Jani Master: డ్యాన్సర్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్‌ను తొలగింపు.. కొత్త అధ్యక్షుడి పేరు కూడా ప్రకటన
Jani Master: లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్ట్ అయ్యి.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న జానీ మాస్టర్‌ను డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో.. జానీ మాస్టర్ స్పందిస్తూ.. ఏం చెప్పారంటే?
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి తొలగించినట్లు సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. లేడీ కొరియోగ్రాఫర్‌ను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న జానీ మాస్టర్.. జైలుకి వెళ్లి ఇటీవల బెయిల్‌పై విడుదల అయ్యారు. ఆరోపణలు, కేసుల నేపథ్యంలో.. డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్‌ను తొలగించినట్లు తెలుస్తోంది.
నన్ను ఎవరూ తీసివేయలేరు
అసోసియేషన్ నుంచి తొలగింపు వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు. ‘‘ఈరోజు ఉదయం నుంచి ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. నన్ను డ్యాన్సర్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని ప్రచారం చేస్తున్నారు. నేను ఇప్పటికీ డ్యాన్సర్ అసోషియేషన్ సభ్యుడినే.. నా కార్డుని ఎవరూ తీసివేయలేరు.
టాలెంట్ ఉన్నోళ్లకి పని దొరక్కుండా ఎవరూ చేయలేరు. నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా.. అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. నేను చట్టపరంగా పోరాడతాను. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీలో ఓ పాటకి కొరియోగ్రఫీ చేశాను. ఆ పాట మీ అందరికీ నచ్చుతుంది’’ అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు.
కొత్త అధ్యక్షుడిగా జోసెఫ్ నియామకం
డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్ నియామకం కూడా సోమవారం జరిగిపోయింది. ఆదివారం జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఇప్పటికే జోసెఫ్ ప్రకాష్ నాలుగు సార్లు.. డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రకాష్ ఎన్నికతో జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుంచి కూడా అధికారికంగా తప్పించినట్లు అయ్యింది.