Kajal Aggarwal: ఇండియన్ 2 కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న కాజల్
Kajal Aggarwal: ఇండియన్ 2 సినిమా కోసం కాజల్ అగర్వాల్ కలరిపయట్టు యుద్ధ విద్యను నేర్చుకుంటోంది. ప్రాక్టీస్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
Kajal Aggarwal: కమల్‌హాసన్ (Kamal haasan) హీరోగా శంకర్ (shankar) దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 తో దాదాపు ఏడాది విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది కాజల్ అగర్వాల్. ప్రెగ్నెన్సీ తర్వాత ఆమె నటిస్తున్న తొలి సినిమా ఇది. ఇటీవల చెన్నైలో మొదలుపెట్టిన తాజా షెడ్యూల్ తో కాజల్ ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టింది. ప్రస్తుతం కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ లతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు శంకర్.
ట్రెండింగ్ వార్తలు
కాగా ఈ సినిమా కోసం కేరళ సంప్రదాయపు యుద్ధ కళ కలరిపయట్టు నేర్చుకుంటోంది కాజల్ అగర్వాల్. ప్రాక్టీస్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గెరిల్లా యుద్ధాల్లో ఉపయోగించే కలరియపట్టు శారీరకంగా, మానసికంగా ధృడత్వాన్ని పెంపొందిస్తుందని కాజల్ చెప్పింది. ఈ యుద్ధ కళ నుంచే షావోలిన్, కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో లాంటికి పుట్టుకొచ్చాయని అన్నది. మూడేళ్లుగా కలరిపయట్టు నేర్చుకుంటున్నానని తెలిపింది. కలరిపయట్టు గురువు సీవీఎన్ కలరికి కృతజ్ఙతలు తెలిపింది.
కాజల్ కలరిపయట్టు ప్రాక్టీస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవలే గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న వీడియోను షేర్ చేసింది. ఇండియన్ 2 సినిమాలో కాజల్ అగర్వాల్ రోల్ యాక్షన్ ప్రధానంగా సాగుతుందని సమాచారం. ఇండియన్ 2 సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తికావాల్సి ఉంది. కానీ గతంలో సినిమా సెట్స్ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యూనిట్ సభ్యులు మరణించడంతో షూటింగ్ నిలిచిపోయింది.
ఆ తర్వాత నిర్మాణ సంస్థతో దర్శకుడు శంకర్ కు విభేదాలు తలెత్తడంతో సినిమాను పక్కనపెట్టినట్లు వార్తలొచ్చాయి. కమల్ హాసన్ ఈ విభేదాలను పరిష్కరించడంతో ఇటీవల ఇండియన్ 2 షూటింగ్ మొదలైంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. 1996లో విడుదలైన ఇండియన్ సినిమాకు సీక్వెల్ ఇది.