జాన్వీ కపూర్ నటించిన మూవీ హోమ్‌బౌండ్ ఆస్కార్స్ బరిలో నిలిచింది. దర్శకుడు నీరజ్ ఘైవాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2026 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియా తరపున అధికారిక ఎంట్రీగా శుక్రవారం (సెప్టెంబర్ 20) ఎంపికైంది. ఈ డైరెక్టర్, సినిమా ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ తోపాటు జాన్వీ కపూర్ కూడా ఈ అరుదైన ఘనతపై స్పందించారు.
హోమ్‌బౌండ్ సినిమా అకాడమీ అవార్డ్స్ కు ఎంపికైన కొన్ని నిమిషాల తర్వాత కరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా పోస్టర్లను ఒక ఎమోషనల్ నోట్‌తో పోస్ట్ చేశాడు. "నేను ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలలో ఇదీ ఒకటి. మా సినిమా 'హోమ్‌బౌండ్' 98వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీకి ఇండియా తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైనందుకు చాలా గౌరవంగా, సంతోషంగా ఉంది.
కథను, మమ్మల్ని, ఇండియన్ సినిమా కోసం ప్రపంచ వేదికపై మేము ఏం తీసుకురాగలమో నమ్మిన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కి మా కృతజ్ఞతలు. టీం అందరికీ నా హృదయపూర్వక అభినందనలు" అని రాశాడు.
హోమ్‌బౌండ్ మూవీ డైరెక్టర్ నీరజ్ ఘైవాన్ కూడా సినిమా పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఓ పోస్ట్ చేశాడు. "ఓ మై గాడ్.. ఇది నిజం.." అని క్యాప్షన్ పెట్టాడు. అటు జాన్వీ కపూర్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది.
"ఈ సినిమాలోని ప్రతి భాగం ఒక కల లాంటిది. ఈ ప్రయాణం, ఇందులో ఉన్న వ్యక్తులు, ఈ కథకు ఉన్న అర్థం, ఇది మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంత పర్సనల్‌గా ఉందనేది ఇది నిరూపిస్తుంది. ఈ ప్రయాణంలో భాగమైనందుకు కృతజ్ఞురాలిగా ఉన్నాను. ఇది నా మనసులో నిజంగా ఒక రివార్డ్ లాంటిది. వాళ్ళ టాలెంట్, మంచితనం, ధైర్యం నన్ను వాళ్లను గౌరవించేలా ప్రేమించేలా చేస్తుంది. నీరజ్ ఘైవాన్, కరణ్ జోహార్, విశాల్ జెథ్వా, ఇషాన్ ఖట్టర్ ఈ సినిమాలో భాగం. సెప్టెంబర్ 26న థియేటర్లలో చూడండి" అని రాసింది.
చాలామంది సెలబ్రిటీలు ఈ పోస్టులకు రియాక్ట్ అయ్యారు. మహీప్ కపూర్ స్పందిస్తూ.. "ఓ మై గాడ్.. అభినందనలు" అని రాసింది. శనాయ కపూర్ స్పందిస్తూ.. "ఓ మై గాడ్" అని కామెంట్ చేసింది. అటు నీనా గుప్తా కూడా.. "చాలా చాలా అభినందనలు" అని రాసింది. వరుణ్ ధావన్ కూడా టీంకు కంగ్రాట్స్ చెప్పాడు.
ఆస్కార్స్ కు అధికారిక ఎంపికలను చూసుకునే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. 'హోమ్‌బౌండ్' మూవీ 2026 అకాడమీ అవార్డ్స్‌కి ఇండియా తరపున ఎంట్రీ అవుతుందని శుక్రవారం (సెప్టెంబర్ 20) కన్ఫర్మ్ చేసింది. గతంలో ఇండియా నుంచి 'మదర్ ఇండియా' (1957), 'సలామ్ బాంబే!' (1988), 'లగాన్' (2001) లాంటి మూడు సినిమాలు అదే కేటగిరీలో నామినేషన్స్ సాధించాయి. కానీ ఏదీ అవార్డు గెలవలేదు. 'హోమ్‌బౌండ్' తో ఇండియా మళ్ళీ ఫైనల్ షార్ట్‌లిస్ట్‌లో ఒక స్థానం కోసం, అవార్డు కోసం వందకు పైగా ఇంటర్నేషనల్ నామినేషన్లతో పోటీ పడనుంది.
నీరజ్ ఘైవాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జెథ్వా లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా మే నెలలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. అక్కడ దీనికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. తర్వాత టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పీపుల్స్ ఛాయిస్ కేటగిరీలో రెండో రన్నర్-అప్ అవార్డును గెలుచుకుంది.
నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందిన మూవీ ఇది. 'హోమ్‌బౌండ్' గ్రామీణ భారతదేశానికి చెందిన ఇద్దరు అబ్బాయిల ప్రయాణాన్ని చూపిస్తుంది. వాళ్ళు గౌరవం కోసం ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలని ఆశిస్తారు. దారిలో వాళ్ళు కులం, మతపరమైన కష్టనష్టాలను ఎదుర్కొంటారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదల కానుంది.
సంబంధిత కథనం