Jersey Re-release Date: నేచురల్ నాని హీరోగా నటించిన జెర్సీ హిట్ కావడంతో పాటు మంచి సినిమాగా నిలిచింది. నాని కెరీర్లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా ఉంది. క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍లో నడిచే ఈ స్పోర్ట్స్ లవ్ డ్రామా మూవీ 2019లో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో పాటు చాలా ప్రశంసలను దక్కించుకుంది. చాలా మంది ప్రేక్షకుల మనసుల్లోనూ మంచి చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో నాని నటనకు మరోసారి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంత ఆదరణ పొందిన.. ‘జెర్సీ’ సినిమా మళ్లీ థియేటర్లలో అడుగుపెట్టనుంది.
జెర్సీ సినిమా ఏప్రిల్ 20వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆరోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని థియేటర్లలో ఆ మూవీ స్పెషల్ షోలు ఉండనున్నాయి. ఏప్రిల్ 19 వతేదీకి జెర్సీ చిత్రం రిలీజై ఐదేళ్లు పూర్తికానుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 20వ తేదీన ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలోకి తీసుకొన్నారు మేకర్స్.
ఏప్రిల్ 20న జెర్సీ మూవీ రీ-రిలీజ్ అవుతుందంటూ అధికారిక ప్రకనట కూడా వచ్చింది. దీనికి సంబంధించి మేకర్స్ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
జెర్సీ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. క్రికెట్, లవ్ స్టోరీ, తండ్రీకొడుకుల ఎమోషన్ లాంటి అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రం నాని యాక్టింగ్ మరోసారి అదిరిపోయింది. ముఖ్యంగా ఎమోషన్ సీన్లలో ప్రేక్షకులను కట్టిపడేశారు. రైల్వే స్టేషన్ సీన్ ఐకానిక్‍గా నిలిచిపోయింది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‍గా నటించగా.. నాని కొడుకు పాత్రను రోణిత్ కర్మ చేశారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి.
జెర్సీ మూవీకి గాను 2021 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బెస్ట్ ఎడిటర్ పురస్కారం నవీన్ నూలికి దక్కింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. 2019 ఏప్రిల్ 19వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. రూ.25 కోట్లతో రూపొందించిన ఈ మూవీకి సుమారు రూ.50 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయని అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు, ఐదేళ్ల తర్వాత ఏప్రిల్ 20న ఈ మూవీ మళ్లీ థియేటర్లలో రానుంది.
నాని ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. పెద్ద లైనప్ పెట్టుకున్నారు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని నాని చేస్తున్నారు. ఆగస్టు 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‍లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్‍లోనూ ఓ చిత్రానికి నేచురల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తనకు దసరా లాంటి భారీ బ్లక్ బాస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతోనూ మరో చిత్రం చేయనున్నారు నాని. ఈ మూవీకి సంబంధించి ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. అనౌన్స్‌మెంట్ పోస్టరే చాలా ఆసక్తిని రేకెత్తించింది. బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు యెల్దండి దర్శకత్వంలోనూ నాని ఓ మూవీకి ఓకే చెప్పారు. ఎల్లమ్మ అనే టైటిల్ కూడా ఈ మూవీకి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇలా, వరుస సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు నాని.
టాపిక్