Janhvi Kapoor Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు ఒక్క సెకను చాలు, నాకు మాత్రం 10 రోజులు: జాన్వీ కపూర్
Janhvi Kapoor Comments On Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌పై దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఒక్క సెకను చాలని, అదే తనకు అయితే పది రోజులు పడుతుందని ఉలజ్ మూవీ ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.
Janhvi Kapoor About Jr NTR: బాలీవుడ్ బ్యూటి, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తూ టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టనుంది. తారక్‌కు జోడీగా జాన్వీ నటిస్తోందని తెలిసినప్పటి నుంచి దేవరపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది.
దాంతోపాటు ఆచార్యతో బిగ్గెస్ట్ ప్లాప్ చవిచూసిన కొరటాల శివ దేవర సినిమాను తెరకెక్కించడంతో అందరి దృష్టి దానిపైనే పడింది. అయితే, బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోన్న జాన్వీ కపూర్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. జాన్వీ కపూర్ ఇటీవల నటించిన బాలీవుడ్ ఉలజ్.
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఉలజ్ సినిమా ఆగస్ట్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉలజ్ ప్రమోషన్స్ చేస్తోంది జాన్వీ కపూర్. ఈ ప్రమోషన్స్‌లోనే దేవర గురించి, జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ ప్రశంసలు కురిపించింది బ్యూటిఫుల్ జాన్వీ కపూర్.
"తెలుగు వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వారి పనితీరు నాకు చాలా నచ్చింది. వారు కళను, సినిమాను చాలా గౌరవిస్తారు. ఇతరులతో ఎంతో హుందాగా ప్రవర్తిస్తారు. కథపై నమ్మకంతో పని చేస్తారు. దేవర సినిమా డైరెక్టర్ కొరటాల శివ చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇద్ద పెద్ద ప్రాజెక్ట్‌కు ఆయన ఒక కెప్టెన్. ఏ విషయాన్ని అయినా సున్నితంగా చెబుతారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సులభంగా ఉంటుంది" అని తెలిపింది జాన్వీ కపూర్.
"దేవరలో నేను జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నాం. తారక్ ఎనర్జిటిక్ హీరో. ఆయన సెట్‌కి రాగానే సందడి వాతావరణం నెలకొంటుంది. అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారు. తారక్ రాగానే సెట్‌కు కళ వస్తుంది. ఇటీవల మా ఇద్దరి మధ్య ఓ సాంగ్ షూటింగ్ జరిగింది. ఇందులో ఎన్టీఆర్ ఎనర్జీ చూసి నేను షాక్ అయ్యాను. తారక్ చాలా స్పీడ్ అండ్ ఎనర్జీతో డ్యాన్స్ చేయగలరు" అని జాన్వీ కపూర్ చెప్పింది.
"తారక్ ఏ విషయాన్ని అయినా ఒక్క సెకన్‌లో నేర్చుకుంటారు. అదే నాకు అయితే 10 రోజులు పడుతుంది (నవ్వుతూ). అందుకే రెండో పాటకు నేను ఇప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టాను" అని ఎన్టీఆర్‌పై జాన్వీ కపూర్ ప్రశంసల వర్షం కురిపించింది. కాగా ఇటీవల తాను అనారోగ్యంతో ఇబ్బందిపడినట్లు, దాని నుంచి ప్రస్తుతం కోలుకుంటున్నట్లు జాన్వీ కపూర్ తెలిపింది.
"ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నా తల్లిదండ్రులు నేర్పారు. వాళ్లతోపాటు నా అభిమానులంతా గర్వపడేలా నేను ఉంటాను. ప్రస్తుతం సంతోషకరమైన లైఫ్‌ను జీవిస్తున్నాను. రిలేషన్ గురించి చెప్పే సమయం లేదు" అని తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. కాగా కోస్టల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న దేవర మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.