Jawan Day 8 Collections: తగ్గిన జవాన్ జోరు.. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వచ్చాయంటే..
Jawan Day 8 Collections: జవాన్ మూవీ ఆరంభంలో కలెక్షన్ల సునామీ సృష్టించగా.. ఇప్పుడు కాస్త జోరు తగ్గించింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఎన్ని కోట్ల వచ్చాయంటే..
Jawan Day 8 Collections: బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా సూపర్ హిట్ దిశగా సాగుతోంది. సెప్టెంబర్ 7న రిలీజ్ అయి బంపర్ ఓపెనింగ్‍లను అందుకున్న ఈ మూవీ రెండో వారంలో కాస్త నెమ్మదించింది. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుఖ్ డ్యుయల్ రోల్ చేశారు. దీపికా పదుకొణ్ క్యామియో చేయగా.. నయనతార హీరోయిన్‍గా నటించారు. భారీ అంచనాల మధ్య రిలీజైన జవాన్ తొలి వారంలో బాక్సాఫీస్ వద్ద జోరు కనబరిచింది. అదిరే ఆరంభాన్ని అందుకుంది. అయితే, 8వ రోజు ఈ సినిమాకు కలెక్షన్ల దూకుడు తగ్గింది. జవాన్ చిత్రానికి ఇప్పటి వరకు ఎంత కలెక్షన్లు వచ్చాయంటే..
జవాన్ సినిమా 8వ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.28.79 కోట్లను గ్రాస్ కలెక్షన్లు సాధించింది. దీంతో 8 రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్త కలెక్షన్లు రూ.684.71 కోట్లకు చేరాయి. ఐదు రోజుల్లోనే సుమారు రూ.500కోట్ల వసూళ్లతో దుమ్మురేపిన ఈ మూవీ ఆ తర్వాత కాస్త నెమ్మదించింది. 8వ రోజు రూ.28.79కోట్ల రాగా.. ఈ మూవీకి ఒక రోజు కలెక్షన్లు రూ.30కోట్ల కంటే తక్కువ రావడం ఇదే తొలిసారి. కాగా, 9వ రోజు ఈ సినిమా రూ.700కోట్ల క్లబ్‍లోకి చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ఇక, భారత్‍లో జవాన్ మూవీ నెట్ కలెక్షన్లు రూ.400 కోట్లను సమీపించాయి. 8 రోజుల్లో దేశంలో ఈ సినిమా రూ.388.72 కోట్ల వసూళ్లను రాబట్టింది. రూ.400కోట్ల మైలురాయికి చేరువైంది.
ఫుల్ రన్‍లో పఠాన్ కలెక్షన్లను జవాన్ దాటుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షారుఖ్ నటించిన పఠాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1000కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అయితే, జవాన్ రూ.1000కోట్ల మార్కును చేరడం కాస్త కష్టతరంగానే ఉంది. జవాన్ రన్ ఎలా ఉంటుందో ఈ వీకెండ్‍లో తేలిపోతుంది. ఒకవేళ ఈ శని, ఆదివారాల్లో కలెక్షన్లు పుంజుకోకపోతే జవాన్ జోరు పూర్తిగా నెమ్మదించినట్టు పరిగణించవచ్చు.
జవాన్ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‍గా నటించగా.. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్‍దత్ క్యామియో రోల్ చేశారు. ప్రియమణి, సాన్య మల్హోత్రా కీలకపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. రెడ్ చెల్లీస్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై షారుఖ్ భార్య గౌరీ ఖాన్.. జవాన్ మూవీ నిర్మించారు. సెప్టెంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఈ మూవీ రిలీజ్ అయింది .