Kadhalikka Neramillai OTT Review: ఓటీటీలో నిత్యా మీనన్ లేటెస్ట్ మూవీ.. మెప్పించేలా ఉందా!: తెలుగు వెర్షన్ రివ్యూ
Kadhalikka Neramillai Review: రవిమోహన్, నిత్యా మీనన్ కలిసి నటించిన కాదలిక్క నేరమిళ్లై చిత్రం ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మోడ్రన్ రిలేషన్స్ చుట్టూ సాగే ఈ చిత్రం ఎలా ఉందో ఇక్కడ చూడండి.

తమిళ మూవీ 'కాదలిక్క నేరమిళ్లై' చిత్రం ఈ వారంలోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. నిత్యా మీనన్, రవిమోహన్ లీడ్ రోల్స్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం డిసెంబర్ 20న తమిళంలో థియేటర్లలో రిలీజైంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ కాదలిక్క నేరమిళ్లై చిత్రం ఎలా ఉందో.. మెప్పిస్తుందా అనే విషయాల ఈ రివ్యూలో తెలుసుకోండి.
- ప్రధాన నటీనటులు: రవి మోహన్ (జయంరవి), నిత్యా మీనన్, జాన్ కొక్కన్, టీజే భాను, యోగిబాబు, వినయ్ రాయ్
- సంగీతం: ఏఆర్ రహమాన్, సినిమాటోగ్రఫీ: గావెమిక్ యు. ఆరీ
- నిర్మాత: ఉదయనిధి స్టాలిన్
- కథ, దర్శకత్వం: కృతింగ ఉదయనిధి
కథ ఇలా..
చెన్నైలోని ఓ కంపెనీలో ఆర్టిటెక్చర్‌గా పని చేస్తుంటుంది శ్రియ (నిత్యా మీనన్). ప్రేమలో ఉన్న ఆమె త్వరగా పెళ్లి చేసుకొని, పిల్లలను కనాలని ఆశిస్తుంది. తాను ప్రేమిస్తున్న కరణ్ (జాన్ కొక్కెన్) మోసం చేస్తున్నాడని తెలుసుకొని అతడితో విడిపోతుంది. మరోవైపు, స్ట్రక్చరల్ ఇంజినీర్ సిద్ధార్థ్ (రవి మోహన్).. నిరుపమ (భాను)ను ప్రేమిస్తుంటాడు. ఇద్దరి మధ్య పిల్లలను కనే విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో బ్రేకప్ అవుతుంది.
ఈ క్రమంలో స్నేహితుల ఒత్తిడితో తన స్పెర్మ్ (వీర్యం) ఫ్రీజ్ చేస్తాడు సిద్ధార్థ్. తన అడ్రెస్, వివరాలు తప్పుగా ఇస్తాడు. మరోవైపు.. ఇక ఏ రిలేషన్ వద్దని నిర్ణయించుకున్న శ్రియ.. ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనాలని డిసైడ్ అవుతుంది. ఐవీఎఫ్ చేయించుకుంటుంది. తన పిల్లాడికి స్పెర్మ్ ఇచ్చిన వ్యక్తి ఎవరని ప్రయత్నించినా తెలుసుకోలేదు. ఓసారి బెంగళూరులో సిద్ధార్థ్, శ్రీయకు పరిచయమవుతుంది. ఐవీఎఫ్ చేయించుకోవడాన్ని తల్లి అంగీకరించకపోవటంతో ఇంటికి శ్రియ దూరమవుతుంది. ఆ తర్వాత మగపిల్లాడికి శ్రియ జన్మనిస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత సిద్ధార్థ్, శ్రియ ఓ ప్రాజెక్ట్ కోసం ఒకే ఆఫీస్‍లో కలుస్తారు. పక్కపక్కనే ఉంటారు. ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. అయితే, సిద్ధార్థ్ వద్దకు నిరుపమ మళ్లీ వస్తుంది. శ్రియ ఐవీఎఫ్‍కు వాడిన స్పెర్మ్ ఎవరిది.. సింగిల్ పేరెంట్‍గా కొడుకును పెంచడంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది.. చివరికి సిద్ధార్థ్, శ్రియ ఒక్కటయ్యారా అనే అంశాలు ఈ సినిమాలో ఉంటాయి.
ముఖ్యమైన విషయాలివే
ప్రస్తుత కాలంలో రిలేషన్‍షిప్‍లు ఎలా ఉన్నాయో.. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఎలా ఉంటున్నాయో అనే విషయాల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. మోడ్రన్ రిలేషన్‍పిప్స్, ఐవీఎఫ్, సింగిల్ పేరెంటింగ్, గే పేరెంటింగ్ లాంటి అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. పిల్లల విషయంలో ప్రధాన పాత్రల మధ్య తొలుత చాలా వైవిధ్యమైన ఆలోచన ఉంటుంది. విభిన్న కోణాల్లో జీవితాలను చూస్తుంటారు. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు సమాజంలో ఎదుర్కొనే సవాళ్లు కూడా ఈ చిత్రంలో ఉంటాయి.
కథనం - విశ్లేషణ
దర్శకురాలు కృతుంగ ఉదయనిధి (సినీ హీరో, నిర్మాత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ భార్య).. ఈ చిత్రం ద్వారా తాను చెప్పాలనుకున్న అంశాలను సిన్సియర్‌గా చూపించారు. సున్నితమైన అంశాలే అయినా మరీ సీరియస్‍గా కాకుండా హృద్యంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఫీల్ గుడ్ మూవీగా మందుకు నడిపించారు. ఎవరి ఆలోచనలు కరెక్ట్ అనేది ఓ అభిప్రాయాన్ని రుద్దకుండా ప్రేక్షకులకే వదిలేయడం మంచి విషయంగా చెప్పవచ్చు.
ఈ మూవీ ప్రారంభంలో కాస్త స్లోగా అనిపిస్తుంది. అసలు కథలోకి వచ్చేందుకు కాస్త సమయం పడుతుంది. శ్రియ, సిద్ధార్థ్ ఆలోచనా విధానాల గురించి చెప్పడం, వారివారి రిలేషన్లకు బ్రేకప్ చెప్పేందుకు దర్శకురాలు కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. అయితే, వారిద్దరి మధ్య అభిప్రాయాలు ఎంత వైవిధ్యంగా ఉన్నాయో వివరించడంలో సక్సెస్ అయ్యారు. ‘పెళ్లి చేసుకున్నా పిల్లలు వద్దనుకునే సిద్ధార్థ్.. పెళ్లి చేసుకోకుండా పిల్లలు కావాలనుకునే శ్రియ’ ఇలా లీడ్ క్యారెక్టర్ల డిజైనింగ్ మెప్పిస్తుంది. వారి కోణాల్లో ఆ అంశాలను చక్కగా చూపించారు.
సమాజం ఇంకా పూర్తిస్థాయిలో అంగీకరించని ఐవీఎఫ్, గే పేరెంటింగ్ అంశాలను కథలోనే లీనమ్యేలా చూపించారు దర్శకురాలు. ఆ విషయాలపై వివిధ కోణాల్లో ఆలోచించేలా తెరకెక్కించారు. ఈ చిత్రం చూశాక కొందరి ఆలోచనలో మార్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. టెస్టు ట్యూబ్ బేబీ అంటూ తోటి పిల్లలు అనే మాటలతో శ్రియ కొడుకు బాధపడతాడు. ఆ చిన్నారికి అర్థమయ్యేలా.. నొచ్చుకోకుండా టెస్ట్ ట్యూబ్ బేబి అంటే స్పెషల్ అంటూ శ్రియా చెప్పే సీన్ ఆకట్టుకుంటుంది.
సిద్ధార్థ్, శ్రియ ఎనిమిదేళ్ల తర్వాత కలవడం, వారి మధ్య రిలేషన్ పెరగడం మంచి ఫీల్ ఇస్తాయి. సిద్ధార్థ్ స్పెర్మ్ గురించి నిజం తెలుస్తుందా అనే సస్పెన్స్ కూడా బ్యాక్‍గ్రౌండ్‍లో నడుస్తుంటుంది. సిద్ధార్థ్ లైఫ్‍లోకి నిరుపమ మళ్లీ రావడం అనే అంశం ఓ కాన్‍ఫ్లిక్ట్‌లా అనుకున్నా.. అంత వర్కౌట్ అవడం లేదు. ఈ మూవీ ప్రీ-క్లైమాక్స్, ముగింపు కూడా ఆకట్టుకుంటుంది.
ఈ కథలోని అంశాలు చాలా మెచ్యుర్డ్‌గా చూపించారు దర్శకురాలు. కథ పక్కదోవ పట్టకుండా జాగ్రత్తపడ్డారు. అక్కడక్కడా స్క్రీన్‍ప్లే స్లో అయినట్టు అనిపిస్తుంది. అయినా మళ్లీ గాడిలో పడుతుంది. సిద్ధార్థ్, సేతుమన్, గౌడ మధ్య సరదా సన్నివేశాలు ఆర్డినరీగా అనిపిస్తాయి. ఓవరాల్‍గా ఈ చిత్రంలోని కోర్ పాయింట్స్, బలమైన పాత్రలు, ఆలోచనలు మెప్పిస్తాయి.
ఎవరెలా చేశారంటే..
కాదలిక్క నేరమిళ్లై చిత్రంలో నిత్యా మీనన్ సహజమైన నటనతో మెప్పించారు. ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకున్నారు. స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయిగా.. సింగిల్ పేరెంట్‍గా నటనతో ఆకట్టుకున్నారు. శ్రియ పాత్రకు పూర్తి న్యాయం చేశారు నిత్య. రవి మోహన్ కూడా యాక్టింగ్‍తో మెప్పించారు. ఎంతో సులువుగా ఈ పాత్రను పోషించేశారు. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. యోగిబాబు, వినోద్ రాయ్, జాన్ కొక్కెన్ సహా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రకు న్యాయం చేశారు. నిత్య తండ్రి పాత్రలో లెజెండరీ సింగర్ మనోను చూడడం బాగుంది.
సాంకేతిక విషయాలు.. మ్యూజిక్ పెద్ద బలం
రాసుకున్న కథను అనుకున్న రీతిలో తెరకెక్కించడంలో దర్శకురాలు కృతింగ.. రాజీపడలేదు. ఈ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. తన స్టోరీ టెల్లింగ్‍తో మెప్పించారు. అక్కడక్కడా డ్రాగ్ చేసినట్టు అనిపించినా.. ఓవరాల్‍గా మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ అందించిన మ్యూజిక్ పెద్ద బలంగా నిలిచింది. సినిమా మొత్తం బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ హాయిగా అనిపిస్తుంది. సోల్‍ఫుల్‍గా సినిమా ఫీల్‍కు తగ్గట్టుగా సాగుతుంది. పాటలు కూడా బాగానే అనిపిస్తాయి. గావెమిక్ ఆరీ.. కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. మరీ డీవియేషన్లు లేకుండా ఎడిటింగ్ కూడా క్లీన్‍గా అనిపిస్తుంది.
చివరగా..
కాదలిక్క నేరమిళ్లై చిత్రం మోడ్రన్ రిలేషన్ల చుట్టూ సాగే ఫీల్‍గుడ్ చిత్రం. యంగ్ జనరేషన్‍లో బంధాల పట్ల కొందరిలో ఎలాంటి భిన్నమైన ఆలోచనలు ఉంటాయో చూపిస్తుంది. బహిరంగంగా ఎక్కువగా చర్చించుకోని ఐవీఎఫ్. స్పెర్మ్ ఫ్రీజింగ్ సహా చాలా విషయాల గురించి ఆలోచింపజేస్తుంది. అలాగే ఫ్యామిలీతో కలిసి చూసేలా ఈ చిత్రం ఉంటుంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీని తప్పకుండా ఓసారి చూడొచ్చు.
రేటింగ్: 3.25/5
సంబంధిత కథనం