Kaalarathri Review: కాళరాత్రి రివ్యూ - తెలుగులో రిలీజైన మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Kaalarathri Review: మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ నల్ల నిళవుల రాత్రి...తెలుగులో కాళరాత్రి పేరుతో డబ్ అయ్యింది. డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
Kaalarathri Review: చెంబన్ వినోద్ జోస్, బాబురాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన కాళరాత్రి మూవీ ఇటీవల ఆహా ఓటీటీలో రిలీజైంది. సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు మర్ఫీ డేవసీ దర్శకత్వం వహించాడు. మలయాళం మూవీ నల్ల నిళవుల రాత్రి సినిమాకు డబ్బింగ్ వెర్షన్‌గా రిలీజైన ఈ సినిమా ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్‌ను పంచిందా? లేదా? అంటే?
ఆరుగురు స్నేహితుల కథ...
డొమినిక్ (జీను జోసెఫ్), జోషి(బీను), పీటర్(రోనీ డేవిడ్ రాజ్), రాజీవన్(నితిన్ జార్జ్) కాలేజీ ఫ్రెండ్స్. ఆర్గానిక్ ఫార్మింగ్ బిజినెస్ చేస్తుంటారు. పీటర్, రాజీవన్ ఫార్మ్ బాధ్యతలు చేపడితే డొమినిక్, జోషి సేల్స్ వ్యవహారాలు చూస్తుంటారు. పైకి మిత్రులుగా నటిస్తోన్న నలుగురికి ఒకరిపై మరొకరికి ద్వేషం ఉంటుంది. ఈ స్నేహితుల తోటలో పండిన ఆర్గానిక్ పంటలను అచాయన్ అనే బిజినెస్‌మెన్ తక్కువ ధరకే కొంటుంటాడు. కురియన్ (బాబురాజ్) రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో చాలా నష్టపోతాడు.
కర్ణాటకలోని ఓ అటవీ ప్రాంతాల్లో తక్కువ ధరకే 260 ఏకరాల భూమితో పాటు బ్రిటీష్ కాలం నాటి ఓ ప్యాలెస్‌ను కొంటాడు. దానిని అమ్మి అప్పులు తీర్చే దారి కోసం ఎదురుచూస్తుంటాడు. అది తన భూమి అని తెలియకుండా తన కాలేజీ స్నేహితులైన డొమినిక్, జోషి, పీటర్, రాజీవన్‌లకు ఆ భూమిని అమ్మాలని కురియన్ ప్లాన్ చేస్తాడు. అక్కడ కూడా ఫార్మ్ బిజినెస్ చేస్తే కోట్లలో లాభాలు సంపాదించవచ్చవని స్నేహితులను నమ్మిస్తాడు.
ఈ ప్లాన్‌లో ఇరుంబన్ (చెంబన్ వినోద్ జోస్) కూడా భాగం అవుతాడు. ఆ భూమిని చూడటానికి నలుగురు స్నేహితులతో పాటు కురియన్, ఇరుంబన్ అటవీ ప్రాంతంలోని ప్యాలెస్‌లో దిగుతారు. అదే రాత్రి కొందరు అపరిచితులు వారిపై ఎటాక్ చేసి డొమినిక్, రాజీవ్‌లను చంపేస్తారు.
ఆ ఆపరిచితుల నుంచి కురియన్, ఇరుంబన్‌తో పాటు మిగిలిన వాళ్లు ఎలా బయటపడ్డారు? ఆ స్నేహితులను చంపడానికి వచ్చిన అగంతకులు ఎవరు? కురియన్ అండ్ గ్యాంగ్‌పై ఆ అపరిచితులు పగను పెంచుకోవడానికి కారణం ఏమిటన్నదే కాళరాత్రి మూవీ కథ.
హాలీవుడ్‌లో పాపులర్...
హాలీవుడ్‌లో సర్వైవల్ థ్రిల్లర్ చాలా పాపులర్ జానర్. ట్రిప్ కోసం కొందరు స్నేహితులు అడవిలో అడుగుపెట్టడం, వారిని చంపడానికి ఓ సీరియల్ కిల్లర్ వెంటాడటం అనే కాన్సెప్ట్‌తో వారానికో సినిమా వస్తూనే ఉంటుంది. ఈ సర్వైవల్ మూవీస్ కథ చాలా వరకు ఒకేలా ఉంటుంది.
కానీ కిల్లర్ నుంచి హీరోహీరోయిన్లు ఎలా తప్పించుకుంటారన్నది ఎంత గ్రిప్పింగ్‌గా రాసుకుంటే కథ అంత రక్తి కడుతుంది. మైండ్‌బ్లోయింగ్ ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఇలా కూడా జరుగుతుందా అని ఆడియెన్ అనుకునేలా సర్‌ప్రైజ్ చేయాలి. అప్పుడే ఈ సర్వైవల్ మూవీస్ ఆకట్టుకుంటాయి.
సేమ్ ఫార్ములా...
ఎన్నో హాలీవుడ్ సినిమాల నుంచి ఇన్‌స్పైర్ అయ్యి డైరెక్టర్ మర్ఫీ డేవసీ కాళరాత్రి మూవీని తెరకెక్కించాడు. స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలో పూర్తిగా హాలీవుడ్ ఫార్మెట్‌ను ఫాలో అయ్యాడు. బిజినెస్ ట్రిప్ నిమిత్తంఅడవి మధ్యలో ఉన్న పాతకాలం నాటి బంగళాలో అడుగుపెట్టిన కొందరు స్నేహితులు తమ ప్రాణాలు నిలుపుకోవడానికి ఎలాంటి పోరాటం చేశారన్నదే ఈ మూవీ కథ.
ఆర్గానిక్ ఫార్మింగ్ క్లాస్...
ఈ సింపుల్ పాయింట్‌ను రెండు గంటల్లో చెప్పడానికి దర్శకుడు అష్టకష్టాలు పడ్డాడు. సినిమాను సీరియల్‌గా సాగదీశాడు. సినిమా ఆరంభంలో వచ్చే సీన్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ బిజినెస్ క్లాస్‌లా ఉంటుంది. స్నేహితుల మధ్య గొడవలు, ఒకరిని మరొకరు మోసం చేస్తూ వేసే ఎత్తుల్లో ఆసక్తి లోపించింది.
కిల్లర్స్ గ్యాంగ్ హీరోలపై ఎటాక్ చేయడానికి కారణం ఏమిటనే మెయిట్ ట్విస్ట్ అయితే సిల్లీగా ఉంటుంది. ఓ పంది కోసం ప్రాణాలు తీస్తున్నారని తెలిసిన అప్పటివరకు సినిమాపై ఉన్న కాస్తో...కూస్తో ఆసక్తి కూడా ఆవిరైపోతుంది.
సీరియల్‌లా...
కిల్లర్స్ నుంచి ఫ్రెండ్స్ గ్యాంగ్ తప్పించుకునేసీన్స్ సీరియల్స్‌ను తలపిస్తాయి. ఆయుధాలు పట్టుకొని కిల్లర్స్ ఇళ్లు మొత్తం వెతుకుతుంటారు...వారిని దొరక్కుండా హీరో గ్యాంగ్ దక్కుంటారు. ఇవే సీన్స్ రిపీట్‌చేస్తూ క్లైమాక్స్ వరకు కథను సాగదీస్తూ వెళ్లారు. ఓ మలుపుతో సినిమాను ఎండ్ చేసి సీక్వెల్ అనౌన్స్‌చేశాడు.
హీరోలు లేరు...
సినిమాలో హీరోలు అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. అన్ని పాత్రలకు సమానంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇరుంబన్‌గా మాస్ క్యారెక్టర్‌లో చెంబన్ వినోద్ జోస్ కనిపించాడు కురియన్‌గా పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ క్యారెక్టర్‌లో బాబురాజ్ నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన వారి నటన ఓకే అనిపిస్తుంది.తెలుగు డబ్బింగ్ బాగుంది. నిడివి రెండు గంటలే అయినా ఎక్కువే అనిపిస్తుంది.
సిల్లీ సర్వైవల్ థ్రిల్లర్...
కాళరాత్రి ఓపికకు పరీక్ష పెట్టే సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. పేలవమైన కథ, కథనాలు, సిల్లీ ట్విస్ట్‌లతో డిసపాయింట్ చేస్తుంది.