Kadak Singh Review: కడక్ సింగ్ రివ్యూ.. ఈ థ్రిల్లర్ మూవీ మిస్ కావద్దు
Kadak Singh Review: బాలీవుడ్ విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠీ నటించిన కడక్ సింగ్ మూవీ శుక్రవారం (డిసెంబర్ 8) ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీ ఓ మంచి అనుభూతిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
Kadak Singh Review: కడక్ సింగ్.. జీ5 ఓటీటీ (Zee5 OTT)లోకి నేరుగా వచ్చిన సినిమా ఇది. ఈ థ్రిల్లర్ మూవీ కథ కొత్తది కాకపోవచ్చు కానీ ఆ కథ చెప్పే విధానం మాత్రం నిజంగా థ్రిల్‌ను పంచుతుంది. విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠీ నటించిన ఈ మూవీ చూసిన తర్వాత ఓ మంచి థ్రిల్లర్ సినిమా చూసిన అనుభూతి కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
సినిమా: కడక్ సింగ్
డైరెక్టర్ : అనిరుద్ధ రాయ్ చౌదరి
నటీనటులు: పంకజ్ త్రిపాఠీ, సంజనా సంఘి, పార్వతి తిరువోతు, జయ ఎహసాన్, జోగి మలాంగ్
ఓటీటీ: జీ5 ఓటీటీ
రిలీజ్ డేట్: శుక్రవారం (డిసెంబర్ 8)
కడక్ సింగ్ స్టోరీ ఇదీ
కడక సింగ్ స్టోరీ ఇప్పటి వరకూ చూడని కథేమీ కాదు. ఓ నిజాయతీ గల అధికారిని అడ్డు తప్పించుకోవడానికి పైఅధికారులు ఎంతటికి దిగజారతారు అన్నది ఈ మూవీలో చూడొచ్చు. ప్రజలను మోసం చేసి వందల కోట్లు దోచుకొని బోర్డు తిప్పేసే చిట్‌ఫండ్ కంపెనీ స్కామ్ ను విచారించే అధికారి పాత్రలో పంకజ్ త్రిపాఠీ ఈ కడక్ సింగ్ సినిమాలో నటించాడు.
అసలు అరుణ్ కుమార్ శ్రీవాస్తవ కడక్ సింగ్ ఎలా అయ్యాడు? అలాంటి అధికారి ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు? ఈ క్రమంలో గతాన్ని మరచిపోయిన అతడు.. తనపై జరిగిన కుట్రను ఎలా ఛేదిస్తాడు? గతాన్ని గుర్తు చేయడంలో అతని కూతురు పాత్ర ఏంటి? అన్నదే ఈ మూవీ కథ. ఇందులో కొత్తదనం లేకపోయినా.. కథ చెప్పే విధానంలోనే డైరెక్టర్ అనిరుద్ధ తన పనితనం చూపించాడు. పంకజ్ త్రిపాఠీలాంటి నటుడిని ఇలాంటి పాత్రకు ఎంపిక చేయడంలోనే అతడు సగం విజయం సాధించాడని చెప్పొచ్చు.
కడక్ సింగ్ ఎలా ఉందంటే?
హాస్పిటల్ బెడ్ పై గతాన్ని మరచిపోయి అయోమయంగా కనిపిస్తున్న తన తండ్రికి తాను అతని కూతురినంటూ సాక్షి అనే ఓ అమ్మాయి (సంజనా సంఘి) కథ చెప్పే సీన్ తో సినిమా మొదలవుతుంది. ఆ అమ్మాయి కథ ఈ సినిమాలోని హీరో వ్యక్తిగత జీవితం గురించి చెబుతుంది. పిల్లలతో కఠినంగా వ్యవహరించే తండ్రిగా పంకజ్ త్రిపాఠీ ఈ కథలో కనిపిస్తాడు. తన భార్య మరణానికి కారణం తన కొడుకు ఆదిత్య (వరుణ్ బుద్ధదేవ్) అని కడక్ సింగ్ నమ్ముతాడు.
ఆ తర్వాత హీరో పని చేసే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ కోల్‌కతా హెడ్ త్యాగి (దిలీప్ శంకర్) అతడు చేసే పని గురించి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాడు. ఓ చిట్‌ఫండ్ స్కామ్ కేసును విచారించే క్రమంలో వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకొని ఇప్పుడిలా హాస్పిటల్ బెడ్ పై ఉన్నావంటూ అతడు తన వెర్షన్ చెబుతూ వెళ్తాడు. డ్రగ్స్ కు బానిసైన తన తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో కడక్ సింగ్ కూతురు ఓ బ్రోతల్ హౌజ్ కి వెళ్లడం, అక్కడ కడక్ సింగ్ ఆమెను చూసి షాక్ కు గురవడం, ఆ బాధలోనే ఆత్మహత్యకు ప్రయత్నించావంటూ అతనికి చెబుతాడు.
తర్వాత కడక్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ నైనా (జయ ఎహసాన్) కూడా అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరిన్ని వివరాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక చివరగా కడక్ సింగ్ కొలీగ్ అర్జున్ (పరేష్ పహూజా) కూడా కడక్ సింగ్ కు అతని గతాన్ని గుర్తు చేసే క్రమంలో తన వెర్షన్ చెబుతాడు. ఈ ముగ్గురి కథలూ విన్న కడక్ సింగ్ కు తన గతం ఎలా గుర్తుకు వస్తుంది? తనపై జరిగిన కుట్రను అతడు ఎలా ఛేదిస్తాడు? చివరికి చిట్‌ఫండ్ స్కామ్ చేసిన అసలు నేరస్థుడిని అతడు పట్టుకుంటాడా? అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.
కడక్ సింగ్ మైనస్ పాయింట్స్
కడక సింగ్ ఓ మంచి థ్రిల్లర్ మూవీ. అయితే థ్రిల్లర్ మూవీకి కథ, కథనంతోపాటు ఆ కథనంలో కాస్త వేగం కూడా అవసరం. ఇదే కడక్ సింగ్ లో లోపించిందని చెప్పొచ్చు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉన్నా కూడా మధ్య మధ్యలో విలన్ ఎవరు అన్నది సాధారణ ప్రేక్షకులు కూడా గెస్ చేసే అవకాశం డైరెక్టర్ కలిగిస్తాడు. ఈ థ్రిల్లర్ మూవీని మరింత థ్రిల్ అందించే విధంగా కూడా చెప్పొచ్చు. మొత్తంగా 2 గంటల్లోనే ముగిసిపోయే ఈ థ్రిల్లర్ సినిమాను వీకెండ్ లో ఒకసారి చూడొచ్చు.