Gaddar Awards: గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్‌పర్సన్‍గా జయసుధ.. కీలక సమావేశం-jayasudha appointed as gaddar awards jury chairperson ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gaddar Awards: గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్‌పర్సన్‍గా జయసుధ.. కీలక సమావేశం

Gaddar Awards: గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్‌పర్సన్‍గా జయసుధ.. కీలక సమావేశం

Gaddar Awards - Jayasudha: గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్‌పర్సన్‍గా సీనియర్ నటి జయసుధ ఎంపికయ్యారు. ఈ అవార్డులపై కీలక సమావేశం జరిగింది. స్క్రీనింగ్ డేట్‍ను ఖరారు చేసింది జ్యూరీ.

Gaddar Awards: గద్దర్ అవార్డులపై కీలక సమావేశం.. జ్యూరీ చైర్మన్‍గా జయసుధ

తెలుగు సినీ పరిశ్రమకు ప్రోత్సాహకంగా గద్దర్ అవార్డులను అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 2014 జూన్ నుంచి డిసెంబర్ 2023 వరకు విడుదలైన సినిమాలకు ఈ ఏడాది అవార్డులు ఇవ్వాలని డిసైడ్ అయింది. తొలిసారి గద్దర్ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. ఈ గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్‌పర్సన్‍గా సీనియర్ నటి జయసుధ ఎంపికయ్యారు. ఆమె అధ్యక్షతన నేడు (ఏప్రిల్ 16) జ్యూరీ సమావేశం జరిగింది.

జయసుధతో దిల్‍రాజు సమావేశం

హైదరాబాద్‍లోని ఎఫ్‍డీసీ మీటింగ్ హాల్‍లో గద్దర్ అవార్డుల జ్యూరీ సమావేశం జరిగింది. 15 మంది సభ్యులతో ఈ జ్యూరీ ఏర్పాటైంది. జ్యూరీ ఛైర్‌పర్సన్‍ జయసుధతో నేడు భేటీ అయ్యారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‍‍మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‍డీసీ) చైర్మన్, నిర్మాత దిల్‍రాజు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం సినీ రంగానికి అవార్డులను ఇస్తోందని, గద్దర్ అవార్డులకు జాతీయస్థాయి గుర్తింపు దక్కేలా జ్యూరీ సభ్యులు చర్యలు తీసుకోవాలని దిల్‍రాజు కోరారు. నామినేషన్లను నిష్పాక్షికంగా పరిశీలించాలని సూచించారు.

1,248 నామినేషన్లు.. 21 నుంచి స్క్రీనింగ్

గద్దర్ అవార్డుల కోసం మొత్తంగా 1,248 నామినేషన్లు అందినట్టు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ ఎండీ హరీశ్ తెలిపారు. ఇందులో వ్యక్తిగత కేటగిరీల్లో 1172, ఫీచర్ సినిమాలు, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు సహా వివిధ విభాగాల సినిమాలకు 76 అప్లికేషన్లు అందినట్టు వెల్లడించారు. ఏప్రిల్ 21వ తేదీ నుంచి అప్లికేషన్స్ వచ్చిన చిత్రాల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్న సమయంలో నంది అవార్డుల వేడుక జరిగేది. అయితే, దశాబ్దం కిందటే ఇది ఆగిపోయింది. ఆ స్థానంలో గద్దర్ అవార్డులను ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాదే ఈ పురస్కారాల వేడుక జరగనుంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం