Jawan Day 5 BO collections: బాక్సాఫీస్ దగ్గర జవాన్ రికార్డుల పరంపర.. ఐదో రోజు కలెక్షన్లు ఎంతంటే?
Jawan Day 5 BO collections: బాక్సాఫీస్ దగ్గర జవాన్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఐదో రోజు సోమవారం (సెప్టెంబర్ 11) కావడంతో కాస్త వసూళ్ల జోరు తగ్గినా.. ఓవరాల్ గా ఐదు రోజుల కలెక్షన్లలో మాత్రం కొత్త రికార్డు సొంతం చేసుకుంది.
Jawan Day 5 BO collections: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, నయనతార కలిసి నటించిన జవాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తూనే ఉంది. ఐదో రోజు అయిన సోమవారం (సెప్టెంబర్ 11) కలెక్షన్లతో మొత్తంగా ఇండియాలో జవాన్ మూవీ వసూళ్లు రూ.300 కోట్లు దాటాయి. ఈ ఏడాది డొమెస్టిక్ బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన మూడో హిందీ సినిమాగా జవాన్ నిలిచింది.
ట్రెండింగ్ వార్తలు
ఇప్పటికే షారుక్ ఖాన్ నటించిన పఠాన్, సన్నీ డియోల్ నటించిన గదర్ 2 ఈ రికార్డును సొంతం చేసుకున్నాయి. సోమవారం జవాన్ మూవీ వసూళ్లు కాస్త తగ్గాయి. దేశవ్యాప్తంగా అన్ని భాషలు కలిపి ఈ మూవీ రూ.30 కోట్లు వసూలు చేసినట్లు Sacnilk.com వెల్లడించింది. జవాన్ మూవీ తొలి ఐదు రోజులు కలిపి ఇండియాలోనే రూ.316.16 కోట్లు వసూలు చేసింది.
జవాన్ ఐదు రోజుల కలెక్షన్లు ఇలా..
జవాన్ మూవీ తొలి రోజే భారీ ఓపెనింగ్ సాధించింది. గత గురువారం (సెప్టెంబర్ 7) రిలీజైన ఈ మూవీ తొలి రోజు అన్ని భాషల్లో కలిపి రూ.75 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజు ఈ వసూళ్లు రూ.53.23 కోట్లుగా ఉన్నాయి. మూడో రోజు ఇది రూ.77.83 కోట్లకు, నాలుగోరోజు ఏకంగా రూ.85 కోట్లకు చేరాయి. ఐదో రోజు కాస్త తగ్గి రూ.30 కోట్లకు పరిమితమైనా.. ఐదు రోజుల్లోనే ఇండియాలో రూ.300 కోట్ల క్లబ్ లో చేరింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా జవాన్ కలెక్షన్లు చూస్తే.. అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన హిందీ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. తొలి నాలుగు రోజుల్లోనే జవాన్ ఈ మైలురాయిని అందుకుంది. ఈ విషయాన్ని సోమవారం సినిమాను నిర్మించిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. తొలి వీకెండ్ లోనే జవాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.520.79 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం.
జవాన్ మూవీకి ఇంత భారీ విజయాన్ని కట్టబెట్టిన అభిమానులకు కింగ్ ఖాన్ థ్యాంక్స్ చెప్పాడు. సోషల్ మీడియా ఎక్స్ ద్వారా అతడు స్పందించాడు. "జవాన్ పై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు థ్యాంక్స్. అందరూ సురక్షితంగా, సంతోషంగా ఉండండి. సినిమాను మీరు ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేయండి. నేను మళ్లీ వచ్చి వాటన్నింటినీ చూస్తాను. అంత వరకూ జవాన్ మూవీతో పార్టీ చేసుకోండి" అని షారుక్ అన్నాడు.