోల్ చేస్తున్నారు. ఫేక్ కలెక్షన్‍లను కాజోల్ బట్టబయలు చేసిందని ఓ యూజర్ కామెంట్ చేశారు. కాజోల్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

షారూఖ్ - కాజోల్ బాలీవుడ్‍లో సూపర్ హిట్ జోడి. గతంలో వారు నటించిన చాలా చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. కాగా, ఇప్పుడు పఠాన్ కలెక్షన్‍ల విషయంలో ఆమె చేసిన కామెంట్ మాత్రం వివాదం అవుతోంది.

చదువుపై అవగాహన లేని వారు మనల్ని పాలిస్తున్నారని ఇటీవలే కాజోల్ చేసిన కామెంట్లు తీవ్ర వివాదమయ్యాయి. దీంతో ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి పఠాన్ కలెక్షన్‍లపై కాజోల్ వ్యాఖ్యలు చేసింది.

షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణ్, జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలు పోషించిన పఠాన్ చిత్రం ఈ ఏడాది జనవరి 25న విడుదలైంది. ఈ చిత్రం మొత్తంగా రూ.1,050 కోట్ల కలెక్షన్లు సాధించిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. యశ్‍రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది.

Whats_app_banner