Jr NTR Devara Movie: అవే నన్ను ఈ స్థాయికి చేర్చాయి: థ్యాంక్స్ చెబుతూ లెటర్ పోస్ట్ చేసిన ఎన్టీఆర్
Jr NTR Devara Movie: దేవర సినిమా భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఇంకా జోరు చూపిస్తోంది. ఈ తరుణంలో ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. సోషల్ మీడియాలో ఓ లెటర్ పోస్ట్ చేశారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్-1 మూవీ కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీ ఇంకా కలెక్షన్లలో జోరు కనబరుస్తోంది. మూడో వారంలోనూ సక్సెస్‍ఫుల్‍గా రన్ అవుతోంది. దేవర చిత్రం ఇప్పటికే రూ.500కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ కూడా దాటేసింది. ఈ తరుణంలో ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ నేడు (అక్టోబర్ 15) ఓ లెటర్ రిలీజ్ చేశారు ఎన్టీఆర్.
హృదయంలో ప్రత్యేక స్థానం
దేవర పార్ట్ 1 సినిమాకు అందుతున్న అద్భుతమైన స్పందనకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ లెటర్ రాసుకొచ్చారు ఎన్టీఆర్. సోషల్ మీడియాలో దీన్ని పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో తనతో కలిసి నటించిన సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కూపర్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ సహా నటీనటులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరూ పాత్రలకు ప్రాణం పోసి కథకు జీవం ఇచ్చారని ఎన్టీఆర్ ప్రశంసించారు.
కొరటాల గురించి..
దర్శకుడు కొరటాల శివ దిశానిర్దేశంతోనే దేవర మూవీ విజయవంతమైందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. “నా దర్శకుడు కొరటాల శివకు ధన్యవాదాలు. ఆ కథను సృష్టించిన ఆయన దిశానిర్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయింది” అని రాసుకొచ్చారు. అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన సంగీతం అందించాలని చెప్పారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు, వీఎఫ్‍ఎక్స్ యుగంధర్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‍కు కూడా ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
దేవర మూవీ నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణకు కూడా ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పారు. సినీ పరిశ్రమలోని మిత్రులు, వారు అందించిన ప్రేమకు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు.
అవే ఈ స్థాయికి చేర్చాయి
ప్రపంచ నలుమూలల నుంచి ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా ధన్యవాదాలు అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు. దేవర మూవీని పండుగలా జరుపుకుంటున్న కుటుంబ సభ్యుల్లాంటి అభిమానులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఎన్టీఆర్ పేర్కొన్నారు. అభిమానులు చూపించే ప్రేమ, అభిమానమే తనను ఈ స్థాయికి చేర్చిందని ఎన్టీఆర్ తెలిపారు.
దేవర పార్ట్ 1 మూవీని భుజాలపై మోసి, ఘన విజయం సాధించేలా చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు ఎన్టీఆర్. గర్వింపడేలా సినిమాలు చేస్తూ ఉండటానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని ఎన్టీఆర్ మరోసారి ఈ లెటర్‌లో అభిమానులకు మాట ఇచ్చారు. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఉంటుందని దేవర రిలీజ్‍కు ముందు ఎన్టీఆర్ చెప్పగా.. ఈ సినిమా ఆ రేంజ్‍లోనే కలెక్షన్లను దక్కించుకుంటోంది. దీంతో ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.
దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500కోట్ల కలెక్షన్ల మైలురాయిని ఇటీవలే అధిగమించింది. 18 రోజులైనా ఈ మూవీ ఇంకా మంచి వసూళ్లను సాధిస్తోంది. లాంగ్ రన్‍తో మెప్పిస్తోంది. మిక్స్డ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా చేయగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.