క్రైమ్ థ్రిల్లర్‌కు లీగల్ డ్రామా తోడైతే అదే జియోహాట్‌స్టార్ కొన్నేళ్లుగా అందిస్తున్న క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్ అవుతుంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకొని తాజాగా నాలుగో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ అన్ని ఎపిసోడ్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ గురువారం (జులై 3) వచ్చిన చివరి ఎపిసోడ్, క్లైమ్యాక్స్ ప్రేక్షకులను షాక్ కు గురి చేసేలా ఉంది.
క్రిమినల్ జస్టిస్.. ఇండియన్ ఓటీటీ స్పేస్ లో వచ్చిన హిట్ క్రైమ్ థ్రిల్లర్, లీగల్ డ్రామా వెబ్ సిరీస్ లలో ఒకటి. ఇందులో మాధవ్ మిశ్రా అనే లాయర్ గా ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠీ నటిస్తున్నాడు. తాజాగా ఎ ఫ్యామిలీ మ్యాటర్ పేరుతో నాలుగో సీజన్ వచ్చింది. కొన్నాళ్లుగా ప్రతి గురువారం ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు.
ఈ గురువారం (జులై 3) చివరి ఎపిసోడ్ వచ్చేసింది. ఈ కొత్త సీజన్ లో స్టోరీ ఓ డాక్టర్, మాజీ క్రిమినల్ లాయర్ భార్యాభర్తలుగా ఉన్న ఇంట్లో జరిగే ఓ హత్య చుట్టూ తిరుగుతుంది. ఆ హత్య ఎవరిదో కాదు.. డాక్టర్ రాజ్ నాగ్‌పాల్ (జీషాన్ ఆయుబ్) ప్రేయసి, అతని కూతురు ఇరా (ఖుషీ భరద్వాజ్)కు నర్స్‌గా ఉన్న రోషినీ సలూజా (ఆశా నేగి)ది. ఈ హత్యలో రాజ్ తోపాటు ఇప్పుడు అతనికి దూరంగా ఉంటున్న అతని భార్య అంజు నాగ్‌పాల్ (సుర్లీన్ చావ్లా) కూడా ప్రధాన అనుమానితులుగా ఉంటారు. ఈ హత్య కేసులో మొదట పోలీసులను రాజ్ ను అరెస్ట్ చేస్తారు.
ఆ తర్వాత ఈ కేసులో ముఖ్యమైన ఆధారం దొరికిన తర్వాత అంజు కూడా నిందితురాలిగా భావించి ఆమెను కూడా అరెస్ట్ చేస్తారు. రాజ్ తరఫున లాయర్ మాధవ్ మిశ్రా (పంకజ్ త్రిపాఠీ), అంజు తరఫున లాయర్ మందిర (మితా వశిస్ట్)తోపాటు ప్రాసిక్యూషన్ తరఫున లేఖ అగస్త్య (శ్వేతా బసు ప్రసాద్) రంగంలోకి దిగుతారు. ఈ ముగ్గురు లాయర్ల మధ్య కోర్టులో హోరాహోరీ సాగుతుంది. చివరికి విజయం ఎవరిది అన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు.
క్రిమినల్ జస్టిస్ సీజన్ 4లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఓ క్రైమ్ థ్రిల్లర్, లీగల్ డ్రామాలో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయని చెప్పొచ్చు. ఓ హత్య, దాని చుట్టూ కోర్టులో జరిగే వాదనలు ఎంతో ఆసక్తి రేపుతుంటాయి. ఒక్కో ఎపిసోడ్ ముగుస్తున్న కొద్దీ అసలు హత్య ఎవరు చేశారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో పెరుగుతూ ఉంటుంది.
భార్యాభర్తలే ప్రధాన నిందితులు కావడంతో సహజంగానే ఈ ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇక మాధవ్ మిశ్రా స్టైల్ వాదనలు ఈ సీజన్ 4కు కూడా అదనపు బలంగా నిలిచాయి. ఇక కథనంలో భాగంగా మధ్యమధ్యలో వచ్చే ట్విస్టులు కూడా థ్రిల్ పంచుతాయి. ముఖ్యంగా చివరి ఎపిసోడ్ చివరి 15 నిమిషాల్లో వచ్చే మలుపులు ఓ మంచి సిరీస్ చూశామన్న సంతృప్తి కలిగిస్తాయి.
మాధవ్ మిశ్రాగా ఈ సీజన్లోనూ పంకజ్ త్రిపాఠీ అదరగొట్టగా.. మిగిలిన పాత్రలన్నీ తమ పరిధి మేర సహకారం అందించాయి. మొత్తంగా జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 ఎ ఫ్యామిలీ మ్యాటర్.. ఈ వీకెండ్ ఓ మస్ట్ వాచ్ అని చెప్పాలి.
సంబంధిత కథనం