Kollywood OTT: నెలరోజుల్లోనే ఓటీటీలోకి కోలీవుడ్ స్టార్ హీరో మూవీ - ఐదు భాషల్లో రిలీజ్
Kollywood OTT: జయం రవి హీరోగా నటించిన తమిళ మూవీ బ్రదర్ థియేటర్లలో రిలీజైన నెలలోనే ఓటీటీలోకి రాబోతోంది. జీ5 ఓటీటీలో ఈ నెలాఖరు నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో భూమిక చావ్లా కీలక పాత్ర పోషించింది.
Kollywood OTT: తమిళ మూవీ బ్రదర్ హీరో జయం రవికి అచ్చిరాలేదు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచి జయం రవికి పెద్ద షాకిచ్చింది. బ్రదర్ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా...సీనియర్ కథానాయిక భూమిక ఓ కీలక పాత్ర పోషించింది. అమరన్‌కు పోటీగా అక్టోబర్ 31న కోలీవుడ్ బాక్సాఫీస్ బరిలో నిలిచిన ఈ సినిమాకు ఎమ్ రాజేష్ దర్శకత్వం వహించాడు.
థియేటర్లలో కేవలం తమిళంలోనే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం ఐదు భాషల్లో విడుదలకానున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. కాగా బ్రదర్ మూవీ ఓవర్‌సీస్ ఓటీటీ ఐంథుసన్‌లో శనివారం రిలీజైంది.
30వ సినిమా...
బ్రదర్ మూవీలో నటరాజ సుబ్రమణియమ్, రావురమేష్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. హరీస్ జయరాజ్ మ్యూజిక్ అందించాడు. జయం రవి హీరోగా నటించిన 30వ సినిమా ఇది.
కార్తిక్ కథ...
అక్కాతమ్ముళ్ల అనుబంధానికి కామెడీని జోడించి దర్శకుడు రాజేష్ బ్రదర్ మూవీని తెరకెక్కించాడు. కార్తిక్ (జయం రవి) నిజాయితీపరుడైన యువకుడు. కానీ ఆ మంచితనమే అతడికి తరుచుగా ఇబ్బందులను తెచ్చిపెడుతుంటుంది. తన కళ్ల ముందు అన్యాయం జరిగితే సహించని కార్తిక్ చాలా మందితో గొడవలుపడుతుంటాడు.
ఆ గొడవలకు దూరంగా ఉండాలని ఊటీలో ఉన్న తన అక్క ఆనంది (భూమిక), బావ అరవింద్ (నటరాజ సుబ్రమణియన్) దగ్గరకు వెళ్లిపోతాడు కార్తిక్. ఓ చిన్న సమస్య కారణంగా అరవింద్ తండ్రితో (రావురమేష్) గొడవపడతాడు. ఆ గొడవ వల్ల అరవింద్, ఆనంది విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
ఆ తర్వాత ఏమైంది? తన వల్లే దూరమైన అక్క, బావలను కార్తిక్ మళ్లీ ఎలా కలిపాడు? కార్తిక్, అరవింద్ ఫ్యామిలీలకు మీడియేటర్‌గా ఉన్న అర్చన (ప్రియాంక అరుళ్ మోహన్)ఎవరు? అనే అంశాలను ఎమోషన్, కామెడీ జోడించి బ్రదర్ మూవీలో డైరెక్టర్ కార్తిక్ చూపించాడు.
నాలుగు ఫ్లాప్‌లు...
బ్రదర్ రిలీజ్‌కు కొద్ది రోజుల ముందే తన భార్య ఆర్తికి జయం రవి విడాకులు ఇచ్చాడు. దాదాపు పదిహేనేళ్ల వైవాహిక బంధానికి మనస్పర్థలతో ముగింపు పలకడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. జయం రవి, ఆర్తి దంపతులకు అరవ్, అయాన్ అనే కుమారులు ఉన్నారు.
మరోవైపు పొన్నియన్ సెల్వన్ వన్ తర్వాత జయం రవి హీరోగా నటించిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం జీనీతో పాటు కాదలిక్క నెరమిళ్లై సినిమాలు చేస్తోన్నాడు జయం రవి.