Jio Cinema: ఇక ఆ హాలీవుడ్ సినిమాలు, షోలన్నీ జియో సినిమాలో..
Jio Cinema: ఇక ఆ హాలీవుడ్ సినిమాలు, షోలన్నీ జియో సినిమాలో రానున్నాయి. వార్నర్ బ్రదర్స్ తో రిలయెన్స్ ఓ పెద్ద డీల్ కుదుర్చుకుంది. దీని ద్వారా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Jio Cinema: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లను ఫ్రీగా చూపిస్తూ జియో సినిమా సంచలనం రేపుతున్న విషయం తెలుసు కదా. ఇక ఇప్పుడు పాపులర్ హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు కూడా త్వరలోనే జియో సినిమాలో అందుబాటులోకి రానున్నాయి. వార్నర్ బ్రదర్స్ కు చెందిన డిస్కవరీతో రిలయెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది.
దీంతో ఇన్నాళ్లూ హాట్‌స్టార్ లో ఉన్న హాలీవుడ్ కంటెంట్ ఇక జియో సినిమాలోకి రానుంది. రిలయెన్స్ కు చెందిన వయాకామ్18, వార్నర్ బ్రదర్స్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు వాళ్ల హెచ్‌బీవో (HBO) కంటెంట్ జియో సినిమాలో ఉంటుంది. సక్సెషన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, హ్యారీ పోటర్ సిరీస్ లాంటి పాపులర్ షోలన్నీ ఇక జియోసినిమాలో అందుబాటులోకి రానున్నాయి.
ఈ ఇద్దరి మధ్య డీల్ ఎక్స్‌క్లూజివ్. అంటే వార్నర్ బ్రదర్స్ కు చెందిన టాప్ రేటెడ్ కంటెంట్ కేవలం జియో సినిమాలోనే ఉంటుంది. దీంతో ఇక నుంచి వార్నర్ బ్రదర్స్ అలాంటి సినిమాలు, షోలను ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్ లాంటి జియో సినిమా ప్రత్యర్థులకు ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పటికే ఐపీఎల్ ద్వారా కోట్ల మందికి దగ్గరైన జియో సినిమా.. ఇక ఈ ఎక్స్‌క్లూజివ్ హాలీవుడ్ కంటెంట్ ద్వారా మరింత ఆదరణ పొందడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ డిజిటల్ హక్కులను వయాకామ్18 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీనికోసం ఆ సంస్థ సుమారు రూ.25 వేల కోట్లు ఖర్చు పెట్టినా.. తొలి ఏడాది మాత్రం ఐపీఎల్ మ్యాచ్ లను అందరికీ ఫ్రీగా చూపిస్తుండటం విశేషం. ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లాంటి బడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ తో పోటీ పడాలనుకుంటున్న జియో సినిమాకు ఈ డీల్ నిజంగా ఎంతో మేలు చేయనుంది.
సంబంధిత కథనం