Jamtara season 2 trailer: సైబర్ క్రైమ్ థ్రిల్లర్ జామ్తారా సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది
Jamtara season 2 trailer: సైబర్ క్రైమ్ థ్రిల్లర్ జామ్తారా సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. ఈసారి మరింత థ్రిల్ అందిస్తూ, సైబర్ క్రైమ్‌కు రాజకీయాన్ని జోడించి ప్రేక్షకులను అలరించడానికి ఈ వెబ్ సిరీస్ వస్తోంది.
Jamtara season 2 trailer: చంబల్ లోయ గురించి తెలుసు కదా. ఒకప్పుడు దోపిడీ దొంగలకు కేరాఫ్. వాళ్లు దారి దోపిడీలు చేసేవారు. కానీ ఈ డిజిటల్ యుగంలో దోపిడీ రూపు మార్చుకొని సైబర్ క్రైమ్‌కు దారి తీసింది. ఇలాంటి సైబర్ క్రైమ్‌కు అడ్డా జార్ఖండ్‌లోని జామ్తారా అనే ఓ చిన్న ఊరు. పొట్ట కోస్తే అక్షరం ముక్క రాని ఇక్కడి యువత ఈ సైబర్ క్రైమ్ చేయడంలో మాత్రం సిద్ధహస్తులు.

ఇలా సైబర్ నేరగాళ్లపై ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన వెబ్ సిరీస్ జామ్తారా. సబ్ కా నంబర్ ఆయేగా అనేది ఈ సిరీస్ ట్యాగ్ లైన్. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ వస్తోంది. తొలి సీజన్ ప్రేక్షకులకు ఎంతో థ్రిల్ పంచింది. ఆ చిన్న ఊళ్లో కూర్చొని ఈ సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ కస్టమర్లను ఎలా దోచుకుంటున్నారో కళ్లకు కట్టిన సిరీస్ ఇది. మన మొబైల్స్‌కు ఏదో లింక్ రావడం.. లాటరీలో భారీ మొత్తం గెలుచుకున్నారనే మెసేజ్‌లు, బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం మీ నంబర్‌కు ఓ ఓటీపీ వచ్చింది కాస్త చెబుతారా అని అడగటం మనం చూస్తూనే ఉంటాం.
ఇలాంటి సైబర్ క్రైమ్‌కు జామ్తారాలోని యువత కేరాఫ్. స్కూల్ స్టూడెంట్స్ నుంచి ఏ పనీపాటా లేని యువత వరకూ అందరూ ఇదే పనిలో ఉంటారు. తొలి సీజన్‌లో కేవలం ఈ క్రైమ్ ఎలా జరుగుతుందో క్రియేటర్స్ చూపించగా.. ఈ రెండో సీజన్‌లో రాజకీయాలు, సైబర్ క్రైమ్ ఎలా కలిసి ప్రయాణిస్తాయో చెప్పే ప్రయత్నం చేశారు. ట్రైలర్ మొత్తం వీటి చుట్టే తిరుగుతుంది.
అమిత్ సియాల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ జామ్తారా రెండో సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండేలా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను నేషనల్ అవార్డు విన్నర్ అయిన సౌమేంద్ర పధి డైరెక్ట్ చేశాడు. త్రిశాంత్ శ్రీవాస్తవ స్టోరీ అందించాడు. సెప్టెంబర్ 23 నుంచి జామ్తారా రెండో సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. తొలి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా, ప్రజలను మరింత జాగృతం చేసేలా రూపొందించినట్లు డైరెక్టర్ సౌమేంద్ర చెప్పాడు.